
చర్చలకు అంగీకరించిన రష్యా అధ్యక్షుడు
ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఉక్రెయిన్ అధ్యక్షుడితోనూ సుదీర్ఘ మంతనాలు
వాషింగ్టన్/మాస్కో: రష్యా దురాక్రమణతో దండెత్తిన దరిమిలా దాదాపు నాలుగేళ్లుగా రావణకాష్టంగా రగిలిపోతున్న ఉక్రెయిన్ భూభాగాల్లో శాంతిపవనాలు వీచే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఉక్రెయిన్ యుద్ధానికి చరమగీతం పాడటమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలతో ఫోన్‌లో విడివిడిగా సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు.
మంగళవారం ఉదయం పుతిన్‌తో ట్రంప్ సుదీర్ఘంగా దాదాపు 90 నిమిషాలపాటు ఫోన్‌లో మంతనాలు జరిపినట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయనే వివరాలను వాళ్లు బయటపెట్టలేదు. కానీ ట్రంప్ మాత్రం తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో మంతనాల వివరాలను పంచుకున్నారు. ‘‘ ఇకనైనా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోకుండా యుద్ధం ముగిసిపోవాలని ఇరువురం కోరుకున్నాం.
ఉక్రెయిన్ అంశంతోపాటు పశ్చిమాసియాలో అనిశ్చితి, ఇంధన రంగం, కృత్రిమ మేథ, అంతర్జాతీయంగా డాలర్ ఆధిపత్యం.. ఇలా కీలకమైన అంశాలపై పుతిన్‌తో సుదీర్ఘంగా మాట్లాడా. కలిసి పనిచేయాలని మేమిద్దం నిర్ణయించుకున్నాం. ఎంతో ఫలవంతమైన చర్చలు జరిపాం. మా స్నేహానికి గుర్తుగా త్వరలో నేను రష్యాలో పర్యటిస్తా. పుతిన్ సైతం అమెరికా పర్యటనకు వస్తారు. ఇందుకు పుతిన్ కూడా అంగీకరించారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని తక్షణం ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, రష్యా తరఫున మధ్యవర్తిత్వ బృందాలు వెంటనే చర్చలు జరిపాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. పుతిన్‌తో చర్చల సారాంశాన్ని తెలిపేందుకు తర్వాత నేను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఫోన్ చేశా. పుతిన్ కూడా జెలెన్‌స్కీకి ఫోన్ చేస్తారేమో’’ అని బుధవారం ట్రూత్‌సోషల్‌లో ట్రంప్ ఒక పోస్ట్‌చేశారు. తమ అధ్యక్షుడితో ట్రంప్ దాదాపు గంటపాటు ఫోన్‌లో మంతనాలు జరిపారని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment