దోమల డెంగీయాత్ర | Coordination disorder between three branches in dengue control | Sakshi
Sakshi News home page

దోమల డెంగీయాత్ర

Published Fri, Jun 29 2018 4:22 AM | Last Updated on Fri, Jun 29 2018 4:22 AM

Coordination disorder between three branches in dengue control - Sakshi

విజయవాడ వన్‌టౌన్‌ వద్ద కాలువలోకి చెత్తా చెదారం చేరడంతో రోడ్డు పైకి వస్తున్న మురుగునీరు

సాక్షి, అమరావతి: 
- గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన సంజీవరావు అనే వ్యక్తి ఈనెల 25న తీవ్ర జ్వరంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించారు. అక్కడ గంటలోపే పరీక్షలు చేసి డెంగీగా నిర్ధారించారు. మూడు రోజులపాటు ఇన్‌పేషెంటుగా ఉంచి రూ.45 వేలు వసూలు చేశారు. 
విశాఖపట్నం నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన లక్ష్మీదేవమ్మ జ్వరంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. డెంగీ సోకిందని, ప్లేట్‌లెట్స్‌ బాగా పడిపోయాయంటూ ఇన్‌పేషెంటుగా చేర్చారు. ప్లేట్‌లెట్స్‌ పేరుతో రెండ్రోజులు చికిత్స చేసి రూ.41వేలు బిల్లు వేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ వాసులను డెంగీ
జ్వరాలు వణికిస్తున్నాయనడానికి పైరెండు కేసులు చక్కటి ఉదాహరణలు. గత ఏడాది గ్రామీణ ప్రాం తాల్లో ఎక్కువగా ఇవి నమోదు కాగా ఈ ఏడాది పట్ట ణాలను భయకంపితులను చేస్తున్నాయి. తాజాగా గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ నగరపాలక సంస్థల పరిధిలో అత్యధిక డెంగీ కేసులు నమోదైనట్టు ప్రజారోగ్యశాఖ వెల్లడించింది. బాధితులు ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న కారణంగా ఇంకా ఆ కేసులు వెల్లడి కాలేదని, అవి కూడా కలుపుకుంటే కేసుల సంఖ్య భారీ స్థాయిలో ఉంటుందని ఆ శాఖకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు. డెంగీ నివారణకు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని అయినా నియంత్రణ కావడంలేదన్నారు. గతేడాది సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేసి ‘దోమలపై దండయాత్ర’ చేసినా అవి లొంగలేదని, ఈ ఏడాది మరిన్ని దోమకాటు జ్వరాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. 

బెంబేలెత్తిస్తున్న కేసులు 
గుంటూరు, విశాఖలోని నగర పాలక సంస్థల్లో డెంగీ జ్వరాలు నియంత్రణలోకి రావడంలేదని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గత ఏడాది గుంటూరు నగరంలో కేవలం 70 కేసులు మాత్రమే నమోదు కాగా.. గడిచిన రెండు మాసాల్లో 400 పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో గత నెల రోజుల్లో 550 డెంగీ కేసులు పైనే నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలోనూ తక్కువేమీ కాదు. గత కొంతకాలంగా ఒంగోలులోని రిమ్స్‌తో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రులకు డెంగీతో వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 400కు పైగా కేసులు నమోదైనట్టు వెల్లడైంది. నెల్లూరు, తిరుపతి, కడప, విజయవాడ, కర్నూలు నగరాల్లో సైతం అనేక డెంగీ కేసులు నమోదైనట్లు సమాచారం. కాగా, గడిచిన రెండు మాసాల్లోనే వివిధ మున్సిపాలిటీల పరిధిలో 3వేల డెంగీ కేసులు నమోదైనట్టు ప్రజారోగ్యశాఖ పరిశీలనలో తేలింది. 

ప్లేట్‌లెట్ల పేరిట దోపిడీ 
ప్రైవేటు ఆస్పత్రుల్లో, డయాగ్నిస్టిక్స్‌ సెంటర్లలో ప్లేట్‌లెట్స్‌ పేరిట భారీ దోపిడీ మొదలైంది. ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాలని.. లేదా పేషెంటు పరిస్థితి బాగోలేదంటూ రోగిని పిండేస్తున్నారు. జ్వరం లక్షణాలు పూర్తిగా తెలియకముందే ఇన్‌పేషెంటుగా చేర్చుకుని రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ బిల్లులు బాదేస్తున్నారు. వాస్తవానికి డెంగీ జ్వరం నిర్ధారించాలంటే రాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ఒక్కటే సరిపోదు. ఐజీజీ, ఐజీఎం, ఎలీశా టెస్టులు చేస్తేనే పూర్తిస్థాయిలో ఫలితం తేలుతుంది. ఇవన్నీ ఏమీ చేయకుండానే డెంగీ అని భయపెట్టి దోచుకుంటున్నారు.  

మూడు శాఖల మధ్య సమన్వయలోపం 
ఇదిలా ఉంటే..  పట్టణాల్లో ఎలాంటి కేసులు నమోదైనా దానికి ఆరోగ్యశాఖదే తప్పుగా చూపిస్తున్నారని, కానీ.. పురపాలక శాఖ ఈ విషయంలో తమకు సహకరించడంలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి కేసులు నమోదైనప్పుడు కేవలం ఆరోగ్యశాఖ మాత్రమే స్పందిస్తోందని, కనీస నివారణ, నియంత్రణ చర్యలకు మున్సిపల్‌ శాఖ ముందుకు రావడంలేదన్నది ఆరోగ్యశాఖ భావన. గ్రామీణాభివృద్ధి శాఖ కూడా తమతో కలిసి రావడంలేదని, మూడు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంవల్లే ఇలాంటి పరిస్థితి నెలకొని ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు.. మున్సిపాల్టీలు, గ్రామాల్లో పారిశుధ్యం దారుణంగా ఉంటోంది.

గిరిజన ప్రాంతాల్లో సరేసరి. వర్షం పడితే చాలు పట్టణాలు చెరువుల్లా మారిపోతున్నాయి. దీంతో నీటి నిల్వ కారణంగా డెంగీ జ్వరాలకు కారణమయ్యే ఈడిస్‌ దోమల వ్యాప్తి ఎక్కువవుతోంది. ప్రధానంగా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి నగరాల్లో అయితే సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే చాలు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లకు ఇరువైపులా రకరకాల పనులకు తవ్విన గోతుల్లో నీళ్లు నిల్వ ఉంటున్నాయి. దీంతో ఇవన్నీ దోమల వృద్ధికి నిలయాలుగా మారుతున్నాయి. ఉదాహరణకు విజయవాడ నగరంలో జరుగుతున్న స్ట్రామ్‌ వాటర్‌ డ్రెయిన్‌ పనుల కారణంగా అనేక ప్రాంతాలు చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. ఈ కారణంగానే జ్వరాలొస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పారిశుధ్య వారోత్సవాలు మొక్కుబడిగా సాగుతున్నాయి అనడానికి డెంగీ కేసులే ఉదాహరణ. అలాగే, గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచి కోట్లాది రూపాయలు వస్తున్నా చిన్నచిన్న అవసరాలకు కూడా వాటిని వినియోగించుకోలేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనధికార ఆంక్షలు విధించిందని సర్పంచ్‌లు, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

డెంగీ లక్షణాలు 
– ఈడిస్‌ రకం దోమ కుట్టిన 24 గంటల్లో విపరీతమైన తలనొప్పి వస్తుంది 
– జ్వర తీవ్రత పెరిగేకొద్దీ కళ్లు ఎర్రగా మారుతూంటాయి 
– మర్నాడు కండరాల నొప్పి తీవ్రమవుతుంది 
– అనంతరం కీళ్ల నొప్పులు తీవ్రస్థాయిలో వస్తాయి 
– ఒళ్లంతా దద్దుర్లు మాదిరి మొదలై, అవి ఎర్రగా మారుతూ ఉంటాయి 
– ఏమీ తినాలనిపించదు. పైగా తీసుకున్నా వాంతులవుతాయి 
– జ్వర తీవ్ర ఎక్కువగా ఉంటే డెంగీ హీమరోజిక్‌ ఫీవర్‌ (డీహెచ్‌ఎఫ్‌) అంటారు. 
– ఇక చివరి దశ అంటే డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ (డీఎస్‌ఎస్‌) అంటారు. 
 
చికిత్సకు మార్గదర్శకాలు 
– డెంగీ వచ్చిందని నిర్ధారించగానే రోగిని ప్రత్యేక వార్డులో ఉంచాలి 
– ఫిజీషియన్‌ సూచనల మేరకు మాత్రమే యాంటీబయోటిక్స్‌ ఇవ్వాలి 
– ప్రస్తుత పరిస్థితుల్లో యాంటీవైరల్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవి ఇవ్వచ్చు. 
– ముందుగా జ్వర తీవ్రతను తగ్గించేందుకు తరచూ పారాసెటిమాల్‌ ఇవ్వాలి 
– రోగికి నాలుగైదు రోజులపాటు పళ్లు, పళ్ల రసాలు మాత్రమే ఆహారంగా ఇవ్వాలి 
– రోగి పరిస్థితిని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించాలి 
– రోగికి వీలైనంత ఎక్కువ మోతాదులో నీళ్లు తాగించాలి 
– నాలుగైదు రోజుల్లోనే జ్వరం నియంత్రణలోకి వస్తుంది. ఆ తర్వాత రోగిని డిశ్చార్జి చేయచ్చు 
– ముఖ్య విషయం.. దోమల నివారణకు ఇంటి పరిసరాల్లో ఎలాంటి కొబ్బరి చిప్పలు, టైర్లు, పాత బాటిళ్లు, కప్పులు వంటివి లేకుండా చూసుకోవాలి. ఉంటే.. వాటిల్లో నీళ్లు నిల్వ ఉండకుండా కూడా జాగ్రత్తపడాలి. లేదంటే వాటి ద్వారా దోమలు వృద్ధిచెందే ప్రమాదముంది.  

ప్లేట్‌లెట్ల సమస్య లేదు 
కొన్ని ప్రాంతాల్లో మాత్రమే డెంగీ జ్వరాలు ఉన్నాయి. బోధనాసుపత్రుల్లో ఎక్కడా ప్లేట్‌లెట్స్‌కు సమస్య లేదు. అన్నిచోట్లా అందుబాటులో ఉన్నాయి. అయినా, అనుకున్నంతగా డెంగీ కేసులేమీ బోధనాసుపత్రులకు రావడంలేదు. వైద్యానికి సంబంధించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేవు. 
– డా. కె.బాబ్జీ, వైద్యవిద్యా సంచాలకులు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement