ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా ‘ఎన్నికైన’ అధ్యక్షుడు ట్రంప్
విశ్లేషణ
లెబనాన్‌లో కాల్పుల విరమణ జరిపించి, గాజాలోనూ ఆ ప్రయత్నం చేయగలనన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉక్రెయిన్ యుద్ధం గురించి మాత్రం ఎటువంటి ప్రస్తావన చేయకపోవటం గమనించదగ్గది. పైగా, కొత్త అధ్యక్షుడు ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించి ఆ విషయమై తన శాంతి ప్రయత్నాలు ఆరంభించేలోగా, రష్యాతో చర్చలలో ఉక్రెయిన్ బేరసారాల బలాన్ని వీలైనంత పెంచే పనిలో ఉన్నారు. తాను గెలిచినట్లయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధ సమస్యను ఇరవై నాలుగు గంటలలో పరిష్కరించగలనని ఎన్నికల ప్రచార సమయలో ప్రకటించిన ట్రంప్ శాంతి పథకమేమిటో అంచనా వేయటం అవసరం. మరి ఆయన గెలిచి మరొక యాభై రోజులలోనే పదవిని స్వీకరించనుండగా ఈ విషయమై ఏదైనా ఆలోచిస్తున్నట్లా?
రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి ఎన్నికల సమయంలో ట్రంప్ ఎటువంటి పథకాన్ని సూచించలేదంటూ చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. అయితే, ఆయన దాని గురించి ఆలోచించటమే కాదు, రష్యా – ఉక్రెయిన్ సమస్యపై తన ప్రతినిధిగా రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ కీత్ కెల్లోగ్‌ను 28వ తేదీన నియమించారు కూడా. జనరల్ కెల్లోగ్‌తో పాటు, ట్రంప్ ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో తన వ్యవహరణను గమనించి నట్లయితే, సమస్యకు ట్రంప్ ప్రభుత్వం సూచించే పరిష్కారమేమిటో కొంత అవగతమవుతుంది.
ట్రంప్ మాటలను ఇప్పటికే చూశాం గనుక, కొత్తగా రంగంలోకి వస్తున్న జనరల్ కెల్లోగ్ వైఖరిని గమనిద్దాం. ఆయన ట్రంప్ మొదటి పాలనా కాలంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు. ఉక్రెయిన్ సమస్యపై కొంతకాలం క్రితమే తన ఆలోచనలను వివరిస్తూ ఒక పత్రాన్ని ప్రకటించారు. ఇతరత్రా టెలివిజన్ చర్చ వంటి వాటిలో పాల్గొన్నారు.
ముందు కాల్పుల విరమణ
కెల్లోగ్ ప్రకారం, ముందుగా రష్యా, ఉక్రెయిన్‌లు కాల్పుల విరమణ పాటించాలి. ఉభయుల సేనలు ఆ విరమణ రోజుకు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆగిపోవాలి. తర్వాత చర్చలు మొదలు కావాలి. దీనంతటికీ ఉక్రెయిన్ అంగీకరించకపోయినట్లయితే వారికి సహాయం నిలిపివేయాలి. రష్యా కాదన్న పక్షంలో ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగించాలి. పోతే, రాజీ కోసం ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని రష్యాకు వదలుకోవలసి రావచ్చు.
అదేవిధంగా, నాటోలో సభ్యత్వ విషయం నిరవధికంగా వాయిదా పడుతుంది. ట్రంప్ ఈ మాటలు ఇంత నిర్దిష్టంగా చెప్పలేదుగానీ, ఉక్రెయిన్‌కు సహాయంపై నియంత్రణలు, వారు తమ భూభాగాన్ని కొంత వదులు కోవలసి రావటం గురించిన ప్రస్తావనలు స్పష్టంగానే చేశారు. అవి యూరప్ అంతటా కలవరం సృష్టించాయి. ట్రంప్ వైఖరిని మార్చేందుకు జెలెన్‌స్కీ చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు.
ఇదే పథకం అమలుకు ట్రంప్ ప్రయత్నించినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉండవచ్చు? భూభాగం వదులుకునేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు అంగీకరిస్తారా? ఒకవేళ అంగీకరిస్తే ఏ మేరకు అనే కీలకమైన ప్రశ్నను అట్లుంచితే, మొదట కాల్పుల విరమణకు, సేనలను యథాతథ స్థితిలో నిలిపివేయటానికి సమ్మతించటంలో ఎవరికీ సమస్య ఉండకపోవచ్చు. ట్రంప్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చర్చలకు సిద్ధమని జెలెన్‌స్కీతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ప్రకటించారు.
చర్చల సందర్భంగా జనరల్ కెల్లోగ్ ప్రతిపాదనలు ఏ దశలో ముందుకు వచ్చేదీ చెప్పలేము గానీ, మొదట మాత్రం రష్యా, ఉక్రెయిన్ దేని షరతులు అది విధిస్తుంది. ఆ షరతులేమిటో మనకు ఇప్పటికే తెలుసు. 2014 నుంచి తమ ఆక్రమణలో గల క్రిమియాను ఉక్రెయిన్ తిరిగి కోరకపోవటం, ఉక్రెయిన్ తూర్పున రష్యన్ జాతీయులు ఆధిక్యతలో గల డోన్‌బాస్ ప్రాంతాన్ని తమకు వదలటం, నాటోలో చేరకుండా తటస్థంగా ఉండటమన్నవి రష్యా షరతులు. నాటో సభ్యత్వం సంగతి ఎట్లున్నా తమ భూభాగాలన్నింటిని తమకు తిరిగి అప్పగించటం, తమ రక్షణకు పూర్తి హామీలు లభించటం ఉక్రెయిన్ షరతులు.
భూభాగాలను వదులుకోవాల్సిందే!
నల్ల సముద్రంలోని క్రిమియా తమ అధీనంలో లేనట్లయితే రష్యా సముద్ర వాణిజ్యం శీతాకాలం పొడవునా స్తంభించి పోతుంది. కనుక ఆ ప్రాంతాన్ని 2014లో ఆక్రమించిన రష్యా, దానిని వదలుకునేందుకు ససేమిరా అంగీకరించదు. ఈ వాస్తవ స్థితిని అప్పటినుంచే గ్రహించిన ఉక్రెయిన్, అమెరికా శిబిరాలు బయటకు కాకున్నా అంతర్గతంగా రాజీ పడిపోయాయి.
పోతే, డోన్‌బాస్ ప్రాంతంలోని రష్యన్లను ఉక్రెయిన్ రకరకాలుగా వేధించటం ఎప్పటినుంచో ఉంది గనుకనే ఆ భూభాగాలను రష్యాలో విలీనం చేసుకుని తీరగలమని పుతిన్ ప్రకటించారు. ప్రస్తుత యుద్ధ కాలంలో అందులో అధిక భాగాన్ని ఆక్రమించారు కూడా. మరొకవైపున కనిపించే ఆసక్తికరమైన అంశాలు మూడున్నాయి. తమ ప్రభుత్వ వైఖరి ఏమైనప్పటికీ రష్యాతో శాంతి కోసం కొంత భూభాగం వదులు కోవచ్చుననే ఉక్రెయిన్ ప్రజల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.
ఒకవైపు ఉక్రెయిన్‌కు యుద్ధంలో మద్దతిస్తూనే యూరోపియన్ దేశాలు కూడా ఇదే మాట పరోక్షంగా సూచిస్తున్నాయి. యుద్ధానికి నిరవధికంగా సహాయం చేసేందుకు అవి పైకి అవునన్నా వాస్తవంలో సిద్ధంగా లేవు. ఇదంతా పరిగణించినప్పుడు, ఉక్రెయిన్ ఈ రాజీకి సిద్ధపడవలసి ఉంటుందనిపిస్తుంది. అయితే, ఎంత భూభాగమన్నది ప్రశ్న.
ఒకసారి యుద్ధం ముగిసినట్లయితే రష్యా నుంచి ముప్పు అన్నదే ఉండదు గనుక, ఉక్రెయిన్‌కు తను కోరుతున్న ప్రకారం రక్షణలు కల్పించటం సమస్య కాకపోవచ్చు. అయితే, నాటో సభ్యత్వ ప్రశ్న చిక్కుల మారిది. సభ్యత్వం కావాలన్నది ఉక్రెయిన్ కోరిక. రష్యా నుంచి ఎప్పటికైనా ఉక్రెయిన్‌కే గాక తక్కిన యూరప్‌కు సైతం ప్రమాదం ఉండవచ్చునని, కనుక ఉక్రెయిన్‌కు సభ్యత్వమిస్తూ నాటోను మరింత శక్తిమంతం చేసుకోవాలన్నది యూరోపియన్ యూనియన్ కోరిక.
నిజానికి అది అమెరికాకు మొదటినుంచీ ఉన్న వ్యూహం. ఒకప్పటి సోవియెట్ యూనియన్‌తో పాటు వారి నాయకత్వాన ఉండిన వార్సా సైనిక కూటమి 1991లోనే రద్దయినా, రష్యాను దిగ్బంధంలోనే ఉంచేందుకు అమెరికన్లు తమ సైనిక కూటమి నాటోను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
ఈ వ్యూహంలో భాగంగానే 1991 తర్వాత మరొక 12 యూరోపియన్ దేశాలను నాటోలో చేర్చుకుని రష్యా సరిహద్దుల వైపు విస్తరించారు. ఆ సరిహద్దుల వెంటగల చివరి దేశం ఉక్రెయిన్ కావటం వల్లనే రష్యా తన భద్రత పట్ల ఇంత ఆందోళన చెందుతూ ప్రస్తుత యుద్ధానికి సమకట్టింది. వార్సా కూటమి రద్దయిన దరిమిలా నాటోను విస్తరించబోమంటూ ఇచ్చిన హామీని అమెరికా ఉల్లంఘిస్తూ ఇదంతా చేయటమన్నది వారి ఆగ్రహానికి కారణం.
నాటో సభ్యత్వం ఉండదా?
ఉక్రెయిన్ నాటో సభ్యత్వ విషయం నిరవధికంగా వాయిదా పడగలదని జనరల్ కెల్లోగ్ అంటున్నారు గానీ, అసలు ఉండబోదని, రష్యా కోరుకున్నట్లు ఉక్రెయిన్ తటస్థంగా ఉండగలదని మాత్రం అనటం లేదు. చర్చల సమయలో రష్యా ఈ షరతును తీసుకురాగలదు. అందుకు ట్రంప్, తద్వారా యూరోపియన్ యూనియన్ అంగీకరించినట్లయితే తప్ప, ఈ నిర్దిష్ట సమస్యపై రాజీ సాధ్యం కాదు.
పోతే, ప్రస్తుత యుద్ధం ప్రపంచ యుద్ధానికి, అణుయుద్ధానికి దారితీయవచ్చుననే ఊహాగానాలు కొద్ది కాలం పాటు సాగి ఆందోళనలు సృష్టించాయి. పరిణామాలను గమనించినపుడు అటువంటి అవకాశాలు లేవని అర్థ్థమైంది. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్ అనుమతించటంగానీ, అందుకు ప్రతిగా రష్యా మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించటం గానీ, కర్‌స్క్ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చిన ఉక్రెయిన్ సేనల నిర్మూలనకు ఉత్తర కొరియా సేనలను రష్యా మోహరించటం గానీ, చర్చల సమయానికి తమది పైచేయిగా ఉండాలనే చివరిదశ ప్రయత్నాలు తప్ప మరొకటికాదు. ఇటువంటి వ్యూహాలు ఏ యుద్ధంలోనైనా సాధారణం. ఇదే వ్యూహానికి అనుగుణంగా, చర్చల కాలం వరకు యుద్ధం మరింత తీవ్రరూపం తీసుకున్నా ఆశ్చర్యపడనక్కర లేదు.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment