మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : డెంగీ జ్వరాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈ వ్యాధి విస్తరించటంతో ప్రజలు అల్లాడుతున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ఈ లక్షణాలతో జనం ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రధానంగా మురికివాడల్లో ఈ వ్యాధి విస్తరించింది. డెంగీ జ్వర లక్షణాలతో బాధితులు మచిలీపట్నంతో పాటు విజయవాడలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. స్థానిక బలరామునిపేటకు చెందిన తోకల సునీత (38), కనుమూరి వెంకటేశ్వరమ్మ (40) అనే ఇద్దరు మహిళలు డెంగీ జ్వర లక్షణాలతో నాలుగురోజుల క్రితం మృతిచెందారు. వీరిద్దరూ పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకున్నా ఫలితం లేకపోయింది.
నెల రోజుల నుంచే వైరల్ జ్వరాలు..
గత నెల రోజుల నుంచే పట్టణంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నా మునిసిపల్, వైద్యశాఖల అధికారులు పట్టించుకోకపోవటం వల్లే నేడు డెంగీ జ్వరాలు విస్తరిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లోని మురికివాడల్లో నేటికీ అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్ల మధ్య ఉన్న ప్రైవేటు పల్లపు స్థలాల్లో చేరిన మురుగునీటి నిల్వల వల్ల దోమలు అధికమై ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఈ డెంగీ జ్వరాల బారిన పడుతున్నారు.
మురుగునీరు రోజుల తరబడి నిల్వ ఉన్నా వాటిని తోడించేందుకు, పారిశుధ్య పరిరక్షణకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవటం లేదు. 37వ వార్డు బలరామునిపేట జగ్జీవన్‌రాం నగర్, రాజీవ్‌నగర్‌లలో ఇటీవల 10 రోజులుగా దాదాపు 40 మందికి పైగా ఈ వ్యాధి బారినపడి మచిలీపట్నం, విజయవాడల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్సలు పొందుతున్నారు. ఇప్పటికీ ఈ ప్రాంతానికి చెందిన పైలా గణేష్ కుటుంబ సభ్యులు నలుగురు డెంగీ లక్షణాలతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆ వార్డు మాజీ కౌన్సిలర్ లంక సూరిబాబు భార్య జ్యోతి డెంగీ లక్షణాలతో ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతో నాలుగురోజులపాటు విజయవాడలో చికిత్స పొంది ఇంటికి వచ్చారు. పిన్నింటి రోహిణి అనే మహిళ ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇజ్జాడ సరస్వతమ్మ, తెల్లా కామయ్య స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య శాఖ, మునిసిపల్ అధికారులు స్పందించటం లేదు. ఈ ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య, వైద్యశిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకోకపోవడంపై ఆ ప్రాంత ప్రజలు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా డెంగీ, వైరల్ జ్వరాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మునిసిపల్, వైద్యశాఖల అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
కలుషిత నీరు, దోమల వల్లే : అల్లాడ శ్రీనివాసరావు, ప్రభుత్వాస్పత్రి వైద్యుడు
కలుషిత నీరు, ఏడిస్ ఈజిప్టా దోమకాటు వల్లే డెంగీ జ్వరాలు వస్తున్నాయి. బందరు పట్టణంలో ఈ వ్యాధి ఎక్కువ మందికే సోకుతోంది. జ్వరం వచ్చిన ప్రతి 150 మందిలో 10 మందికి ఈ వ్యాధి సోకుతోంది. జాయింట్‌లలో నొప్పులు, అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, శరీరంపై టిపై ఎర్రటి మచ్చలు ఈ వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాల్లో ఏది ఉన్నా ముందుగా వైద్యులను సంప్రదించాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇంటి పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూడాలి. టైర్లు, రోళ్లు, కొబ్బరిబొండాలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఏడిస్ ఈజిప్టా దోమలు వృద్ధి చెందుతాయి.
కిట్లు ఉన్నాయి : సోమసుందరరావు, జిల్లా ప్రభుత్వాస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్
డెంగీ జ్వర లక్షణాలు ఉన్న రోగులకు ఆ వ్యాధి సోకిందో లేదో నిర్ధారించే పరీక్షకు అవసరమైన కిట్లు ఆస్పత్రిలో రెండు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కిట్ ద్వారా 96 మందికి ఈ పరీక్షలు చేసే వీలుంది. మా వద్ద ఉన్న ఎలీసా డెంగీ నిర్ధారణ కిట్ ద్వారానే రోగ నిర్ధారణ జరుగుతుంది.
బందరుకు డెంగీ బెంగ
Published Mon, Sep 2 2013 2:30 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement