పీడకల లాంటి కోవిడ్–19 మానవాళిని ఇంకా నీడలా వెంటాడుతూనే ఉంది. మొదలై మూడేళ్ళు నిండినా, ఇప్పటికీ ఏదో ఒక కొత్త రూపంలో వేధిస్తూనే ఉంది. దేశంలో కొన్నాళ్ళు సద్దుమణిగిన కరోనా ఈ మార్చిలో క్రమంగా పడగవిప్పింది.
కరోనా కేసులు గత అయిదు వారాల్లో ఏకంగా 9 రెట్లు పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. డిసెంబర్ 22 తర్వాత సరిగ్గా మూడు నెలలకు బుధవారం మళ్ళీ ప్రధాని మోదీ సారథ్యంలో కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం దాని ఫలితమే.
ఒక వంక కరోనా, మరో వంక ఇన్‌ఫ్లుయెంజా కేసులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో తక్షణ కార్యాచరణకు ప్రభుత్వం కదిలింది. కరోనా కేసుల ‘టెస్టింగ్ – ట్రాకింగ్ – చికిత్స – టీకాకరణ – కోవిడ్ సముచిత ప్రవర్తన’ అనే అయిదంచెల వ్యూహంపై దృష్టి కొనసాగించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకూ గురువారం సూచించింది.
త్వరలో దేశమంతటా మాక్ డ్రిల్స్ నిర్వహించడానికీ సమాయత్తమవుతోంది. వెరసి, దేశంలో ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత, టీకాకరణ వర్తమాన స్థితి లాంటి వాటిపై మరోసారి ఆలోచన, అంచనా మొదలైంది.
ఫిబ్రవరి రెండోవారంలో రోజూ సగటున 108 కేసులొస్తే, ఇప్పుడది రోజుకు 966 కేసులకు పెరగడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల్లో 1 శాతమే భారత్‌లోనివనీ, మొత్తంగా దేశంలో ఉన్నవి 7600 కరోనా కేసులే అనీ అధికారిక లెక్క. అయితే టెస్టింగ్ గణనీయంగా తగ్గిన నేపథ్యంలో కేసుల అసలు సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉండవచ్చు.
ప్రస్తుతానికి మహా రాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఎనిమిదింటిలో గరిష్ఠంగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్‌లో జన్యుపరమైన వేరియేషన్లను గమనించడానికి 50కి పైగా ప్రయోగశాలలతో కూడిన గ్రూపు ‘ఇండియన్ సార్స్– కోవ్–2 జీనోమిక్స్ కన్సార్టియమ్’ (ఇన్సాకాగ్) పనిచేస్తోంది.
వీలైనంత ఎక్కువగా కోవిడ్ పాజిటివ్ నమూనాలను ఈ ఇన్సాకాగ్ ల్యాబ్‌లకు పంపి, జన్యు నిర్మాణక్రమాన్ని విశ్లేషిస్తే ఏ కొత్త వేరియంట్ వచ్చినా ఇట్టే కనిపెట్టవచ్చు. తక్షణ చర్యలు చేపట్టవచ్చు. అందుకే, ప్రభుత్వం సైతం ల్యాబ్‌ల ద్వారా వీలైనన్ని పాజిటివ్ శాంపిళ్ళను పరీక్షించి, జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
మునుపటి కరోనా వేరియంట్లకు భిన్నంగా ఈసారి మూడు అదనపు కొమ్ములున్న ఉత్పరివర్తన మైన ఎస్‌బీబీ.1.16 (మరో మాటలో ‘ఆర్క్‌టూరస్’) వేరియంట్ తాజా కేసుల విజృంభణకు కారణ మని ప్రాథమిక విశ్లేషణ. దేశంలో తొలిసారిగా జనవరిలో బయటపడ్డ ఈ వేరియంట్ కేసుల సంఖ్య ఏ నెలకానెల పెరుగుతూ వస్తుండడం గమనార్హం.
ఈ వేరియంట్ తీవ్రత, వ్యాప్తి ఎంత అన్నది అధ్యయనం చేయాల్సి ఉంది. కేసులు పెరుగుతున్నా, ఆస్పత్రి పాలవడం, ప్రాణాలు కోల్పోవడం లాంటివి ఎక్కువగా లేవు. అది పెద్ద ఊరట. నిజానికి, ఇప్పటి వరకు దేశంలో మొత్తం 220.65 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు వేశారు.
ఇది పెద్ద సంఖ్యే. వ్యాధినిరోధకత సాధించిన మన ప్రజానీకం ఇప్పటికే బీఎ.2.75, బీఎ.5, బీక్యూస్, ఎక్స్‌బీబీ.1.5 లాంటి పలు కరోనా వేరియంట్లను తట్టుకొని నిలబడింది. కొత్త వేరియంట్‌ను కూడా తట్టుకొంటే, మంచిదే. అలా కాకుంటేనే చిక్కు.
కరోనా, ఫ్లూ, సీజనల్ వ్యాధులు సహా కారణాలేమైనా తీవ్ర శ్వాసకోశ సమస్యలు అనేకం ప్రస్తుతం నమోదవుతూ ఉండడం ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుత ఫ్లూ సీజన్‌లో దేశంలో శరవేగంగా వ్యాపిస్తూ, శ్వాసకోశ సమస్యలు కల్పిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ సైతం కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలో ఉన్నదే.
‘ఇన్‌ఫ్లుయెంజా–ఏ’లో ఉపవర్గానికి చెందిన ఈ వైరస్ కూడా కరోనా వైరస్‌లా మహమ్మారిగా విజృంభించి, 1968లో ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 40 లక్షల మరణాలకు కారణమైంది.
మన దేశంలో 2010లో బయటపడ్డ ఈ రకం వైరస్‌కు ఒకసారి గురైతే జీవితకాల వ్యాధినిరోధకత వస్తుందట. అయితే కరోనా, దీర్ఘకాలం గొంతునొప్పి, దగ్గుతో వేధించే ఇన్‌ఫ్లుయెంజా – రెండూ ఎప్పటికప్పుడు జన్యు ఉత్పరివర్తనాలతో రూపం మార్చుకొనే ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లే.
అందుకే, ఇన్‌ఫ్లుయెంజా సైతం కరోనాలా ఒకరి నుంచి మరొకరికి మహమ్మారిలా విస్తరించే ముప్పుంది. దేశంలో ఏ,బీ రకాల ఇన్‌ఫ్లుయెంజాలు రెండూ ఉన్నందున తాత్కాలికంగా హడావిడి చేసి, సమస్యను అదుపు చేశామనడం కాక ప్రభుత్వ పక్షాన సమగ్ర ఆరోగ్య ప్రణాళికా రచన తప్పనిసరి.
రకరకాల మహమ్మారుల నివారణ, ఎదుర్కొనే సంసిద్ధత, కార్యాచరణలకు సంబంధించి ‘మహమ్మారి నివారణ ఒప్పందం’ చేసుకోవాలని విశ్వవేదికపై వివిధ దేశాలు, సంస్థలు ఇప్పటికే చర్చిస్తున్నాయి. ఆర్థికంగా, పారిశ్రామికంగా వర్ధమాన దేశాలైన ‘గ్లోబల్ సౌత్’కు ప్రతినిధిగా, జీ20 దేశాలకు ప్రస్తుత సారథిగా భారత్ ఇందులో చురుకైన పాత్ర పోషించాలి.
అందరికీ ఫలాలు సమంగా అందేలా చూడాలి. కరోనా, ఫ్లూ కేసులు వేలల్లో నమోదైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలే కాదు, ప్రజలూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సుదీర్ఘంగా వేధిస్తున్న వ్యాధులతో విసుగొచ్చి, ముందు జాగ్రత్తలు పాటించకుంటే మనకే నష్టం. ఈ వ్యాధికారక వాతావరణంతోనూ సహజీవనం చేయడం నేర్చుకోవాలి.
సభలు, సమావేశాలు, సినిమాలు, షికార్లు, ప్రయాణాలు – ఇలా జన సమ్మర్దం ఉండే ప్రతిచోటా స్వచ్ఛందంగా మాస్కు ధారణ, భౌతికదూరం తప్పనిసరి చేసుకోవాలి. వీటితో పాటు తరచూ చేతుల పరిశుభ్రతను ఒక అలవాటుగా చేసుకోవాలని నిపుణుల సూచన.
ఈ కనీస జాగ్రత్తలతో కరోనాతో సహా అన్ని రకాల వైరల్, ఫ్లూ దాడుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మహమ్మారుల కథ ఇంకా ముగిసిపోలేదు. మన జాగ్రత్తలే మనకు రక్ష.
అప్రమత్తత అవసరమే!
Published Fri, Mar 24 2023 12:29 AM | Last Updated on Fri, Mar 24 2023 8:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment