dengue fever cases
-
ఒక్కసారిగా పెరిగిన డెంగీ కేసులు, అప్రమత్తమైన ఏపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వారం రోజుల్లోనే (ఆగస్టు 23 నుంచి 29 వరకు) డెంగీ జ్వరాలు అకస్మాత్తుగా పెరిగాయి. ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలోనే ఇవి నమోదయ్యాయి. గత ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు వరకు మొత్తం 1,388 డెంగీ కేసులు నమోదు కాగా, అందులో ఆగస్టు 23–29 మధ్యలోనే 225 కేసులున్నాయి. ఇందులో ఒక్క విశాఖలోనే 87 కేసులు నమోదయ్యాయి. మలేరియా కేసుల్లోనూ అంతే. 48 కేసులు వారం రోజుల్లో నమోదైతే అందులో 36 కేసులు విశాఖపట్నం జిల్లాలో నమోదైనట్లు ఆరోగ్యశాఖ తాజా గణాంకాల్లో వెల్లడైంది. ఒక్కసారిగా కేసులు పెరగడంతో ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరోవైపు.. చికున్ గున్యా కేసులు కూడా ఈ ఏడాది ఇప్పటివరకూ 25 నమోదైనట్లు అధికారులు తెలిపారు. దోమల సంతానోత్పత్తికి ఇవే కారణాలు.. ఎక్కడ నీళ్లు నిల్వ ఉంటే అక్కడ డెంగీ దోమలు సంతానోత్పత్తి చేస్తుంటాయి. ఉదా.. ఇంటి ఆవరణలో కొబ్బరి చిప్పలు, పాత నీళ్ల బాటిళ్లు, టైర్లు, పెంకులు ఇలా రకరకాల వస్తువుల్లో నీళ్లు నిల్వ ఉంటే లార్వా వృద్ధి చెందుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 4,887 ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉన్నట్లు అధికారులు ఇంటింటి సర్వేలో గుర్తించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 896 ఉన్నాయి. మరో 7,425 చోట్ల పాత టైర్లు ఉన్న ప్రాంతాలను, 6,992 కొబ్బరి చిప్పలున్న ప్రాంతాలను గుర్తించి వాటిని తొలగించారు. మూడు శాఖల సమన్వయంతోనే కట్టడి మునిసిపల్, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖ.. ఈ మూడు శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఈ జ్వరాల నియంత్రణ సాధ్యమవుతుంది. ఆరోగ్యశాఖ బృందాలు డెంగీ తీవ్రత ఉన్నచోట చర్యలు తీసుకుంటున్నాయి. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉంచుకోవద్దని చెబుతున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ అదుపులోనే ఉన్నాయి. త్వరలోనే విశాఖలో డెంగీని అదుపులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – డా. గీతాప్రసాదిని,ప్రజారోగ్య సంచాలకులు డెంగీ లక్షణాలు.. ► డెంగీ జ్వరం ఈడిస్ దోమ కుట్టడంవల్ల వస్తుంది. ► దోమ కుట్టిన 24 గంటల్లోనే విపరీతమైన తలనొప్పి వస్తుంది. ► జ్వర తీవ్రత పెరిగేకొద్దీ కళ్లు ఎర్రగా మారుతుంటాయి. ► మరుసటి రోజు కండరాల నొప్పి తీవ్రమవుతుంది. ► అనంతరం కీళ్ల నొప్పులు పెరుగుతాయి. ► శరీరమంతా దద్దుర్లు మొదలై, అవి ఎర్రగా మారతాయి. ► ఆహారం తినాలనిపించదు.. తీసుకున్నా వాంతులవుతాయి. ► డెంగీ హీమరోజిక్ ఫీవర్ (డీహెచ్ఎఫ్) అంటే ఎక్కువ తీవ్రత ఉన్నట్టు లెక్క. ► ఇక చివరి దశ అంటే డెంగీ షాక్ సిండ్రోమ్ (డీఎస్ఎస్) అంటారు. చికిత్సకు మార్గదర్శకాలు.. ► డెంగీ జ్వరాన్ని ఎలీశా టెస్టు ద్వారా నిర్ధారిస్తారు. ► ఫిజీషియన్ సూచనల మేరకు మాత్రమే యాంటీబయోటిక్స్ ఇవ్వాలి. ► తాజాగా యాంటీవైరల్ ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ► జ్వర తీవ్రతను తగ్గించేందుకు తరచూ పారాసెటిమాల్ ఇవ్వాలి. ► రోగికి పళ్లు, పళ్ల రసాలు మాత్రమే ఆహారంగా ఇవ్వాలి. ► పరిస్థితిని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. ► రోగికి వీలైనంత ఎక్కువ మోతాదులో నీళ్లు తాగించాలి. మరో 30 ఆస్పత్రుల్లో పరీక్షలు రాష్ట్రంలో ఇప్పటివరకూ 24 ఆస్పత్రుల్లో మాత్రమే డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఇవి అందరికీ అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో మరో 30 ఆస్పత్రుల్లో చేస్తున్నారు. ప్రధానంగా మునిసిపల్, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల మధ్య సమన్వయం లోపించడంవల్లే కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 9,147 లోతట్టు ప్రాంతాలున్నట్లు గుర్తించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 8,042 ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 1,105 ఉన్నాయి. వర్షాల కారణంగా ఈ ప్రాంతాల్లో ఎక్కువ నీళ్లు నిలబడటంతో దోమల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటోంది. -
మళ్లీ డెంగీ కాటు!
సాక్షి, హైదరాబాద్: గతేడాది వర్షాకాలంలో రాష్ట్రాన్ని గడగడలాడించిన డెంగీ... సీజన్ దాటినా ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం డెంగీతో కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నుంచి సోమవారం వరకు అంటే 20 రోజుల్లో రాష్ట్రంలో 180 డెంగీ కేసులు నమోదయ్యాయి. సాధారణంగా వర్షాకాలంలో డెంగీ జ్వరాలు, వైరల్ ఫీవర్లు వస్తుంటాయి. సీజన్ దాటాక కూడా ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయంటే డెంగీకి కారణమయ్యే దోమ ఇంకా అక్కడక్కడా ఉండటం వల్లేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు మాత్రం డెంగీ నివారణ చర్యలను దాదాపు నిలిపివేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మరోవైపు స్వైన్‌ఫ్లూ కేసులు కూడా రాష్ట్రంలో నమోదవుతున్నాయి. గత 15 రోజుల్లోనే 30 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వైన్‌ఫ్లూ నియంత్రణకు అన్ని జిల్లా ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ ఐసొలేటెడ్ వార్డులను ఏర్పాటు చేశారు. ఆయా ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ మందులు, మాస్కులు సిద్ధంగా ఉంచారు. జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం, తలనొప్పి, ఒంటి నొప్పులు, ఊపిరి తీసుకోలేకపోవడం, ఛాతీలో మంట వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గతేడాది 13,417 కేసులు ఎన్నడూ లేనంతగా గతేడాది డెంగీతో జనం విలవిలలాడిపోయారు. డెంగీతో అనేక మంది చనిపోయినా వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం మరణాల సంఖ్యను తక్కువగా చూపించినట్లు విమర్శలు వచ్చాయి. 2019 జనవరి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు తెలంగాణలో 13,417 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అందులో కేవలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే 10 వేల కేసుల వరకు నమోదైనట్లు అంచనా వేశారు. డెంగీ కేసుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని అప్పట్లో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 40 నుంచి 50 శాతం వరకు హైదరాబాద్, ఖమ్మం జిల్లాలోనే నమోదయ్యాయని పేర్కొన్నారు. గతేడాది వర్షాకాల సీజన్లో అధిక వర్షాలు కురవడం వల్లే అధికంగా కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 20 నుంచి 25 రోజులు, అక్టోబర్‌లో 25 రోజులకుపైగా వర్షాలు కురవడం వల్లే డెంగీ దోమల వ్యాప్తి పెరిగింది. -
‘డెంగీ’ తాండవం!
ఒక్కసారిగా మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వీటి బారిన పడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు పాముకాటు కేసులతో నిండిపోయిన ఆస్పత్రులు, నేడు జ్వరపీడితులతో కిట కిటలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా డెంగీ వ్యాధి కోరలు చాస్తుండటం ప్రజానీకాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కృష్ణా వరదలకు తోడు వర్షాల కారణంగా వాతావరణంలో వచ్చిన మార్పులు, పారిశుద్ధ్య లోపంతో దోమలు స్వైర విహారం చేస్తూ జనంపై దండెత్తుతున్నాయి. సాక్షి,మచిలీపట్నం(కృష్ణా): జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. గత పది రోజుల కాలంలో జ్వరాల బారిన పడి సుమారుగా 20 మందికిపైగానే మృత్యువాతపడ్డారు. డెంగీ వ్యాధి సోకి మరణాలు సంభవిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ వద్ద నమోదవుతున్న గణాంకాలు కూడా కొంత ఆందోళన కరంగానే ఉన్నాయి. గత ఏడాది మలేరియా కేసులు 28 నమోదు కాగా, 102 మందికి డెంగీ సోకినట్లుగా లెక్కలున్నాయి. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి 20 మందికి మలేరియా 121 మందికి డెంగీ వ్యాధి సోకినట్లుగా పరీక్షల్లో వెల్లడైంది. ఎక్కువగా విజయవాడ వంటి నగరాల్లోనే డెంగీ వ్యాధి గ్రస్తులు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాంతాల్లోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రైవేటు ల్యాబ్‌ల దోపిడీ.. జ్వరంతో వైద్యం కోసమని ఆస్పత్రికి వచ్చే రోగులను కొన్ని ప్రైవేటు ల్యాబ్ రక్త పరీక్షలతో దోపిడీ చేయటమే కాకుండా, డెంగీ నిర్థారణ చేస్తూ వారిని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ టీఎస్ఆర్ మూర్తి ఇటీవల మచిలీపట్నంలోని మూడు ల్యాబ్‌లను పరిశీలించగా, వ్యాధి నిర్థారణ పరీక్షలకు సంబంధించి ల్యాబ్ నిర్వాహకుల వద్ద ఎటువంటి రికార్డులు అందుబాటులో లేకపోవటాన్ని గుర్తించారు. మొవ్వ మండలంలో ముందస్తు అనుమతులు లేకుండానే ల్యాబ్ నిర్వహిస్తుండటమే, కాకుండా తనిఖీకి వెళ్లిన సమయంలో ఎటువంటి ఒరిజనల్ ధ్రువపత్రాలు చూపించకపోవటంతో దానికి తాళాలు వేశారు. ప్రైవేటు ల్యాబ్‌లు మలేరియా, డెంగీ వ్యాధులను బూచిగా చూపి, వివిధ రకాల పరీక్షల పేరుతో దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిరుపయోగంగా పరికరాలు.. ఎలీసా పరీక్ష ద్వారా నిపుణుల సమక్షంలో చేసిన డెంగీ వ్యాధి నిర్థారణ చేయాలి. జిల్లాలో ఒక్క విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఇటువంటి సదుపాయం ఉంది. ప్రైవేటు ల్యాబ్‌ల్లో డెంగీని నిర్థారించడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రమైన మచిలీపట్నం ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో 2007లో డెంగీ నిర్థారణ చేసే పరికరాన్ని సరఫరా చేశారు. కానీ దీనికి అనుసంధానంగా వాషర్ అనే పరికరం లేకపోవటంతో పరీక్షలు చేసే అవకాశం లేక దానిని మూలన పెట్టేశారు. రూ. 2 నుంచి 3 లక్షల లోపు ఖర్చు చేస్తే పరికరాలను సమకూర్చవచ్చు. కానీ ఇటువంటి సమస్యలపై గత టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవటంతో ఉపయోగంలోకి రాలేదు. 2017లో బ్లడ్ బ్యాంక్‌లో రీడర్, వాషర్ కొత్తపరికరాలు వచ్చాయి. అయితే రక్త నిధి సేకరణ చోట డెంగీ పరీక్షలు చేయకూడదని నిపుణులు చెప్పటంతో అధునాతన పరికరాలు ఉన్నప్పటకీ పెద్దాసుపత్రిలో డెంగీ నిర్ధారణ పరీక్షలు మాత్రం జరుగటం లేదు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ దీనిపై దృష్టి సారించి, పరిస్థితి చేయిదాటిపోకముందే సంబంధిత శాఖలను సమన్వయం చేసి, విష జ్వరాల నివారణకు అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతున్నారు. విషజ్వరాలతో ముగ్గురు మృతి.. జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలతో మంగళవారం ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలంలోని వేమవరం గ్రామానికి చెందిన ఎం. కృష్ణ(30), తిరువూరు నియోజకవర్గం చీమలపాడుకు చెందిన విజయ్‌బాబు(10), ఏ. కొండూరు గ్రామానికి చెందిన వనపర్ల భామయ్య(50) విషజ్వరాలకు బలయ్యారు. అప్రమత్తంగా ఉన్నాం.. సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్యశాఖ పరంగా అప్రమత్తంగానే ఉన్నాం. విషజ్వరాలు ఉన్నట్లుగా మా దృష్టికి వచ్చిన వెంటనే వైద్య బృందాలను పంపించి ఇంటింటి సర్వే చేయిస్తున్నాం. డెంగీ నిర్థారణ ప్రైవేటు ల్యాబ్‌ల్లో చేయడానికి వీల్లేదు. ప్రైవేటు ల్యాబ్‌లపై తనిఖీలు చేస్తున్నాం. మచిలీపట్నంలో డెంగీ వ్యాధి నిర్థారణ పరీక్షలు చేసేలా ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్తాం. వైద్య విధాన పరిషత్ అధికారులతో కూడా మట్లాడుతాం. – డాక్టర్ టీఎస్ఆర్ మూర్తి, డీఎంహెచ్ఓ -
‘తెలంగాణలో 2400 డెంగ్యూ కేసులు నమోదు’
సాక్షి, హైదరాబాద్ : నగరంలో రెండు మూడు వారాలుగా యాంటీ లార్వా ఆపరేషన్స్ చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగ్యూ కేసుల వివరాలను ఎప్పటికపుడు వెబ్సైట్లో నమోదు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో మొత్తం 2400 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, హైదరాబాద్ లో 845 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 86 వేల ఇళ్లలో స్ర్పే చేయించామని, పాఠశాలలను శుభ్రం చేసే విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. హైదరాబాద్ లో 410 అధిక ప్రమాదం గల ఏరియాలు ఉన్నాయని, డిసెంబర్ వరకు దోమల నివారణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారంలో రెండు రోజులు దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ చేస్తున్నామని వెల్లడించారు. దోమల నియంత్రణ కోసం 1040 మిషన్లు ఉన్నాయన్నారు. అసలు దోమలు ఎపుడు ప్రభావంగా ఉంటున్నాయన్న అంశంపై పరిశోధన చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం విష జ్వరాల ప్రభావం తగ్గిందని కమిషనర్ తెలిపారు. -
డెంగీ పంజా
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో డెంగీ పంజా విసురుతోంది. ఏ ఊరిలో చూసినా జ్వరపీడితులే మంచంపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. చిన్నా పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలు, చికున్‌గున్యా, ఇతర జ్వరాలతో వణికిపోతున్నారు. వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏజెన్సీ ప్రాంతంలోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆదిలాబాద్ పట్టణంతోపాటు ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, తదితర మండలాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వైరల్ జ్వరాలు సోకడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో పడకలన్ని నిండిపోయాయి. ఒక్కో బెడ్‌పై ఇద్దరు ముగ్గురేసి రోగులకు వైద్య చికిత్సలు అందించాల్సిన దుస్థితి నెలకొంది. వైద్య, ఆరోగ్య శాఖ వ్యాధులను అరికట్టాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో జ్వరాలు అదుపులోకి రావడం లేదు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం లేదని, దోమల నివారణకు చర్యలు చేపట్టడం లేదని పలువురు పేర్కొంటున్నారు. వణికిస్తున్న జ్వరాలు జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20,289 మందికి వైరల్, ఇతర జ్వరాలు, ఐదుగురికి మలేరియా జ్వరాలు, 140 మందికి డెంగీ జ్వరాలు సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖాధికారులు లెక్కలు చూపుతున్నారు. అధికారుల లెక్కలకు రెట్టింపుగా జ్వరపీడితుల సంఖ్య ఉందని తెలుస్తోంది. రిమ్స్ ఆస్పత్రిలోని పిల్లల వార్డులో దాదాపు వంద మందికి పైగా డెంగీ జ్వరంతో చేరారు. ఇతర జ్వరాలతో కూడా పిల్లల వార్డు కిక్కిరిసిపోయింది. దీంతోపాటు రిమ్స్ జనరల్ వార్డులో మహిళలు, పురుషుల రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రోగులకు సరిపడా పడకలు లేకపోవడంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మలేరియా కేసులు బజార్హత్నూర్లో 1, సైద్పూర్లో 1, హస్నాపూర్‌లో 2, ఆదిలాబాద్ పట్టణంలోని న్యూహౌజింగ్బోర్డులో ఒకరికి మలేరియా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. పారిశుధ్యమే కారణం.. ఆదిలాబాద్ పట్టణంలో డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మిషన్ భగీరథ గుంతల్లో ఇటీవల కురిసిన వర్షపునీరు చేరడం, దోమలు వృద్ధి కావడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మొదటి కేసు జిల్లాలో ఇంద్రవెల్లి మండలం సుక్యనాయక్తండా, ఉట్నూర్ మండలం అందునాయక్తండాల్లో నమోదైనట్లు వైద్యారోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్‌లో డెంగీ బాధితులు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా పారిశుధ్య సమస్యతోనే జ్వరాలు సోకుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆస్పత్రులు కిటకిట.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోజురోజుకు జ్వర బాధితుల సంఖ్య పెరుగుతుండడమే దీనికి కారణం. రిమ్స్‌లో రోగులకు సరిపడా బెడ్లు లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారు. ఇదే అదునుగా తీసుకొని ప్రైవేట్ ఆస్పత్రుల వారు అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. అవసరం లేకున్నా అన్ని పరీక్షలు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు లబోదిబోమంటున్నారు. సరైన వైద్యం అందడంలేదనే కారణంతో ఎక్కువమంది వైద్య చికిత్సల కోసం మహారాష్ట్రలోని యావత్మాల్, నాగ్‌పూర్, తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. డెంగీతో ఒక్కరూ చనిపోలేదు జిల్లాలో డెంగీ కేసులు ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా డెంగీతో చనిపోయినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడి కాలేదు. జైనథ్ మండలంలో ఒక బాలుడు చనిపోయినట్లు తెలిసింది. వారిక్కడ వైద్య సేవలు పొందలేదు. వాటికి సంబంధించి రిపోర్టులు పరిశీలిస్తున్నాం. ముఖ్యంగా డెంగీ జ్వరం రావడానికి సానిటేషనే కారణం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొబ్బరిచిప్పలు, పాత టైర్లు, వర్షపు నీరు నిల్వ ఉండే వాటిని తొలగించారు. వాటితోనే డెంగీ దోమలు వృద్ధి చెందుతాయి. దోమల నివారణ కోసం ఫాగింగ్ స్ప్రే చేయిస్తున్నాం. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. తీవ్ర జ్వరం వస్తే ఆర్ఎంపీలను సంప్రదించవద్దు. సమీప ఆస్పత్రిలో వైద్య చికిత్సలు తీసుకోవాలి. డెంగీ జ్వరం కోసం రిమ్స్‌లో ఎన్ఎస్–1 పరీక్షలు చేయడం జరుగుతుంది. నాలుగు రోజులపాటు తగ్గకుంటే ఐజీఎం పరీక్ష కూడా చేయడం జరుగుతుంది. – డాక్టర్ రాజీవ్‌రాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఆదిలాబాద్ -
దోమల డెంగీయాత్ర
సాక్షి, అమరావతి: - గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన సంజీవరావు అనే వ్యక్తి ఈనెల 25న తీవ్ర జ్వరంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించారు. అక్కడ గంటలోపే పరీక్షలు చేసి డెంగీగా నిర్ధారించారు. మూడు రోజులపాటు ఇన్‌పేషెంటుగా ఉంచి రూ.45 వేలు వసూలు చేశారు. - విశాఖపట్నం నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన లక్ష్మీదేవమ్మ జ్వరంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. డెంగీ సోకిందని, ప్లేట్లెట్స్ బాగా పడిపోయాయంటూ ఇన్‌పేషెంటుగా చేర్చారు. ప్లేట్లెట్స్ పేరుతో రెండ్రోజులు చికిత్స చేసి రూ.41వేలు బిల్లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ వాసులను డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయనడానికి పైరెండు కేసులు చక్కటి ఉదాహరణలు. గత ఏడాది గ్రామీణ ప్రాం తాల్లో ఎక్కువగా ఇవి నమోదు కాగా ఈ ఏడాది పట్ట ణాలను భయకంపితులను చేస్తున్నాయి. తాజాగా గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ నగరపాలక సంస్థల పరిధిలో అత్యధిక డెంగీ కేసులు నమోదైనట్టు ప్రజారోగ్యశాఖ వెల్లడించింది. బాధితులు ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న కారణంగా ఇంకా ఆ కేసులు వెల్లడి కాలేదని, అవి కూడా కలుపుకుంటే కేసుల సంఖ్య భారీ స్థాయిలో ఉంటుందని ఆ శాఖకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు. డెంగీ నివారణకు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని అయినా నియంత్రణ కావడంలేదన్నారు. గతేడాది సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేసి ‘దోమలపై దండయాత్ర’ చేసినా అవి లొంగలేదని, ఈ ఏడాది మరిన్ని దోమకాటు జ్వరాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. బెంబేలెత్తిస్తున్న కేసులు గుంటూరు, విశాఖలోని నగర పాలక సంస్థల్లో డెంగీ జ్వరాలు నియంత్రణలోకి రావడంలేదని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గత ఏడాది గుంటూరు నగరంలో కేవలం 70 కేసులు మాత్రమే నమోదు కాగా.. గడిచిన రెండు మాసాల్లో 400 పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో గత నెల రోజుల్లో 550 డెంగీ కేసులు పైనే నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలోనూ తక్కువేమీ కాదు. గత కొంతకాలంగా ఒంగోలులోని రిమ్స్‌తో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రులకు డెంగీతో వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 400కు పైగా కేసులు నమోదైనట్టు వెల్లడైంది. నెల్లూరు, తిరుపతి, కడప, విజయవాడ, కర్నూలు నగరాల్లో సైతం అనేక డెంగీ కేసులు నమోదైనట్లు సమాచారం. కాగా, గడిచిన రెండు మాసాల్లోనే వివిధ మున్సిపాలిటీల పరిధిలో 3వేల డెంగీ కేసులు నమోదైనట్టు ప్రజారోగ్యశాఖ పరిశీలనలో తేలింది. ప్లేట్లెట్ల పేరిట దోపిడీ ప్రైవేటు ఆస్పత్రుల్లో, డయాగ్నిస్టిక్స్ సెంటర్లలో ప్లేట్లెట్స్ పేరిట భారీ దోపిడీ మొదలైంది. ప్లేట్లెట్స్ ఎక్కించాలని.. లేదా పేషెంటు పరిస్థితి బాగోలేదంటూ రోగిని పిండేస్తున్నారు. జ్వరం లక్షణాలు పూర్తిగా తెలియకముందే ఇన్‌పేషెంటుగా చేర్చుకుని రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ బిల్లులు బాదేస్తున్నారు. వాస్తవానికి డెంగీ జ్వరం నిర్ధారించాలంటే రాపిడ్ టెస్ట్ కిట్ ఒక్కటే సరిపోదు. ఐజీజీ, ఐజీఎం, ఎలీశా టెస్టులు చేస్తేనే పూర్తిస్థాయిలో ఫలితం తేలుతుంది. ఇవన్నీ ఏమీ చేయకుండానే డెంగీ అని భయపెట్టి దోచుకుంటున్నారు. మూడు శాఖల మధ్య సమన్వయలోపం ఇదిలా ఉంటే.. పట్టణాల్లో ఎలాంటి కేసులు నమోదైనా దానికి ఆరోగ్యశాఖదే తప్పుగా చూపిస్తున్నారని, కానీ.. పురపాలక శాఖ ఈ విషయంలో తమకు సహకరించడంలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులు నమోదైనప్పుడు కేవలం ఆరోగ్యశాఖ మాత్రమే స్పందిస్తోందని, కనీస నివారణ, నియంత్రణ చర్యలకు మున్సిపల్ శాఖ ముందుకు రావడంలేదన్నది ఆరోగ్యశాఖ భావన. గ్రామీణాభివృద్ధి శాఖ కూడా తమతో కలిసి రావడంలేదని, మూడు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంవల్లే ఇలాంటి పరిస్థితి నెలకొని ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు.. మున్సిపాల్టీలు, గ్రామాల్లో పారిశుధ్యం దారుణంగా ఉంటోంది. గిరిజన ప్రాంతాల్లో సరేసరి. వర్షం పడితే చాలు పట్టణాలు చెరువుల్లా మారిపోతున్నాయి. దీంతో నీటి నిల్వ కారణంగా డెంగీ జ్వరాలకు కారణమయ్యే ఈడిస్ దోమల వ్యాప్తి ఎక్కువవుతోంది. ప్రధానంగా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి నగరాల్లో అయితే సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే చాలు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లకు ఇరువైపులా రకరకాల పనులకు తవ్విన గోతుల్లో నీళ్లు నిల్వ ఉంటున్నాయి. దీంతో ఇవన్నీ దోమల వృద్ధికి నిలయాలుగా మారుతున్నాయి. ఉదాహరణకు విజయవాడ నగరంలో జరుగుతున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ పనుల కారణంగా అనేక ప్రాంతాలు చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. ఈ కారణంగానే జ్వరాలొస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పారిశుధ్య వారోత్సవాలు మొక్కుబడిగా సాగుతున్నాయి అనడానికి డెంగీ కేసులే ఉదాహరణ. అలాగే, గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచి కోట్లాది రూపాయలు వస్తున్నా చిన్నచిన్న అవసరాలకు కూడా వాటిని వినియోగించుకోలేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనధికార ఆంక్షలు విధించిందని సర్పంచ్‌లు, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెంగీ లక్షణాలు – ఈడిస్ రకం దోమ కుట్టిన 24 గంటల్లో విపరీతమైన తలనొప్పి వస్తుంది – జ్వర తీవ్రత పెరిగేకొద్దీ కళ్లు ఎర్రగా మారుతూంటాయి – మర్నాడు కండరాల నొప్పి తీవ్రమవుతుంది – అనంతరం కీళ్ల నొప్పులు తీవ్రస్థాయిలో వస్తాయి – ఒళ్లంతా దద్దుర్లు మాదిరి మొదలై, అవి ఎర్రగా మారుతూ ఉంటాయి – ఏమీ తినాలనిపించదు. పైగా తీసుకున్నా వాంతులవుతాయి – జ్వర తీవ్ర ఎక్కువగా ఉంటే డెంగీ హీమరోజిక్ ఫీవర్ (డీహెచ్ఎఫ్) అంటారు. – ఇక చివరి దశ అంటే డెంగీ షాక్ సిండ్రోమ్ (డీఎస్ఎస్) అంటారు. చికిత్సకు మార్గదర్శకాలు – డెంగీ వచ్చిందని నిర్ధారించగానే రోగిని ప్రత్యేక వార్డులో ఉంచాలి – ఫిజీషియన్ సూచనల మేరకు మాత్రమే యాంటీబయోటిక్స్ ఇవ్వాలి – ప్రస్తుత పరిస్థితుల్లో యాంటీవైరల్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవి ఇవ్వచ్చు. – ముందుగా జ్వర తీవ్రతను తగ్గించేందుకు తరచూ పారాసెటిమాల్ ఇవ్వాలి – రోగికి నాలుగైదు రోజులపాటు పళ్లు, పళ్ల రసాలు మాత్రమే ఆహారంగా ఇవ్వాలి – రోగి పరిస్థితిని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి – రోగికి వీలైనంత ఎక్కువ మోతాదులో నీళ్లు తాగించాలి – నాలుగైదు రోజుల్లోనే జ్వరం నియంత్రణలోకి వస్తుంది. ఆ తర్వాత రోగిని డిశ్చార్జి చేయచ్చు – ముఖ్య విషయం.. దోమల నివారణకు ఇంటి పరిసరాల్లో ఎలాంటి కొబ్బరి చిప్పలు, టైర్లు, పాత బాటిళ్లు, కప్పులు వంటివి లేకుండా చూసుకోవాలి. ఉంటే.. వాటిల్లో నీళ్లు నిల్వ ఉండకుండా కూడా జాగ్రత్తపడాలి. లేదంటే వాటి ద్వారా దోమలు వృద్ధిచెందే ప్రమాదముంది. ప్లేట్లెట్ల సమస్య లేదు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే డెంగీ జ్వరాలు ఉన్నాయి. బోధనాసుపత్రుల్లో ఎక్కడా ప్లేట్‌లెట్స్‌కు సమస్య లేదు. అన్నిచోట్లా అందుబాటులో ఉన్నాయి. అయినా, అనుకున్నంతగా డెంగీ కేసులేమీ బోధనాసుపత్రులకు రావడంలేదు. వైద్యానికి సంబంధించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేవు. – డా. కె.బాబ్జీ, వైద్యవిద్యా సంచాలకులు -
రెండు వారాల్లో జర్నలిస్టులు, ఉద్యోగులకు హెల్త్ కార్డులు
తిరుమల: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రత ఉన్న మాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అంగీకరించారు. శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని వీఐపీ ప్రారంభ దర్శనంలో కామినేని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల విలేకర్లతో మాట్లాడుతూ... ఉభయ గోదావరి జిల్లాలు వరదలతో అతలాకుతలమైనాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో రెండు డెంగ్యూ జ్వరాలు కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. భారీ వర్షాలు, వరదలతో ఎక్కడ అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో జనరిక్ మందుల షాపును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులుకు రెండు మూడు వారాల్లో హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఆరోగ్య శ్రీ పేరును ఎన్టీఆర్ ఆరోగ్య సేవలుగా మారుస్తున్నట్లు తెలిపారు.