ఆత్మకూర్/అలంపూర్, న్యూస్‌లైన్: అసలే ముసురు వర్షాలు.. అపై పారిశుధ్యం పడకేయడంతో పల్లెలను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరిద్దరి చొప్పున అతిసార, మలేరియా బారినపడి తల్లడిల్లిపోతున్నారు. ఒంట్లో సత్తువలేక..ఆస్పత్రికి మంచానికే పరిమితమవుతున్నారు. వ్యాధులు స్వైరవిహారం చేస్తున్నా.. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు తగిన చర్యలు చేపట్టలేకపోతున్నారు.
నీటిని సరఫరా చేసే పైప్‌లైన్లు కలుషితమవడం, క్లోరినేషన్ ప్రక్రియ చేపట్టకపోవడం వల్లే అతిసార ప్రబలిందని బాధితులు వాపోతున్నారు. కాగా, గతవారం రోజుల్లో జిల్లాలో ఇద్దరు మృత్యువాతపడగా, వంద మందికి పైగా అతిసారరోగులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా మంగళవారం ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్‌లోలో 30 మంది అస్వస్థతకు గురయ్యారు.
గ్రామానికి చెందిన చిన్న మణెమ్మ, నాగేశ్వరి, శ్రీను, సులోచన, పెద్ద మణెమ్మ, సరోజ, వెంకటేష్, మాసూం, బాలకిష్టన్న, మణెమ్మ, వెంకటన్న, మాలన్‌బీకి వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆత్మకూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే గ్రామంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వైద్య శిబిరంలో మరికొందరు చికిత్సపొందగా.. మరికొందరు పట్టణంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం తీసుకుంటున్నారు. తహశీల్దార్ రాజేందర్‌గౌడ్, ఎంపీడీఓ శరత్‌చంద్రబాబు, ఈఓపీఆర్‌డీ రఘునాథ్‌రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీరామ్‌సుధాకర్ గ్రామాన్ని సందర్శించి అతిసార బాధితులకు చికిత్స అందితున్న తీరును పరిశీలించారు.
చిట్యాలలో అదుపులోకి రాని అతిసార
మక్తల్ రూరల్: మండలంలో అతిసార విజృంభిస్తోది. చిట్యాలలో ఇప్పటికే ఇద్దరు చనిపోగా, మరికొందరు అస్వస్థతకు గురయ్యారు.
తాజాగా మంగళవారం మంతన్‌గోడుకు చెందిన ఇద్దరు, రుద్రసముద్రం గ్రామానికి చెందిన ఒకరు, నేరడుగంకు చెందిన మరో ఇద్దరు, కర్ని గ్రామానికి మరో ఇద్దరు..ఇలా ఎనిమిది మంది అతిసారబారిన పడ్డారు. వీరిని కుటుంబసభ్యులు వెంటనే మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరికొందరు స్థానిక ఆర్‌ఎంపీల వద్ద చికిత్సపొందుతున్నారు.
అలంపూర్‌లో 10మందికి..అలంపూర్, న్యూస్‌లైన్: మండలంలోని వివిధ గ్రామాల నుంచి అతిసార రోగులతో అలంపూర్ ప్రభుత్వాసుపత్రి కిటకిటలాడింది. కాశీపురం గ్రామానికి చెందిన తులసమ్మ, పద్మావతిలు రెండురోజులుగా ఇక్కడే చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని అక్బర్‌పేటకు చెందిన పరమేష్ అనే విద్యార్థి వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిపాలయ్యాడు. రాము అనే యువకుడు కూడా అతిసారతో ఆస్పత్రిలో చేరాడు. అలాగే బుక్కాపురం, కోనేరు, కాశీపురం, ఇమాంపురం, అలంపూర్ గ్రామాల్లో వ్యాధి బాధితులు ఉన్నారు. కాగా, ప్రతిరోజు అతిసారంతో ఐదు నుంచి ఎనిమిది ఆస్పత్రికి వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
పల్లెకు సుస్తీ
Published Wed, Aug 21 2013 1:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement
Advertisement