14410 ఫోన్‌లోనే వైద్య సేవలు | Coronavirus: CM YS Jagan Launches Dr YSR Telemedicine | Sakshi
Sakshi News home page

14410 ఫోన్‌లోనే వైద్య సేవలు

Published Tue, Apr 14 2020 3:51 AM | Last Updated on Tue, Apr 14 2020 11:43 AM

Coronavirus: CM YS Jagan Launches Dr YSR Telemedicine - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నివారణ చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ టెలి మెడిసిన్‌ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కాల్‌ సెంటర్‌ కోసం ప్రత్యేకంగా కేటాయించిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 14410కు ఫోన్‌ చేసి డాక్టర్‌తో మాట్లాడారు. ఈ విధానాన్ని పటిష్టంగా, బలోపేతంగా నడపాలని అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్యనూ పెంచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు. 

మూడు అంచెల్లో పనితీరు ఇలా..
స్టెప్‌ 1
► 14410 టోల్‌ ఫ్రీ నంబర్‌కు రోగులు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు. అక్కడి సిస్టమ్‌ ఆ మొబైల్‌ నంబర్‌ వివరాలను నమోదు చేసుకుంటుంది.
► ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్స్‌ రోగికి కాల్‌ చేసి, వారు ఉంటున్న ప్రదేశం, వయసు, రోగ లక్షణాల వంటి వివరాలు తెలుసుకుంటారు. రోగికి ఒక గుర్తింపు సంఖ్య ఇస్తారు.

స్టెప్‌ 2 
► రోగి వివరాలన్నీ టెలి మెడిసిన్‌ వ్యవస్థకు కనెక్ట్‌ అయిన వైద్యులందరికీ కనిపిస్తాయి.
► డాక్టర్ల బృందంలో ఎవరో ఒకరు కాల్‌ను స్వీకరించి, కాల్‌ చేసి ఓపీ సేవలు అందిస్తారు. 
► ఆ రోగికి నిర్వహించవలసిన పరీక్షలు, అందించాల్సిన మందులను తెలియజేస్తారు.
► వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్‌–19 అనుమానిత రోగులను గుర్తిస్తారు.
► ఆ తర్వాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయి.
► అవసరమైన సందర్భాల్లో వీడియో కన్సల్టేషన్‌ ఉంటుంది. అవసరమైన వారిని ఏ ఆసుపత్రికి పంపించాలన్న దానిపై కూడా వైద్యులు నిర్ణయం తీసుకుని ఆ మేరకు వారిని తరలిస్తారు. 

స్టెప్‌ 3
► కోవిడ్‌–19 అనుమానిత కేసుల జాబితా తయారీ. ఆ రోగులకు అవసరమైన పరీక్షలు, క్వారంటైన్, ఐసొలేషన్‌తో పాటు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) సిద్ధం. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆ జాబితాల రూపకల్పన ఉంటుంది. 
► ఈ జాబితాలను జిల్లా అధికారులకు పంపిస్తారు. తీసుకోవాల్సిన చర్యలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకుంటారు.
► ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారులకు ప్రిస్కిప్షన్లు పంపిస్తారు.
► ప్రతి ఒక్క రోగికి అవసరమైన ఔషధాలను ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి.. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, గ్రామ వార్డు వలంటీర్ల ద్వారా రోగులకు నేరుగా ఇంటికే పంపిస్తారు.
► నాన్‌ కోవిడ్‌ రోగులకు కూడా మందులు అందించే కార్యక్రమం కొనసాగుతుంది.
డాక్టర్‌ వైఎస్సార్‌ టెలీమెడిసిన్‌ను ప్రారంభించిన అనంతరం డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఉన్నతాధికారులు   

ముఖ్యమంత్రి, డాక్టర్‌ మధ్య సంభాషణ ఇలా.. 
సీఎం: నమస్తే అమ్మా..
కాల్‌ సెంటర్‌ : సర్‌.. నేను డాక్టర్‌ వైఎస్సార్‌ టెలి మెడిసిన్‌ నుంచి డాక్టర్‌ శ్రీలక్ష్మిని మాట్లాడుతున్నాను.
సీఎం: మీరు ఇప్పుడు పేషెంట్‌ డెమోగ్రాఫిక్‌ డిటైల్స్‌ తీసుకున్నాక.. అంటే ప్రాథమిక సమాచారం తీసుకున్న తర్వాత తిరిగి పేషెంట్‌తో మాట్లాడతారా లేక ఏ విధంగా చేస్తారో చెప్పండి.
డాక్టర్‌: పేషెంట్‌ నుంచి అన్ని వివరాలు తీసుకున్న తర్వాత వాటిని హెల్త్‌ సెంటర్‌కు పంపిస్తాము.
సీఎం: ఆ తర్వాత సెకండ్‌ స్టేజీలో మీరు..
డాక్టర్‌:  కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయనిపిస్తే తిరిగి ఇంకోసారి కాల్‌ చేస్తాము. పేషెంట్‌ ఎక్కడ ఉన్నాడనే వివరాలను తీసుకొని  వాటిని జిల్లా, మండల స్థాయికి పంపిస్తాము. వారు పేషెంట్‌ను ఫాలో అవుతారు. వారు టెస్టింగ్‌ చేయడం, లేదా క్వారంటైన్‌ చేయడం చేస్తారు. వారికి కావాల్సిన మందులను స్థానిక ఆసుపత్రుల నుంచి అందిస్తాం.
సీఎం: మీరు నాన్‌ కోవిడ్‌ కేసులు కూడా డీల్‌ చేస్తున్నారు కదమ్మా..
డాక్టర్‌: అవును సర్‌.
సీఎం: ఓకే అమ్మా.. నాన్‌ కోవిడ్‌ కేసులకు కూడా ఇదే విధంగా మందులు పంపే కార్యక్రమం చేయండి. ఆల్‌ ది బెస్ట్‌ అమ్మా. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement