సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వారం రోజుల్లోనే (ఆగస్టు 23 నుంచి 29 వరకు) డెంగీ జ్వరాలు అకస్మాత్తుగా పెరిగాయి. ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలోనే ఇవి నమోదయ్యాయి. గత ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు వరకు మొత్తం 1,388 డెంగీ కేసులు నమోదు కాగా, అందులో ఆగస్టు 23–29 మధ్యలోనే 225 కేసులున్నాయి. ఇందులో ఒక్క విశాఖలోనే 87 కేసులు నమోదయ్యాయి. మలేరియా కేసుల్లోనూ అంతే. 48 కేసులు వారం రోజుల్లో నమోదైతే అందులో 36 కేసులు విశాఖపట్నం జిల్లాలో నమోదైనట్లు ఆరోగ్యశాఖ తాజా గణాంకాల్లో వెల్లడైంది. ఒక్కసారిగా కేసులు పెరగడంతో ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరోవైపు.. చికున్ గున్యా కేసులు కూడా ఈ ఏడాది ఇప్పటివరకూ 25 నమోదైనట్లు అధికారులు తెలిపారు.
దోమల సంతానోత్పత్తికి ఇవే కారణాలు..
ఎక్కడ నీళ్లు నిల్వ ఉంటే అక్కడ డెంగీ దోమలు సంతానోత్పత్తి చేస్తుంటాయి. ఉదా.. ఇంటి ఆవరణలో కొబ్బరి చిప్పలు, పాత నీళ్ల బాటిళ్లు, టైర్లు, పెంకులు ఇలా రకరకాల వస్తువుల్లో నీళ్లు నిల్వ ఉంటే లార్వా వృద్ధి చెందుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 4,887 ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉన్నట్లు అధికారులు ఇంటింటి సర్వేలో గుర్తించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 896 ఉన్నాయి. మరో 7,425 చోట్ల పాత టైర్లు ఉన్న ప్రాంతాలను, 6,992 కొబ్బరి చిప్పలున్న ప్రాంతాలను గుర్తించి వాటిని తొలగించారు.
మూడు శాఖల సమన్వయంతోనే కట్టడి
మునిసిపల్, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖ.. ఈ మూడు శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఈ జ్వరాల నియంత్రణ సాధ్యమవుతుంది. ఆరోగ్యశాఖ బృందాలు డెంగీ తీవ్రత ఉన్నచోట చర్యలు తీసుకుంటున్నాయి. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉంచుకోవద్దని చెబుతున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ అదుపులోనే ఉన్నాయి. త్వరలోనే విశాఖలో డెంగీని అదుపులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.
– డా. గీతాప్రసాదిని,ప్రజారోగ్య సంచాలకులు
డెంగీ లక్షణాలు..
► డెంగీ జ్వరం ఈడిస్ దోమ కుట్టడంవల్ల వస్తుంది.
► దోమ కుట్టిన 24 గంటల్లోనే విపరీతమైన తలనొప్పి వస్తుంది.
► జ్వర తీవ్రత పెరిగేకొద్దీ కళ్లు ఎర్రగా మారుతుంటాయి.
► మరుసటి రోజు కండరాల నొప్పి తీవ్రమవుతుంది.
► అనంతరం కీళ్ల నొప్పులు పెరుగుతాయి.
► శరీరమంతా దద్దుర్లు మొదలై, అవి ఎర్రగా మారతాయి.
► ఆహారం తినాలనిపించదు.. తీసుకున్నా వాంతులవుతాయి.
► డెంగీ హీమరోజిక్ ఫీవర్ (డీహెచ్‌ఎఫ్) అంటే ఎక్కువ తీవ్రత ఉన్నట్టు లెక్క.
► ఇక చివరి దశ అంటే డెంగీ షాక్ సిండ్రోమ్ (డీఎస్‌ఎస్) అంటారు.
చికిత్సకు మార్గదర్శకాలు..
► డెంగీ జ్వరాన్ని ఎలీశా టెస్టు ద్వారా నిర్ధారిస్తారు.
► ఫిజీషియన్ సూచనల మేరకు మాత్రమే యాంటీబయోటిక్స్ ఇవ్వాలి.
► తాజాగా యాంటీవైరల్ ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి.
► జ్వర తీవ్రతను తగ్గించేందుకు తరచూ పారాసెటిమాల్ ఇవ్వాలి.
► రోగికి పళ్లు, పళ్ల రసాలు మాత్రమే ఆహారంగా ఇవ్వాలి.
► పరిస్థితిని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి.
► రోగికి వీలైనంత ఎక్కువ మోతాదులో నీళ్లు తాగించాలి.
మరో 30 ఆస్పత్రుల్లో పరీక్షలు
రాష్ట్రంలో ఇప్పటివరకూ 24 ఆస్పత్రుల్లో మాత్రమే డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఇవి అందరికీ అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో మరో 30 ఆస్పత్రుల్లో చేస్తున్నారు. ప్రధానంగా మునిసిపల్, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల మధ్య సమన్వయం లోపించడంవల్లే కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 9,147 లోతట్టు ప్రాంతాలున్నట్లు గుర్తించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 8,042 ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 1,105 ఉన్నాయి. వర్షాల కారణంగా ఈ ప్రాంతాల్లో ఎక్కువ నీళ్లు నిలబడటంతో దోమల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment