జ్వరాలతో నలుగురు మృతి | Fever, four killed | Sakshi
Sakshi News home page

జ్వరాలతో నలుగురు మృతి

Published Fri, Sep 6 2013 3:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM

Fever, four killed

అనిగండ్లపాడు (పెనుగంచిప్రోలు), న్యూస్‌లైన్ : వైరల్ జ్వరాలు, చికెన్ గున్యా లక్షణాలతో మండలంలోని అనిగండ్లపాడులో గంటల వ్యవధిలో నలుగురు మృత్యువాతపడ్డారు. గ్రామానికి చెందిన అత్తలూరి కోటేశ్వరరావు (65), దండా రామారావు (70) బుధవారం రాత్రి, కనకపూడి జగన్నాధం (70), నెలకుర్తి సీతారావమ్మ (69) గురువారం మృతిచెందారు. కొన్ని రోజులుగా గ్రామంలో వైరల్, చికెన్ గున్యా లక్షణాలతో జ్వరాలు వ్యాపించాయి. గ్రామంలో ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులు ఇద్దరికి పైగా ఉన్నారు.

తీవ్ర శారీరక నొప్పులతో నడవలేని, మంచంలో నుంచి లేవలేని స్థితిలో గ్రామస్తులు అల్లాడుతున్నారు. మృతిచెందిన నలుగురూ  కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపారు. వీరంతా వృద్ధులు కాగా, ఒకేసారి నలుగురు మృతిచెందడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే జ్వరపీడితులు, నొప్పులతో బాధపడుతున్నవారు ఆర్‌ఎంపీల వద్ద వందల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. మరోపక్క కొందరు ఆర్‌ఎంపీలు కూడా జ్వరాల బారిన పడటం గమనార్హం.

దీంతో జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, మధిర ఆస్పత్రుల్లో అనిగండ్లపాడు వాసులు పెద్ద సంఖ్యలో చికిత్సలు చేయించుకుంటున్నారు. అనిగండ్లపాడు పేరు చెబితేనే భయపడుతున్నారని, గ్రామానికి బయటవారు రావటానికి ఇష్ట పడటం లేదని, వచ్చినా వెంటనే వెళ్లి పోతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు, శివాలయం మాజీ చైర్మన్ నెలకుర్తి సాంబశివరావు తల్లి సీతారావమ్మ మృతదేహాన్ని పార్టీ మండల నేత వూట్ల నాగేశ్వరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు లగడపాటి మోహనరావు, మండల ఉపాధ్యక్షుడు కురువెళ్ల రాయప్ప, కాంగ్రెస్ నాయకులు పాటిబండ్ల వెంకట్రావు, వాసిరెడ్డి బెనర్జీ, లగడపాటి నాగేశ్వరరావు తదితరులు సందర్శించి నివాళులర్పించారు.
 
 మంచం పట్టిన బలుసుపాడు

 జగ్గయ్యపేట : మండల పరిధిలోని బలుసుపాడులో విషజ్వరాలు ప్రబలాయి. ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులే కనబడుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, బీసీ కాలనీల్లో జ్వరాలతో మంచం పట్టారు. గ్రామంలో పలు ప్రాంతాలలో మురికివాడల్లో అపరిశుభ్రత నెలకొంది. గ్రామంలో వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా సమైక్యాంధ్ర సమ్మెలో ఉండటంతో జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. సోమ, మంగళ, బుధవారాలు మూడురోజుల్లోనే పదుల సంఖ్యలో జ్వరంతో బాధపడుతూ జనం ఆస్పత్రులపాలయ్యారు.

అధిక జ్వరంతో పాటు కీళ్లనొప్పులు విపరీతంగా ఉండటంతో మంచానికే పరిమితమవుతున్నారు. ఇంట్లో ఒకరికి జ్వరం వ్యాపిస్తే కుటుంబ సభ్యులందరికీ జ్వరాలు వస్తున్నాయి. గ్రామంలో వైద్యులు లేకపోవడంతో పేట పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే తీవ్ర జ్వరంతో గ్రామంలోని బండ్ల నాగరత్నం, ప్రకాశరావు, అమ్మనబోయిన గోపయ్య, రాజు, కొరివి వెంకమ్మ, మేరుగ వజ్రం, మదారమ్మ, రోశమ్మ, కంబాల మణమ్మ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 గ్రామంలో పారిశుధ్యం అధ్వానం..


 గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. డ్రెయినేజీల పూడిక తీయకపోవడంతో పాటు తాగునీటి కుళాయిల వద్ద అపరిశుభ్రత నెలకొంది. కొన్ని నెలలుగా తాగునీటి ట్యాంకు కూడా శుభ్రం చేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారులు పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement