సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ తగ్గుముఖం పడుతోందని, పాజిటివిటీ, మరణాల రేట్లు గణనీయంగా తగ్గాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. రికవరీ రేటు భారీగా పెరిగిందని, అన్ని జిల్లాల్లో మరణాలు తగ్గాయని తెలిపారు. కోవిడ్–19 నివారణ చర్యలపై సీఎం శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ నియంత్రణ చర్యలు, పరీక్షల సరళి, బెడ్ల అందుబాటు, ఇతర మౌలిక సదుపాయాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మీ (సీఎం వైఎస్ జగన్) సూచనల మేరకు ఇప్పటికే అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందులో భాగంగానే భారీగా వైద్యులు, సిబ్బందిని నియమించామని తెలిపారు. అధికారులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి..
24 గంటల్లోనే ఫలితాలు..
కరోనా పరీక్షల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రోజుకి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు 35,680, ట్రూనాట్ టెస్టులు 8,890 చేసే స్థాయికి చేరింది. ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ ఆర్‌టీపీసీఆర్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో రోజూ దాదాపు 70 వేల పరీక్షలు చేస్తుండగా.. వాటిలో ఆర్‌టీపీసీఆర్ టెస్టులు 50 శాతం ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచి 50 వేల పరీక్షలు చేయాలని నిర్ణయించాం. 24 గంటల్లోనే పరీక్షల ఫలితాలు కూడా ప్రకటిస్తున్నాం. శాంపిళ్ల సేకరణకు 135 బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.
252 ఆస్పత్రుల్లో 38,042 బెడ్లు
రాష్ట్రంలో 252 కోవిడ్ ఆస్పత్రుల్లో 38,042 బెడ్లు అందుబాటులోకి వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. ఫోన్ చేసిన అరగంటలోనే బెడ్ కేటాయిస్తున్నాం. రోగుల తరలింపునకు 108 సర్వీసులతోపాటు 393 అంబులెన్సులను ఏర్పాటు చేశాం. ఇంతకుముందు 250 వెంటిలేటర్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా 5 వేల వెంటిలేటర్లు ఉన్నాయి. కోవిడ్‌కు ముందు ఆక్సిజన్ సరఫరా కలిగిన బెడ్లు 3,636 మాత్రమే ఉండగా.. వాటి సంఖ్య 28,790కి చేరింది. దాదాపు అన్ని ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీ జరుగుతోంది. ప్లాస్మా దాతలకు రూ.5 వేలు ప్రోత్సాహకంగా ఇస్తున్నాం. మెరుగైన వైద్యసేవలందించడానికి 10 వేల మంది సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన, 20 వేల మందిని తాత్కాలికంగా నియమించాం. అలాగే వివిధ ఆస్పత్రుల్లో (డీఎంఈ, ఏపీవీవీపీ, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) 1,116 వైద్య నిపుణులను నియమించగా మరో 1,004 పోస్టుల భర్తీ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 4,60,099 ఎన్–95 మాస్కులు, 8,76,825 పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 20.5 లక్షల ఎన్–95 మాస్కులు, 24.5 లక్షల పీపీఈ కిట్లు జిల్లాలకు పంపాం.
Comments
Please login to add a commentAdd a comment