సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల వైరల్ ఫీవర్లు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో కోవిడ్–19 పరీక్షల్లో పాజిటివిటీ రేటు సైతం వేగంగా పెరుగుతున్నట్లు గుర్తించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలకు జాగ్రత్త చర్యలను సూచిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఇన్‌ఫ్లూయెంజా లైక్ ఇల్‌నెస్ (ఐఎల్‌ఐ), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్ (ఎస్‌ఏఆర్‌ఐ) సమస్యలపై ఇదివరకే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేయగా.. ప్రస్తుతం కోవిడ్–19 కేసుల దృష్ట్యా జాగ్రత్త చర్యలను పాటించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు వివిధ అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భల్ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.
అలసత్వం వద్దు..
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోవిడ్–19 కేసుల నమోదు వేగంగా పెరుగుతోంది. కేరళలో 26.4 శాతం, మహారాష్ట్రలో 21.7 శాతం, గుజరాత్‌లో 13.9 శాతం, కర్ణాటకలో 8.6 శాతం, తమిళనాడులో 6.3 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏమాత్రం అలస్వతంగా ఉండవద్దని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ దిశగా టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్‌లను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది.
పరీక్షలను పెద్ద ఎత్తున పెంచుతూ కోవిడ్–19 జాగ్రత్తలను పాటించేలా చేయాలని, కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కేసుల సంఖ్య పెరిగి ప్రమాదానికి దారితీయకుండా ముందస్తు జాగ్రత్తలు అవసరమని కేంద్రం వివరించింది. ఇదే సమయంలో అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్, ఇన్‌ఫ్లుయాంజా కేసులపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది.
దేశంలో ఈ తరహా కేసులు జనవరి నుంచి మార్చి చివరి వరకు, ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కనిపిస్తాయని, ఈ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
కోవిడ్–19ను అరికట్టేందుకు ప్రజలు అన్ని రకాల జాగ్రత్త చర్యలు పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశించింది.
► వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, క్రమం తప్పకుండా చేతులు శుభ్రపర్చుకోవాలని, శానిటైజర్ వినియోగించాలని సూచించింది.
► దీర్ఘకాలిక వ్యాధులున్న వారు వీలైనంత తక్కువగా బయటకు వెళ్లాలని స్పష్టం చేసింది.
► వైద్యులు, పారామెడిక్స్, ఇతర ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మాస్క్‌లు ధరించాలని స్పష్టం చేసింది.
► రద్దీగా ఉండే ప్రాంతాల్లో, క్లోజ్డ్ సెట్టింగులున్న చోటఉండాల్సిన వారు తప్పకుండా మాస్క్‌లు ధరించాలి
► తుమ్మేటప్పుడు, దగ్గుతున్నప్పుడు ముక్కు, నోరు కప్పుకోవడానికి రుమాలు అందుబాటులో ఉంచుకోవాలి
► బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరు తరచుగా చేతులు శుభ్రపర్చుకోవాలి
► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించాలి
► కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలను వీలైనంత ఎక్కువ సంఖ్యలో చేయాలి. లక్షణాలను గుర్తిస్తే వెంటనే ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి
ఆస్పత్రుల్లో ఏర్పాట్లు..
ఎలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునే విధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలని, వైద్య పరికరాల పనితీరును సరిచూసుకోవాలని తెలిపింది. అలాగే ఆక్సిజన్ వసతులను పునఃసమీక్షించుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు అన్ని రకాల ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని ఆదేశించింది. ఐసీయూ పడకలు, ఆక్సిజన్ పడకల తీరును నిరంతరం పరిశీలించాలని, ఆస్పత్రుల వారీగా సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈనెల 27న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కోవిడ్ మళ్లీ కోరలు చాస్తోంది! రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Published Sun, Mar 26 2023 3:09 AM | Last Updated on Sun, Mar 26 2023 3:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment