ప్రజారోగ్యం దృష్ట్యా వినాయక చవితి ఉత్సవాలు ఇళ్లకే పరిమితం | CM YS Jagan High Level Review on Covid Vaccination | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యం దృష్ట్యా వినాయక చవితి ఉత్సవాలు ఇళ్లకే పరిమితం

Published Fri, Sep 3 2021 3:21 AM | Last Updated on Fri, Sep 3 2021 3:54 AM

CM YS Jagan High Level Review on Covid Vaccination - Sakshi

కోవిడ్, వ్యాక్సినేషన్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ, మందుల నాణ్యతపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: కోవిడ్‌ మహమ్మారి ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లలోనే నిర్వహించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో గణేష్‌ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన ఊరేగింపులు చేపట్టవద్దని సూచించింది. కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా పండుగల సీజన్‌లో జాగ్రత్తలు పాటించాలని కోరుతూ వైద్య శాఖ అధికారులు పలు సిఫార్సులు చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవని పేర్కొంటూ ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కోవిడ్, వ్యాక్సినేషన్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ, మందుల నాణ్యతపై ముఖ్యమంత్రి జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇవీ..

కర్ఫ్యూ కొనసాగింపు..
కోవిడ్‌ జాగ్రత్తల దృష్ట్యా రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగించాలని సమీక్షలో నిర్ణయించారు. పండుగల సీజన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష సందర్భంగా వైద్యులు, అధికారులు పలు సూచనలు చేశారు. వినాయక చవితి ఉత్సవాలను ఎవరి ఇళ్లలో వారు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులు పేర్కొన్నారు. ఇళ్లల్లోనే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలని, బహిరంగ స్థలాల్లో అనుమతించవద్దని సిఫార్సు చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను జారీ చేయనుంది. 

వారిలో వైరస్‌ ప్రభావంపై అధ్యయనం చేయాలి
వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా కొందరు కోవిడ్‌ బారిన పడుతున్న నేపథ్యంలో వారిలో వైరస్‌ ప్రభావాన్ని తెలుసుకునేందుకు అ«ధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. రాష్ట్రంలో నవంబర్‌ చివరి నాటికల్లా 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కనీసం సింగిల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఫిబ్రవరి చివరి నాటికి అర్హులు అందరికీ రెండు డోసులు పూర్తయ్యేలా వ్యాక్సినేషన్‌ చేపట్టాలని నిర్దేశించారు. బూస్టర్‌ డోస్‌లు కూడా తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం అందుతున్న నేపథ్యంలో  ఆ తరువాత ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో కసరత్తు చేయాలని ఆదేశించారు. అందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైన అనంతరం ఎలా ముందుకు వెళ్లాలో సరైన ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

ప్రమాణాలతో కూడిన ఔషధాలనే అందించాలి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకాలపై కూడా ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ఖాళీలను గుర్తించిన 90 రోజుల్లోగా నియామకాల కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన సీఎం ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత వైద్యులు, సిబ్బంది లేరనే మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. నియామకాలు పూర్తయ్యాక డిప్యుటేషన్‌ అనే మాట వినిపించకూడదన్నారు. రోజూ తప్పనిసరిగా రెండుసార్లు బయోమెట్రిక్‌తో హాజరు నమోదు చేయాలని సూచించారు. పనితీరుపై పర్యవేక్షణ ఉండాలని, ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందాలని, డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలున్న మందులు మాత్రమే అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు తీసుకుంటే రోగం తగ్గుతుందనే విశ్వాసం ప్రజల్లో కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిరంతరం తనిఖీలు, పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధత
థర్డ్‌వేవ్‌ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాలుగా సిద్ధమైనట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. ఇప్పటికే 20,964 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను సిద్ధం చేశామని, మరో 2,493 కూడా సమకూర్చుకుంటున్నామని వెల్లడించారు. ఆక్సిజన్‌ డి–టైప్‌ సిలిండర్లు 27,311 సిద్ధం చేశామని చెప్పారు. సెప్టెంబరు నెలాఖరు నాటికి 95 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పైపులైన్ల పనులు పూర్తవుతాయన్నారు. మొత్తం 143 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పైపులైన్ల పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటు ప్రగతిని కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని), డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

10 వేల సచివాలయాల పరిధిలో కేసుల్లేవ్‌
– మూడు జిల్లాలు మినహా మిగతా చోట్ల 3 శాతానికి లోపలే పాజిటివిటీ రేటు
– మే నెలలో గరిష్ట కేసులు 2,11,554 కాగా ప్రస్తుతం 14,473కి తగ్గిన పాజిటివ్‌ కేసులు 
– దాదాపు 10 వేల గ్రామ సచివాలయాల పరిధిలో కేసుల్లేవు
– రికవరీ రేటు 98.58 శాతం
– 104 సెంటర్‌కు కాల్స్‌ 775కి తగ్గుదల. మే నెలలో గరిష్టంగా 19,175 కాల్స్‌.
– ఇప్పటికి 17 సార్లు ఇంటింటికీ ఫీవర్‌ సర్వే

వ్యాక్సినేషన్‌..
– ఇప్పటివరకూ రాష్ట్రంలో 3,02,52,905 డోసుల వ్యాక్సినేషన్‌
– 1,33,56,223 మందికి సింగిల్‌ డోస్‌.
– 84,48,341 మందికి రెండుడోసుల టీకాలు పూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement