విలేజ్‌ క్లినిక్స్‌ కేంద్రంగా కరోనా కట్టడి.. సీఎం జగన్‌ ఆదేశాలు | CM YS Jagan On Corona Prevention center of Village Clinics | Sakshi
Sakshi News home page

విలేజ్‌ క్లినిక్స్‌ కేంద్రంగా కరోనా కట్టడి.. సీఎం జగన్‌ ఆదేశాలు

Published Tue, Dec 27 2022 3:47 AM | Last Updated on Tue, Dec 27 2022 2:34 PM

CM YS Jagan On Corona Prevention center of Village Clinics - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు కేంద్రంగా గ్రామ స్థాయిలోనే సమర్థంగా కరోనా నివారణ, నియంత్రణ, చికిత్స చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా నిర్దిష్ట నిర్వహణ విధా­నాలు (ఎస్‌వోపీ) రూపొందించాలని అధికారు­లకు సూచించారు.

కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, మెడికేషన్, ఇతర సేవలు విలేజ్‌ క్లినిక్‌ల స్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకు ముందస్తు సన్నద్ధత, ఇతర అంశాలపై సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ..

విస్తృత అవగాహన.. సదుపాయాల తనిఖీ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పర్య­వేక్షణలో విలేజ్‌ క్లిని­క్‌లు పని చేయాలి. వీటిలో ఏఎన్‌ఎం, ఆశా వర్క­ర్‌లు అందుబాటులో ఉండాలి. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసు­కోవడం, ఇతర కరోనా నియంత్రణ చర్యలపై ప్రజ­లకు మళ్లీ విస్తృత అవ­గాహన కలిగించాలి. కరోనా అనుమానిత లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరం, ఇతర సమస్యలున్న వారికి తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయాలి.

ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలపై మరోసారి విస్తృత తనిఖీలు చేపట్టాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సన్నద్ధత అవసరం. మాస్కులు, పీపీఈ కిట్లు, టెస్టింగ్‌ సామర్థ్యంపై మరోసారి సమీక్షించాలి. అన్ని ఆసుపత్రుల్లోనూ మందులు అందుబాటులో ఉంచాలి. కోవిడ్‌ లక్షణాలున్న వారిని తక్షణమే విలేజ్‌ క్లినిక్స్‌కు రిఫర్‌ చేసేలా సచివాలయ సిబ్బంది, వలంటీర్లు చర్యలు తీసుకోవాలి.

జనవరి 26 నాటికి అన్ని చోట్లా పనులు 
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పుతున్నాం. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలల పనులు వేగవంతం చేయాలి. ఇటీవల కొత్తగా మంజూరు చేసిన పార్వతీపురం కళాశాల సహా ఇంకా ప్రారంభం కాని చోట్ల పనులను వెంటనే ప్రారంభించాలి. వచ్చే జనవరి 26వతేదీ నాటికి పార్వతీపురంతో సహా రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా చేపడుతున్న అన్ని వైద్య కళాశాలల నిర్మాణ పనులు మొదలవ్వాలి.

జనవరి 26 నాటికి అన్ని విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు కావాలి. విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి బోధనాసుపత్రుల వరకు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం అందుబాటులో ఉండేలా ఎస్‌వోపీలు రూపొందించాలి. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి అవసరమైన వసతి కల్పించాలి. 

104 ఎంఎంయూ సేవల తనిఖీ
ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలు కోసం అవసరమైన అదనపు 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌(ఎంఎంయూ) వాహనాలను జనవరి 26 నాటికి సిద్ధం చేసుకోవాలి. 104 సేవలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ రిఫరల్‌కు సంబంధించిన యాప్‌ ఏఎన్‌ఎం, ఆరోగ్యమిత్రతో సహా అందరికీ అందుబాటులో ఉండాలి. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో ఫాలో అఫ్‌ మెడిసిన్‌ అందుతుందా లేదా? అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఏఎన్‌ఎంలు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకునే సమయంలో దీన్ని తెలుసుకోవాలి. 

కోవిడ్‌ కట్టడికి సన్నద్ధత ఇలా...
కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌ 7 కేసులేవీ ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదు కాలేదని సమీక్ష సందర్భంగా అధికారులు తెలిపారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లభ్యత, ప్లాంట్లు, మందులపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు ఫీవర్‌ సర్వేను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

ఆర్టీపీసీఆర్‌ పరీక్షల నిర్వహణకు వీలుగా ప్రస్తుతం 13 ల్యాబ్‌లు అందుబాటులో ఉండగా అన్ని చోట్లా సిబ్బంది ఉన్నారని వివరించారు. వీటి ద్వారా రోజుకు 30 వేల పరీక్షలు నిర్వహించవచ్చన్నారు. మరో 19 చోట్ల టెస్టింగ్‌ ల్యాబ్‌లు సిద్ధంగా ఉన్నాయని అవి కూడా అందుబాటులోకి వస్తే రోజుకు 60 వేల నుంచి 80 వేల వరకూ పరీక్షలు నిర్వహించే వీలుంటుందన్నారు.

320 టన్నుల మెడికల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ అందుబాటులో ఉందని చెప్పారు. వైద్యులు, సిబ్బంది భర్తీ, ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ట్రయల్‌ అమలు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, నాడు – నేడు కార్యక్రమం పురోగతి తదితరాలను సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి నవీన్‌ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement