Ukraine War ఈ యుద్ధంలో అంతిమ విజయం అమెరికాదే? | Russia-Ukraine War Will America be the ultimate winner in this war? | Sakshi
Sakshi News home page

Ukraine War ఈ యుద్ధంలో అంతిమ విజయం అమెరికాదే?

Published Mon, Feb 24 2025 11:17 AM | Last Updated on Mon, Feb 24 2025 2:24 PM

Russia-Ukraine War Will America be the ultimate winner in this war?

గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో అమెరికా ఆధ్యక్షుడు ట్రంప్‌ 90 నిమిషాలపాటు పుతిన్‌తో టెలీ ఫోనులో సంభాషించిన తర్వాత శాంతి చర్చల ప్రారంభానికి సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను ఎన్నుకొన్నారు. అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో  రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ నాయకత్వంలో ఫిబ్రవరి 18 తేదీన మంతనాలు జరిపి తొందరలోనే ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరించాలనుకొన్నారు. ట్రంప్‌ మాత్రం ఈ సంప్రదింపులలో పాల్గొనవలసిందిగా అటు ఉక్రె యిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని గానీ, ఇటు యూరప్‌ దేశా లను కానీ ఆహ్వానించక పోవటంతో పారిస్‌లో పోటీగా శాంతిచర్చలకు యూరప్‌లోని ప్రధాన దేశాధినేతలు సమావేశమవ్వటంతో ఒక్కసారిగా నాటో దేశాల మధ్య ఆధిక్యత బయటపడింది. 

యుద్ధాన్ని ఆపితే ప్రతిఫలంగా కొన్ని తాయిలా లను ట్రంప్‌ రష్యాకు ఇస్తానన్నారని అనధికార వార్తలు వస్తున్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి ఉక్రెయిన్‌కు భవి ష్యత్తులో నాటో సభ్యత్వం ఇవ్వరు. అలాగే ఇప్పటి వరకూ యుద్ధంలో రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రె యిన్‌ ప్రాంతం, లోగడ  తీసుకొన్న క్రిమియా భాగం రష్యా ఆధీనం కిందకు వస్తుంది. అమెరికా, ఉక్రెయిన్‌లు ఈ ప్రాంతాల్ని దౌత్యపరంగా గుర్తించాలి. 

రష్యా ఆధీనంలో ఉన్న భూభాగంలోని 50,000 కోట్ల డాలర్ల విలువ చేసే లిథియం, టైటానియం నిక్షేపాలను అమె రికా పొందుతుంది. పశ్చిమాసియాలో రష్యా అమెరి కాలు ఒకరికొకరు మద్దతునిచ్చుకొని అవసరమైతే చైనా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేయవచ్చు. పాలస్తీనియన్లను గాజా నుండి పారదోలటంలోనూ, ఇరాన్‌పై యుద్ధం చేస్తే రష్యా మద్దతును పొందడానికే ట్రంప్‌ ప్రయత్నం చేయవచ్చు.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ ప్రతిపాదనలను తోసిపుచ్చి, ఉక్రెయిన్, అమెరికా వలసవాద దేశం కాజాలదన్నాడు. ట్రంప్‌ విధానాలు యూరప్‌పై దాడిగా ప్రముఖ యూరప్‌ పత్రికలు రాశాయి. ఈ విధానాలు ‘ట్రాన్స్‌ అట్లాంటిక్‌ కూటమి’ పతనానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించాయి. యూరప్‌ భద్రతా సవాళ్లను చర్చించి మిలిటరీ పరంగా యూర ప్‌ దేశాలు తమ జీడీపీ నుండి 3 నుండి 5 శాతం వరకూ ఖర్చు చేయాల్సి వస్తుందని దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే యూరపు ఆర్థికవ్యవస్థలు ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో తిరోగమన దిశలో పయనిస్తున్నాయి. ఇంకా మిలిటరీ ఖర్చు పెరిగితే ప్రజలపై అదనపు భారం పడే ప్రమాదముంది.

ఉక్రెయిన్‌ ఆన్‌లైన్‌ పత్రిక ‘స్టార్నా’ ట్రంప్, పుతిన్‌ల శాంతి ఒప్పందాలను లీక్‌ చేసింది. దీన్ని అనుసరించి ఏప్రిల్‌ 20 నాటికి పరిపూర్ణ కాల్పుల విరమణ జరగా లని, ఉక్రెయిన్‌ ఆక్రమించిన రష్యా భూభాగం కుర్‌ స్క్‌ను తిరిగి రష్యాకు ఇవ్వాలని, తొందరలోనే పుతిన్, ట్రంప్‌లు మాస్కోలో, వాషింగ్టన్‌లో కల్సుకొంటారని, జెలెన్‌స్కీ, పుతిన్‌లు సౌదీ అరేబియాలో కలుసుకోవ చ్చని అభిప్రాయపడింది. అధికారికంగా ఈ షరతులన్నీ మే 9 నుండి అమలులోకి రావచ్చని తెలిపింది. అయితే ఇవేవీ జరుగలేదు. నిన్న శనివారం కూడా యుద్ధం కొనసాగింది. రష్యా కొత్తగా ఉక్రెయిన్‌ గ్రామాన్ని ఒక దాన్ని ఆక్రమించుకుంది.

ఇదీ చదవండి: చందాకొచ్చర్‌ న్యూ జర్నీ: కార్పొరేట్‌ వర్గాల్లో తీవ్ర ఆసక్తి

చైనాను ఎదుర్కొనే వ్యూహం
తాను అమెరికా అధ్యక్షునిగా ఉండి ఉంటే అప్పట్లో యుద్ధాన్ని జరిపించే వాడిని కాదని ట్రంప్‌ ఇప్పటికే అనేకసార్లు చెప్పారు. 3 సంవత్సరాల యుద్ధంతో ఉక్రె యిన్‌ తీవ్ర నష్టాల పాలయ్యింది.  సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన  ఈ యూ దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలో కూరుకోవటం, తిరుగులేని అణుశక్తిగా, మిలిటరీశక్తిగా ఇప్పటికే రష్యా ఉండి, అపారమైన ఖనిజ సంపద కల్గి ఉండటంతో ట్రంప్‌ రష్యాపై మొగ్గు చూపు తున్నారు. భౌగోళికంగా వ్యూహాత్మకంగా రష్యా సహా యంతో చైనాను చుట్టు ముట్టటం తేలిక అనుకోవటం ట్రంప్‌ ఆలోచన కూడా కావచ్చు. ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయాన్ని అందించటం కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారం కావటం మరొక కారణం కాగా, అమెరికా మార్కెట్లకు రష్యా కొత్తద్వారాలను తెరుస్తుందని ఆశ పడటం మరొక కారణం కావచ్చు. 

అసలు యుద్ధం ప్రారంభించటానికి ప్రధాన కారణం రష్యాను ముక్కలుగా చేసి, దాని అపార ఖనిజసంపదను దోచుకోవటానికే ననేది జగమెరిగిన సత్యం. శాంతి చర్చలతో  రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విజేతగా నిలువనున్నాడు. అమెరికా ఉక్రెయిన్‌కు మద్డతు పలికి ఓటమిపాలవుతూ ఇప్పుడు ట్రంప్‌ రూపంలో శాంతి ఒడంబడిక ద్వారా నెగ్గే ప్రయత్నం చేస్తోంది. రష్యాకి సంబంధించిన 30వేల కోట్ల డాలర్లను అమెరికా బ్యాంకుల్లో స్తంభింపజేసి, ఉక్రెయిన్‌లో ఖనిజ సంపదపై కన్నేసిన అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ నైజాన్ని ప్రపంచానికి తెలిపింది. తాజా వార్తలు అందే సమయానికి ట్రంప్‌ తన సహజధోరణిలో మాట మార్చి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిందని ప్రకటించారు. యుద్ధ పరిసమాప్తి గురించి వాషింగ్టన్‌...రష్యాతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ తమతో ఖనిజ ఒప్పందాలను కుదుర్చుకుంటుందని ప్రకటించారు. మొత్తానికి ఈ యుద్ధం వల్ల అమెరికా ప్రయోజనాలు నెరవేరబోతున్నాయన్నమాట!

నేటితో రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధానికి మూడేళ్లు
2025 ఫిబ్రవరి 24 నాటికి రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమై మూడేళ్లవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో చోటు చేసుకున్న భయంకర యుద్ధం ఇదే. ఉక్రెయిన్‌లో 20 శాతం భూభాగాన్ని రష్యా ఆక్రమించింది.  ఈ యుద్ధం వల్ల 2024 నవంబర్‌ నాటికి ఉక్రెయిన్‌కు సంభవించిన మొత్తం ఆస్తి నష్టం 170 బిలియన్‌ డాలర్లు అని ‘కేఎస్‌ఈ ఇనిస్టిట్యూట్‌’ అంచనా. ఉక్రెయిన్‌ సైనికులు 80 వేల మంది చనిపోయినట్టు, 4 లక్షల మంది గాయపడినట్టు ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ అంచనా. రష్యా పౌరులు కొద్దిమందే మరణించినా సైనికులను మాత్రం పెద్ద సంఖ్యలోనే కోల్పోయిందని వార్తలు. అందుకే అది కిరాయి సైనికులను రంగంలోకి దించింది. 

 -బుడ్డిగ జమిందార్‌ 
వ్యాసకర్త అసోసియేట్‌ ప్రొఫెసర్, కె.ఎల్‌. యూనివర్సిటీ ‘ 98494 91969 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement