సోమవారం రాత్రి ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా నాతో మాట్లాడారు. కీలక అంశాలను ప్రస్తావించారని అన్నారు. వైరస్ పట్ల ప్రజల్లో భయాందోళన పోవాలి. కరోనా వచ్చిన వారి పట్ల వివక్ష చూపడం ఎంత మాత్రం సరికాదు.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కరోనా పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపడం ఏమాత్రం సరికాదన్నారు. వైరస్ పట్ల ప్రజల్లో భయాందోళన, వివక్ష తొలగించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. కోవిడ్–19 నివారణ చర్యలు, పరీక్షల సరళితో పాటు ధాన్యం సేకరణ అంశాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైరస్ పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు లక్షణాలు ఉన్న వారు చికిత్స చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడమే పరిష్కారమని పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
సీఎం ప్రసంగానికి మద్దతు
► ప్రధాన మంత్రితో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగంపై పలువురి నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
► కరోనా వైరస్ పట్ల భయాందోళనలు తొలగించాల్సిన అవసరం ఉందన్న మాటపై ప్రతి ఒక్కరూ మద్దతు పలుకుతున్నారని చెప్పారు.
► కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని సోమవారం డిశ్చార్జి అయిన ఒక ఉద్యోగిని ఇంట్లోకి రానీయలేదన్న అంశాన్ని అధికారులు ప్రస్తావించారు. కరోనా పట్ల తీవ్ర భయాందోళనల కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సీఎంకు వివరించారు.
హైరిస్క్ ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి
► 60 సంవత్సరాల పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. కోవిడ్‌యేతర రోగులకు చికిత్సలను సాధారణ స్థాయికి తీసుకు రావడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ధాన్యం సేకరణ ముమ్మరం చేయాలి
► మరింత ఉధృతంగా ధాన్యాన్ని సేకరించాలని సీఎం ఆదేశించారు. రైతులకు పేమెంట్లు కూడా జరుగుతున్నాయని, అకాల వర్షాలు సంభవిస్తే మార్కెట్లలో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.
► తమిళనాడులోని కోయంబేడు నాలుగు జిల్లాలపై ప్రభావం చూపుతోందని అధికారులు పేర్కొనగా, రైతులకు నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. చేపలు, రొయ్యల ఎగుమతులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.
రైతు భరోసా కేంద్రాలు
► ఈ నెల 30వ తేదీన ప్రారంభించడానికి రైతు భరోసా కేంద్రాలు సిద్ధమవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఆర్‌బీకేలలో ఈ నెల 15వ తేదీకల్లా కియోస్క్‌లు సిద్ధం అవుతాయని చెప్పారు.
► రైతు భరోసాకు సన్నద్ధమవుతున్నామని అధికారులు వివరించారు.
► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment