ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఇన్‌ఫ్లూయెంజా (శ్వాసకోశ సంబంధిత వ్యాధి) దడ పుట్టిస్తోంది. ఏ ఇంటికెళ్లినా ఎవరో ఒకరు దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూనే ఉన్నారు. ఈ వైరస్ కోవిడ్ మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. బాధితులు దాదాపు పది నుంచి పక్షం రోజుల వరకు జ్వరం బారిన పడతారు. జ్వరం తగ్గిన కూడా ఒళ్లు నొప్పులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.
ఐదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఎక్కువగా సోకుతోంది. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్ర ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మందికి ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలే కనిపిస్తున్నాయి. చిల్డ్రన్ వార్డులో ఎక్కువ మంది చిన్నారులు శ్వాస సంబంధిత ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. కొంత మంది మృత్యువాత పడిన ఘటనలు సైతం ఉన్నాయి.
అతలాకుతలం..
ప్రస్తుతం జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో వీటి బారిన పడి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 104 కేసులు నమోదయ్యాయని పేర్కొంటుండగా, అనధికారికంగా 200కు పైగానే బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రైవేట్‌తో పాటు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి, ఉట్నూర్, బోథ్ ఏరియా ఆస్పత్రులు జ్వర పీడితులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈనెలలోనే 32 మంది డెంగీ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. కాగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి లెక్క తేలడం లేదు. మరికొంత మంది బాధితులను హైదరాబాద్, నిజామాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని యవత్మాల్, నాగ్‌పూర్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
దోచుకుంటున్న ల్యాబ్‌లు..
సీజనల్ వ్యాధులను అదునుగా చేసుకొని కొంత మంది ల్యాబ్‌ల నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు సంబంధిత ల్యాబ్‌లకు పంపి బాధితుల నుంచి డబ్బులు గుంజుతున్నారు.
నిర్వాహకులకు 40 శాతం అందజేసి 60 శాతం వైద్యులు తీసుకుంటుండడంతో వీరి బిజినెస్ జోరుగా సాగుతోంది. అర్హతలు లేకున్నప్పటికీ చాలా మంది ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు సమాచారం. ఇంకొంత మంది శిక్షణ పూర్తి కాకుండానే ప్రైవేట్ ల్యాబ్‌లలో పనిచేస్తూ సొంతంగా పరీక్షలు జరుపుతున్నారనే ప్రచారం ఉంది.
ఈ తతంగమంతా వైద్యారోగ్య శాఖ అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. నిబంధనల ప్రకారం ప్యాథలాజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, మైక్రోబయాలజిస్ట్ కోర్సు పూర్తి చేసినవారు మాత్రమే ల్యాబ్ నిర్వహణ చేపట్టవచ్చు. అయితే దీనికి విరుద్ధంగా అనర్హులు ల్యాబ్‌లను ఏర్పాటు చేసి వైద్యులతో కలిసి అక్రమ దందా సాగిస్తున్నారు.
కిక్కిరిసిన చిల్డ్రన్ వార్డు..
రిమ్స్ ఆస్పత్రి చిల్డ్రన్ వార్డు చిన్నారులతో కిక్కిరిసి కనిపిస్తోంది. నెలరోజులకు పైగా ఇదే పరిస్థితి. వార్డులో 70 బెడ్లు ఉంటే.. వందకు పైగా చిన్నారులు జ్వరాలతో చికిత్స పొందుతుండడం గమనార్హం. వీరిలో ఎక్కువగా ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. చాలా మంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
పక్షం దాటిన జ్వరం వీడటం లేదు. అలాగే మహిళా వార్డు పరిస్థితి కూడా ఇ లాగే ఉంది. జ్వరాలకు సంబంధించి అన్ని వార్డులకు కలిపి దాదాపు 400 మంది వరకు చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా రిమ్స్‌లో ఓపీ 1600 వరకు నమోదవుతుంది. ఆయా పీహెచ్‌సీల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 వరకు ఓపీ ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
వ్యాధుల కట్టడికి చర్యలు..
జిల్లాలో వ్యాధుల నివారణకు చర్యలు చేపడుతున్నాం. వాతావరణ మా ర్పుల కారణంగా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువ మంది శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఏడాది 104 డెంగీ కేసులు నమోదయ్యాయి. వారానికి రెండుసార్లు డ్రైడే పాటించాలని అవగాహన కల్పిస్తున్నాం.
– మెట్‌పెల్లివార్ శ్రీధర్,జిల్లా మలేరియా నివారణ అధికారి
Comments
Please login to add a commentAdd a comment