
అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంగడ గ్రామానికి చెందిన తల్లీకుమారులు
మన్యంపై వ్యాధులు పంజా విసురుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో నీటి వనరులు కలుషితమవుతున్నాయి. ఈ నీటినే స్థానికులు వినియోగించి రోగాలబారిన పడుతున్నారు. టైఫాయిడ్, విషజ్వరాల బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. టైఫాయిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో వైద్యాధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. జ్వరపీడితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వ్యాధులు మరింత విజృంభించకముందే అధికారులు అప్రమత్తమై నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
విశాఖపట్నం , అరకులోయ: వ్యాధులు విజృంభిస్తుండడంతో మన్యం వాసులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో రక్షిత మంచినీటి వనరులు లేకపోవడంతో ఊటగెడ్డలు, గ్రావీటి తాగునీటి పథకాల ద్వారా సేకరించిన నీటినే గిరిజనులు వినియోగిస్తున్నారు. దీంతో వ్యాధులబారిన పడుతున్నారు. కొద్దిరోజులుగా మన్యంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వైరల్, టైఫాయిడ్ జ్వర పీడితులే అధికంగా వస్తున్నారు. అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాలకు చెందిన రోగులు అరకులోయలోని ప్రాంతీయ ఆస్పత్రికి వైద్యం కోసం తరలిస్తున్నారు. ఈ సీజన్‌లో మలేరియా జ్వరాల తీవ్రత తక్కువుగా ఉండగా, వైరల్, టైఫాయిడ్ జ్వరాల కేసులు అధికమయ్యాయి. నెల రోజుల వ్యవధిలో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో 69 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. దగ్గు, జలుబుతో కూడిన వైరల్ జ్వరాల కేసులు కూడా అ«ధికంగానే ఉన్నాయి. అనంతగిరి, లుంగపర్తి, పినకోట, ఉప్ప, హుకుంపేట, డుంబ్రిగుడ, కిల్లోగుడ, పెదబయలు, రూడకోట, గోమంగి, ముంచంగిపుట్టు సీహెచ్‌సీల్లో కూడా జ్వర పీడితుల ఓపీ అధికంగా ఉంది. గిరిజన గ్రామాల్లో పర్యటించే వైద్యసిబ్బందిని కూడా జ్వరపీడితులు కలిసి వైద్యసేవలు పొందుతున్నారు. మలేరియా కేసుల తీవ్రత లేనప్పటికీ కలుషిత నీటి వినియోగం కారణంగా వ్యాప్తి చెందే టైఫాయిడ్, వైరల్ జ్వరాల తీవ్రతపై వైద్యబృందాలు కూడా ఆందోళన చెందుతున్నాయి.
కలుషిత నీరే ఆధారం
గిరిజనులకు సురక్షిత తాగునీరును అందించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వందలాది గిరిజన గ్రామాల ప్రజలు ఇప్పటికీ ఊటనీటిపైనే ఆధారపడుతున్నారు. గత్యంతరంలేని పరిస్థితిలో ఈ నీటినే తాగి రోగాల బారిన పడుతున్నారు. 11 మండలాల పరిధిలోని 244 పంచాయతీల్లో 3,759 గిరిజన గ్రామాలు ఉండగా, గ్రావీటి, పెద్ద తరహ తాగునీటి పథకాలు ఉన్నవి 1288 గ్రామాలేనని ఐటీడీఏ గణాంకాలు చెబుతున్నాయి. 1242 గ్రామాల్లో గిరిజనులు తాగునీటి కుండీలు, తాగునీటి బావులపై ఆధారపడుతున్నారు. అయితే వర్షాలు కురిసే సమయంలో నీటి వనరులు కలుషితమవుతున్నాయి. ఎప్పటికప్పుడు కుండీలు, బావుల్లో క్లోరినేషన్ పనులు చేపట్టకపోవడంతో కలుషిత నీటిని సేవిస్తున్న గిరిజనులు వైరల్, టైఫాయిడ్ జ్వరాలకు గురవుతున్నారు. సౌర పంపులు ఉన్న 93 గ్రామాలలో తాగునీరు సురక్షితంగా ఉండడంతో ఆయా గ్రామాలలో గిరిజనులు సీజనల్ వ్యాధులకు దూరంగానే ఉన్నారు. 1365 పంపింగ్, గ్రావీటి పథకాలను నిర్మించినప్పటికీ ట్యాంకులను శుభ్రం చేసే పనులు సక్రమంగా జరగడం లేదు. కొండల నుంచి వృథాగా పోతున్న నీటిని గ్రామాలకు మళ్లించే గ్రావీటి తాగునీటి పథకాలు కూడా గిరిజనుల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. పంచాయతీల ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు కూడా తాగునీటి వనరుల క్లోరినేషన్‌కు తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఊటగెడ్డలు, కుండీలు, గ్రావీటి పథకాలలో సేకరించిన తాగునీటిని నేరుగా వినియోగించవద్దని, కాచి చల్లార్చిన తరువాత వాడాలని వైద్యబృందాలు గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ వారిలో మార్పు రావడం లేదు.
వ్యాధులపై అప్రమత్తం
టైఫాయిడ్, వైరల్ జ్వరాల తీవ్రతపై వైద్యబృందాలను అప్రమత్తం చేశాం. అన్ని పీహెచ్‌సీల్లో జ్వరాల నివారణకు మందులు అందుబాటులో ఉన్నాయి. పీహెచ్‌సీల్లో జ్వర పీడితులకు వైద్యసేవలు కల్పిస్తున్నాం. గ్రామాలలో తాగునీటి వనరుల క్లోరినేషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని పంచాయతీ అధికారులను కోరాం. కాచి చల్లార్చిన నీటినే వినియోగించాలని గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం.
–డాక్టర్ కె.లీలాప్రసాద్, ఏడీఎంహెచ్‌వో, పాడేరు ఐటీడీఏ
Comments
Please login to add a commentAdd a comment