
ఈ నెల 25న ప్రపంచంలోనే తొలిసారిగా లాస్ ఏంజిల్స్‌లో ‘లైవ్ స్పెర్మ్ రేస్’ జరగనుంది. జీవనశైలిలో మార్పులు... మొదలైన వాటివల్ల పురుషుల్లో పెరుగుతున్న సంతాన లేమి అనే క్లిష్టమైన సమస్యపై ఈ రేస్ దృష్టి సారిస్తుంది.
‘ఎవరి స్పెర్మ్ హెల్తీయెస్ట్? ఫాస్టెస్ట్?’ అనే దానిపై జరిగేపోటీ ఇది. పోటీ ఎలా ఉంటుంది? అనే విషయానికి వస్తే... నిజమైన స్పెర్మ్‌తో కూడిన రేస్ ఇది. మానవ ప్రత్యుత్పత్తి మార్గాన్ని అనుసరించేలా మైక్రోస్కోపిక్ రేస్ ట్రాక్ రూపొందించారు. సింక్రనైజ్డ్ స్టార్టర్‌లతో రసాయన సంకేతాలు, ఫ్లూయిడ్ డైనమిక్స్ కోర్సు ద్వారా స్పెర్మ్ నమూనాలు ఈత కొట్టేలా చేస్తారు. ఈపోటీని యాక్షన్ హై–రిజల్యూషన్ కెమెరాతో రికార్డ్ చేస్తారు. విజేతను నిర్ణయించడానికి మూడు రేసులు జరుగుతాయి. ప్లే–బై–ప్లే కామెంటరీ అలరిస్తుంది.ఇన్‌స్టంట్ రీప్లే, కామెంటరీ, గణంకాలు, లీడర్ బోర్డ్‌లు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లను అభిమానులు ఆస్వాదించేలా చేస్తుంది.
ఈ రేస్‌లో బెట్టింగ్ కూడా ఉంటుంది!
అత్యంత వేగంగా ఈత కొట్టే స్పెర్మ్‌పై అభిమానులు పందెం కట్టవచ్చు. ‘ఏ లాఫ్ విత్ ఏ డీపర్ పర్పస్’ నినాదంతో ఈ రేస్‌కు శ్రీకారం చుట్టారు. యువ మిలియనీర్‌ల బృందం ఈ విచిత్ర పోటీని నిర్వహిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే హెల్త్, టెక్, ఎంటర్‌టైన్‌మెంట్‌లను మిళితం చేసి రూపొందించిన రేస్ ఇది. ‘ఎవరూ టచ్ చేయని అంశాన్ని తీసుకొని ఆసక్తికరంగా ఈ రేస్‌ను రూపొందించాం. ఇది పురుషుల సంతానలేమి గురించి ప్రజలు నిస్సంకోచంగా మాట్లాడుకునేలా చేస్తుంది’ అంటున్నారు పోటీ నిర్వాహకులు.
రేస్ ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ‘ఎక్స్’లో ‘ది స్పెర్మ్ ట్రాక్: నాట్ యువర్ యావరేజ్ రేస్’ టైటిల్‌తో ట్రైలర్ విడుదల చేశారు. ఈ రేస్‌లో పాల్గొనే టీమ్‌లను కూడా పరిచయం చేశారు. రేస్ ఉద్దేశం గురించి ‘స్పెర్మ్ రేసింగ్ మేనిఫెస్టో’ కూడా విడుదల చేశారు. ఈ మైక్రోస్కోపిక్ బ్యాటిల్‌లో వీర్య విజేత ఎవరో వేచి చూద్దాం.
ఇది చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్