సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అధిక వర్షాలు.. వాతావరణ మార్పులు.. పెరుగుతున్న దోమలతో డెంగీ పంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసులు అధికమవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్, మలేరియా లాంటి ప్రమాదకర జ్వరాలు వ్యాపిస్తుండడంతో పల్లెలన్నీ మంచం పడుతున్నాయి. ప్రతీఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు. రెండు నెలలుగా జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా పీహెచ్‌సీలతో పాటు జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రులలో ఓపీ, ఐపీ కోసం రోగులు బారులు తీరుతున్నారు.
ఆగస్టు, సప్టెంబర్‌లో విజృంభణ
వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అనారోగ్య వాతావరణం నెలకొంది. ఈ వాతావరణమే వైరల్ ఫీవర్ల వ్యాప్తికి కారకంగా మారుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య లోపం కారణంగానే దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో జ్వరాల ప్రభావం పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ విపరీతంగా పెరిగిపోయింది. ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లోనే డెంగీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆగస్టులో 181 కేసులు, సెపె్టంబర్ (15 నాటికి)లో ఇప్పటి వరకే 422 కేసులు నమోదుతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఆసుపత్రులు కిటకిట
సీజనల్ వ్యాధుల కారణంగా ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల అనధికారికంగా పదుల సంఖ్యలో డెంగీ మరణాలు నమోదు కావడంతో జ్వరం అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. జ్వరం వస్తే చాలు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా రోగులు వైద్యం కోసం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ ప్రతి రోజు 2 వేలకుపైగా నమోదవుతుండగా, ఇన్‌పేషెంట్లకు సరిౖయెన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో జ్వరాల బారినపడిన పిల్లల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ప్లేట్‌లెట్స్ పేరుతో దోపిడీ
డెంగీ ప్రయివేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తుంది. కరోనా తర్వాత అంతటి సంపాదన తెచ్చే అస్త్రమైంది. డెంగీ జ్వరం వచ్చిందంటే ప్లేట్‌లెట్స్ తగ్గడం సర్వసాధారణం. ప్లేట్‌లెట్స్ సాకుగా చూపుతూ ప్రయివేటు ఆసుపత్రులు పేషెంట్‌లను వారి బం«ధువులను భయాందోళనకు గురిచేసి సొమ్ము చేసుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకుండా ప్లేట్‌లెట్స్ పరీక్ష చేయడం, ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నాయంటూ తప్పుడు రిపోర్టులు ఇస్తూ పేషెంట్‌ను ఆసుపత్రికి పరిమితం చేస్తున్నారు. ఇక ఆంటిబయోటిక్స్, సెలాయిన్స్ పెట్టుకుంటూ రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉంచుతున్నారు. అవకాశం వచి్చందే తడవుగా సీజనల్ వ్యాధులను సొమ్ము చేసుకుంటున్నాయి. డెంగీకి మెరుగైన వైద్యసేవలు అందించాలని అందుకు ఖర్చు రూ.వేలల్లో ఉంటుందని ఆసుపత్రి నిర్వాహకులు చెబుతుండడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు డబ్బులకు వెనుకాడకుండా పేదలు జేబులను గుల్ల చేసుకుంటున్నారు.
రోజుకు 28 కేసులు
ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రోజుకు ఒకటి లేదా రెండుకు మించి కేసులు నమోదు కాలేదు. తాజాగా సెప్టెంబరులో డెంగీ కేసుల సంఖ్య అమాంతం
పెరిగిపోయింది. ఒక్కసారిగా రోజుకు 28 కేసులు చొప్పున నమోదవడం పరిస్థితికి అద్ధం పడుతోంది. దోమల సంఖ్య పెరగడమే ఈ వైరల్, డెంగీ, మలేరియా జ్వరాలకు కారణమని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. గతంతోపోలిస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కాలువలు, చెరువులు, కుంటలు నిండాయి. ఈ కారణం వల్ల కూడా దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరీంనగర్ విషయానికి వస్తే.. చుట్టూ హారంలా జలాశయాలు, కాలువలు ఉండటంతో దోమల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది.
ఇదీ చదవండి: వారం వారం.. ప్రగతి లక్ష్యం.. కొత్త విధానానికి శ్రీకారం
Comments
Please login to add a commentAdd a comment