విషజ్వరంతో బాలుడి మృతి
ఇంటి వద్దకు అనుమతివ్వని యజమాని
హైవే పక్కనే టెంటు వేసి ఉంచిన వైనం
ఇబ్రహీంపట్నం: మూఢనమ్మకాలు ఇప్పటికీ ప్రజల మెదళ్లను శాసిస్తూనే ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ ఆ ఇంటి పరిసరాల్లోనే ఆడుకుంటూ ఉన్న ఆ బాలుడు.. మాయదారి వరద కారణంగా విషజ్వరానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం అద్దెకుంటున్న ఇంటి యజమాని ఆ బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నాడు. దీంతో బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు చేసేది లేక జాతీయ రహదారి పక్కనే ఓ టెంటు వేసి ఆ బాలుడి మృతదేహాన్ని ఉంచాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రసాద్‌నగర్‌లో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి..
విషజ్వరంతో..
కూలి చేసుకునే పాలపర్తి రాజేష్, రూతు దంపతులకు ఇద్దరు కుమారులు. జెడ్పీ పాఠశాలలో పెద్ద కుమారుడు ఏడో తరగతి, చిన్న కుమారుడు జాన్ వెస్లీ(12) ఆరో తరగతి చదువుతున్నాడు. ఇటీవల కాలంలో ప్రసాద్‌నగర్ వరద ముంపునకు గురికావడంతో పారిశుద్ధ్యలేమి, కలుషిత తాగునీరు, అందుబాటులో లేని వైద్య సదుపాయం వల్ల కొద్ది రోజుల క్రితం బాలుడు జాన్‌వెస్లీ జ్వరం బారిన పడ్డాడు. స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడితో వైద్యం చేయించారు. మరలా కడుపులో నొప్పి రావడంతో రెండురోజుల క్రితం మరో ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. వారు మెడికల్ టెస్ట్‌లు రాయగా.. తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేక చేయించలేదు. దీంతో కడుపులో నొప్పి భరించలేక బాలుడు మృత్యువాత పడ్డాడని తల్లిదంద్రులు చెబుతున్నారు.
మంటగలసిన మానవత్వం..
వారు ఉంటున్నది అద్దె ఇల్లు కావడంతో ఆ యజమాని బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని చెప్పారు. దీంతో 65వ నంబర్ జాతీయ రహదారి పక్కనే టెంట్‌వేసి బంధువుల కడసారి చూపుకోసం ఉంచారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ బాలుడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment