సాక్షి, హైదరాబాద్: గతేడాది వర్షాకాలంలో రాష్ట్రాన్ని గడగడలాడించిన డెంగీ... సీజన్ దాటినా ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం డెంగీతో కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నుంచి సోమవారం వరకు అంటే 20 రోజుల్లో రాష్ట్రంలో 180 డెంగీ కేసులు నమోదయ్యాయి. సాధారణంగా వర్షాకాలంలో డెంగీ జ్వరాలు, వైరల్ ఫీవర్లు వస్తుంటాయి. సీజన్ దాటాక కూడా ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయంటే డెంగీకి కారణమయ్యే దోమ ఇంకా అక్కడక్కడా ఉండటం వల్లేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
అయితే వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు మాత్రం డెంగీ నివారణ చర్యలను దాదాపు నిలిపివేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మరోవైపు స్వైన్‌ఫ్లూ కేసులు కూడా రాష్ట్రంలో నమోదవుతున్నాయి. గత 15 రోజుల్లోనే 30 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వైన్‌ఫ్లూ నియంత్రణకు అన్ని జిల్లా ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ ఐసొలేటెడ్ వార్డులను ఏర్పాటు చేశారు. ఆయా ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ మందులు, మాస్కులు సిద్ధంగా ఉంచారు. జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం, తలనొప్పి, ఒంటి నొప్పులు, ఊపిరి తీసుకోలేకపోవడం, ఛాతీలో మంట వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
గతేడాది 13,417 కేసులు
ఎన్నడూ లేనంతగా గతేడాది డెంగీతో జనం విలవిలలాడిపోయారు. డెంగీతో అనేక మంది చనిపోయినా వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం మరణాల సంఖ్యను తక్కువగా చూపించినట్లు విమర్శలు వచ్చాయి. 2019 జనవరి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు తెలంగాణలో 13,417 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అందులో కేవలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే 10 వేల కేసుల వరకు నమోదైనట్లు అంచనా వేశారు.
డెంగీ కేసుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని అప్పట్లో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 40 నుంచి 50 శాతం వరకు హైదరాబాద్, ఖమ్మం జిల్లాలోనే నమోదయ్యాయని పేర్కొన్నారు. గతేడాది వర్షాకాల సీజన్‌లో అధిక వర్షాలు కురవడం వల్లే అధికంగా కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 20 నుంచి 25 రోజులు, అక్టోబర్‌లో 25 రోజులకుపైగా వర్షాలు కురవడం వల్లే డెంగీ దోమల వ్యాప్తి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment