పుట్టబోయే బిడ్డ కడుపున పడింది మొదలు తల్లిదండ్రులకు బిడ్డలపై ఆపేక్ష మొదలవుతుంది. ఇక బోసి నవ్వులు నవ్వుతూ, పారాడుతూ, బుల్లి బుల్లిఅడుగులూ వేస్తూ, ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతోంటే ఆ మురిపమే వేరు. ఏ చిన్ని అనారోగ్యం వచ్చినా ఆందోళనే. పసిబిడ్డలను ఎదుగుతున్న క్రమంలో కంటికి రెప్పలా చూసుకోవాలి.
వయసు తగ్గట్టుగా ఎదుగుతున్నారా లేదా అని తనిఖీ చేసుకోవడంతో పాటు, సమయానికి టీకాలు వేయించాలి. అలాగే వారి ఆరోగ్యం పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కొంతమంది పిల్లలు మట్టి, బలపాలు, సబ్బు, పేపర్లు, సుద్ద లేదా గోడ గోళ్లతో గీరి తింటారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? తిట్టి, కొట్టి దండించడం కాకుండా అసలు ఎలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వైద్యులను సంప్రదించాలి. పిల్లలు మట్టిని ఎందుకు తింటారు? ఈ బురద తినే అలవాటు లేదా అలాంటి ఇతర తినకూడని వస్తువులను తినే అలవాటు రెండేళ్లకు మించి కొనసాగితే, శిశువు పికా అనే రుగ్మతతో బాధపడుతూ ఉండవచ్చు.
ఎందుకు అలా తింటారు
పోషకాహార లోపం, జింక్, కాల్షియం ,ఇనుము మొదలైన మూలకాల లోపం
కుటుంబలో నిర్లక్ష్యం/ అశాంతి వాతావరణం
ఆటిజం , మేధో వైకల్యం, ఇతర అభివృద్ధి సమస్యలు.
ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) లేదా స్కిజోఫ్రెనియా వంటి మానసిక ఆరోగ్య సమస్యలు
సుద్ద, బలపం, సున్నం, లాంటి వాటిని తినడం వల్ల పిల్లలు అనీమియా వస్తుంది. మరింత బలహీనంగా తయారవుతారు. కడుపులో పురుగులు, నొప్పులు, ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
ఏం చేయాలి?
పిల్లల వైద్యుల సలహా ప్రకారం పిల్లలకు తగిన ఆహారం ఇస్తే ఈ సమస్యలు దూరమవుతాయి. అలాగే ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్, ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా లభించే అరటి పండ్లను తినిపించాలి.
కాల్షియం లోపిస్తే పిల్లలకు బీన్స్, ఆకుపచ్చ కూరగాయలను తినిపించడం ద్వారా కాల్షియం లోపాన్ని దూరం చేయవచ్చు.
పిల్లల్లో అభద్రత తొలగించేలా, వారితో మరింత సన్నిహితంగా మెలగాలి. వారి పట్ల ప్రేమను మరింత ఎక్కువ పంచాలి.
పిల్లల అలవాటు, ఆరోగ్య ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. మినరల్, ఐరన్, కాల్షియం సప్లిమెంటేషన్‌తో పాటు డీవార్మ్ మందులను సిఫారసు చేస్తారు. కొంతమందిలో ప్రవర్తనా లేదా మానసిక చికిత్స కూడా అవసరం కావచ్చు. సమస్య ఏంటి అనేది వైద్య నిపుణుడు నిర్ధారిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment