సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జ్వరాలు ప్రబలుతున్నా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రబలిన జ్వరాల్లో 99 శాతం వైరల్ జ్వరాలేనని, డెంగీ చాలా తక్కువ మందికే సోకిందని శాసనసభకు తెలిపారు. 2007లో ప్రభావం చూపిన తరహాలో ఇప్పుడు డెంగీ తీవ్రత లేదని, అప్పటి కంటే బాధితుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నా, దాని తీవ్రత తక్కువే ఉందన్నారు. అప్పటి తరహాలో మృతుల సంఖ్య ఎక్కువ లేని విషయాన్ని గుర్తించాలన్నారు. ఆదివారం ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యులు భట్టి విక్రమార్క, అనసూయ (సీతక్క) ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్లనే జ్వరాలు తీవ్రంగా ప్రబలి రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని నిలదీయగా, మంత్రి దానికి వివరంగా సమాధానమిచ్చారు. వైరల్ జ్వరాలే అయినందున పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని, మరో నెలరోజులు ఈ తరహా పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికీ పరిస్థితి గంభీరంగానే ఉన్నా, ఆందోళన అవసరం లేదని తెలిపారు. ప్రతిపక్షాలు కూడా జనానికి ధైర్యం చెప్పేలా వ్యవహరించాలని కోరారు.
వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సేవలు భేష్..
జ్వరాలు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చొరవను శాసనసభ వేదికగా అభినందిస్తున్నట్లు ఈటల ప్రకటించారు. వారు చాలా అప్రమత్తంగా ఉండి సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
త్వరలో 9,381 పోస్టుల భర్తీ..
రాష్ట్రవ్యాప్తంగా 12,289 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారని, వీటిలో 9,381 పోస్టులు త్వరలో∙భర్తీ అవుతాయని ఈటల తెలిపారు. వీటి లో 2,917 మంది డాక్టర్లు, 4,268 మంది నర్సులు, మిగతావి పారా మెడికల్ పోస్టులని పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితి ప్రకటించాలి: కాంగ్రెస్
రాష్ట్రం మొత్తం జ్వరాలతో బాధపడుతున్నందున ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేకపోవడం, డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండటంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొందని ఆ పార్టీ సభ్యులు భట్టి విక్రమార్క, సీతక్క ఆరోపించారు. వాస్తవాలు దాచి మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దని, సమస్య తీవ్రంగా ఉందని ఆరోపించారు.
99 శాతం వైరల్ జ్వరాలే..
Published Mon, Sep 16 2019 2:08 AM | Last Updated on Mon, Sep 16 2019 4:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment