మృతి చెందిన గురుండ్ల వనజ(ఫైల్)
భీమిని(బెల్లంపల్లి): కన్నెపల్లి మండల కేంద్రంలో విషజ్వరాలు ఇంకా అదుపులోకి రాలేదు. గత వారం రోజులుగా జ్వరాలు ప్రబలుతున్నాయి. ఆదివారం నాటికి విషజ్వరాల బారిన పడి ముగ్గురు మృతి చెందారు. కన్నెపల్లి గ్రామ సాక్షరభారత్ సమన్వయకర్త ఏదుల మల్లేశ్(40) శనివారం మధ్యాహ్నం కరీంనగర్ ఆస్పత్రిలో మృతి చెందగా, స్థానిక ఎస్టీ కాలనీకి చెందిన చింతపురి వెంకక్క(70) శనివారం ఉదయం జ్వరంతో ఇంట్లోనే మృతి చెందింది. ఆదివారం ఎస్టీ కాలనీలోని రాజారాం–పోసక్క దంపతుల కూతురు గురుండ్ల వనజ(19) జ్వరంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వనజ బెల్లంపల్లిలో ఇంటర్మీయెడిట్ చదువుతోంది. మరో 50 మంది వరకు జ్వరంతో మంచం పట్టారు. రోజు రోజుకూ జ్వరాల సంఖ్య పెరుగుతోంది. గ్రామంలో ఇంటికిద్దరు విషజ్వరం సోకి బాధపడుతున్నారు.
ఆదివారం జిల్లా వైద్యాధికారి భీష్మా వైద్య సిబ్బందితో వెళ్లి కన్నెపల్లి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి కొంత మందిని 108 ద్వారా మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ప్రకాశ్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి నరేందర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్, ఎంపీడీవో రాధాకృష్ణ, తహసీల్దార్ విజయానంద్ గ్రామంలో పర్యటించి పరిసరాలను పరిశీలించారు. డీఎంఅండ్‌హెచ్‌వో మాట్లాడుతూ మృతి చెందిన వారు విషజ్వరంతో మృతి చెందలేదని వేర్వేరు కారణాలతో మృతి చెందారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుండగా డీఎంఅండ్‌హెచ్‌వో ఇలా మాట్లాడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టకపోవడంపై సర్పంచ్ గురుండ్ల సత్తమ్మ, పంచాయతీ కార్యదర్శి జోసఫ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని వారికి సూచించారు. గ్రామంలో నీటి నిలువలు లేకుండా చూడాలని క్లోరినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు.
ప్రత్యేక చర్యలు: కలెక్టర్
కన్నెపల్లి మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పంచాయతీ అధికారి గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా గిరిజన సంక్షేమ శాఖతో పాటు పలు శాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించారని, కాలనీలో ఒకే బావి ఉండడంతో ప్రస్తుతం ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకు వద్ద బురద నీరు చేరి నీరు కలుషితం అవుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో ఆ కాలనీ మొత్తం జ్వరాల బారిన పడుతున్నారన్నారు. ఈ ఓవర్‌హెడ్ ట్యాంకు క్లోరినేషన్‌తో పాటు చుట్టూ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయించి తాగునీటి కోసం బోర్లు ఏర్పాటు చేయిస్తామన్నారు. అంతేకాకుండా గ్రామంలో పారిశుధ్యంపై గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు. కన్నెపల్లి మండలాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సంబంధిత తహసీల్దార్, ఎంపీడీవో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, వైద్య సిబ్బంది సందర్శించి వైద్య శిబిరంతో పాటు పారిశుధ్యం కోసం ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment