వామ్మో... స్వైన్‌ఫ్లూ | Six Swine flu disease cases in the district | Sakshi
Sakshi News home page

వామ్మో... స్వైన్‌ఫ్లూ

Published Sat, Mar 11 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM

వామ్మో... స్వైన్‌ఫ్లూ

వామ్మో... స్వైన్‌ఫ్లూ

నెల్లూరు(అర్బన్‌) : జిల్లాలో స్వైన్‌ ఫ్లూ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. నెల రోజుల క్రితమే జిల్లాలో తొలిసారిగా ఆరు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కావలి పట్టణానికి చెందిన మున్సిపల్‌ శాఖలో పనిచేసే ఒక వ్యక్తి మరణించాడు. వైద్య  శాఖాధికారులు సరిగా స్పందించకపోవడంతో చాపకింద నీరులా జిల్లా అంతటా మళ్లీ స్వైన్‌ఫ్లూ కేసులు విస్తరిస్తున్నాయి. శుక్రవారం మనుబోలు మండలంలో ఒక మహిళ స్వైన్‌ఫ్లూతో మరణించడంతో కలకలం రేగుతోంది. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

జిల్లాలో స్వైన్‌ ఫ్లూ కేసులు విస్తరిస్తున్నప్పటికీ వాటి నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. స్వైన్‌ ఫ్లూ కేసు సోకినట్టు తెలిస్తే అప్పటికప్పుడు అక్కడ హడావుడి చేయడం, తరువాత మిన్నకుండిపోవడంతో రోగులు పెరుగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలోకి పోతున్నారు. స్వైన్‌ఫ్లూ బూచి చూపి వైద్యం పేరిట  ప్రైవేటు ఆస్పత్రులు లక్షలకులక్షలు దోచుకుంటున్నాయి. రోగి బతికినా అప్పులపాలవుతున్నాడు.

గుర్తించింది నాలుగు కేసులేనట!
స్వైన్‌ఫ్లూ జిల్లాలో నలుగురికి మాత్రమే వచ్చినట్టు వైద్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం..పదహారు మందిని లక్షణాలు బట్టి గుర్తించినప్పటికీ వారిలో నలుగురికే పరీక్షలో పాజిటివ్‌ వచ్చిందని జిల్లావైద్యశాఖాధికారులు పేర్కొంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా పాజిటివ్‌ వచ్చిన ఆరు మందిని తాము గుర్తించడం లేదన్నారు. కాగా, తిరుపతిలో ఉండే ప్రభుత్వ లాబోరేటరీలో మాత్రమే పరీక్ష చేయించి పాజిటివ్‌ వస్తేనే గుర్తిస్తామనడం అన్యాయమని పలువురు పేర్కొంటున్నారు. కాగా, ఇటీవల తరచూ ఏదో ఒక ప్రాంతంలో స్వైన్‌ఫ్లూ కేసులు సోకుతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. పెద్దాస్పత్రిలో మాత్రం స్వైన్‌ఫ్లూకి 8 బెడ్‌లతో ఒక వార్డును ఏర్పాటు చేశారు. అయితే అందులో ఒక్క కేసు కూడా చేరలేదు.

కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే...
► తడ  మండలం పూడిì  గ్రామంలో ఇద్దరు చిన్నారులకు స్వైన్‌ ఫ్లూ సోకగా చెన్నైలోని విజయా హాస్పిటల్‌ నందు చికిత్స తీసుకున్నారు.
► పెళ్లకూరు మండలానికి చెందిన ఒక డాక్టర్‌కి స్వైన్‌ఫ్లూ సోకగా రాయవేలూరు సిఎంసీలో చికిత్స పొందారు.
► వెంకటాచలం మండలానికి చెందిన మహిళకు స్వైన్‌ఫ్లూ సోకగా నెల్లూరులో చికిత్సపొందారు.
► 10 రోజుల క్రితం సైదాపురం మండలానికి చెందిన బాలుడికి స్వైన్‌ ఫ్లూ సోకగా నెల్లూరు నగరంలోని సిద్ధార్థ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు.
► పడుగుపాడుకి చెందిన ఓ వ్యక్తి స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో నెల్లూరులోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది మరణించాడని తెలుస్తోంది.
► కృష్ణపట్నం పోర్టులో అసిస్టెంట్‌ కుక్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో నగరంలోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది నాలుగు రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యారు.
► కావలి పట్టణానికి చెందిన ఒక మహిళ గుంటూరులో చికిత్స పొందుతోంది.
తేడా వస్తే మరణమే..
స్వైన్‌ఫ్లూపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మరణం సంభవిస్తుంది. విపరీతమైన జలుబు, జ్వరం, తలనొప్పి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. పందుల నుంచి నేరుగా మనుషులకు, స్వైన్‌ఫ్లూ సోకినవారి నుంచి ఇతరులకు ఈ వ్యాధి సులభంగా వ్యాపిస్తోంది. గాలి ప్రధాన వాహకం. అందువల్ల ప్రజలు మాస్క్‌ ధరించాలి. తుమ్మేటప్పుడు పక్కకు తిరిగి కర్చీఫ్‌ అడ్డుపెట్టుకుని తుమ్మాలి. నలుగురు కలిసే చోట ఉండకూడదు. శుద్ధమైన నీరు, శుభ్రమైన పరిసరాలతో వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.

అప్రమత్తంగా ఉన్నాం
స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రబలకుండా తగిన ఏర్పాట్లు చేశాం. మా టీంను అప్రమత్తం చేశాం. జిల్లా మొత్తం సర్వేచేయించాం. తిరుపతిలో పాజిటివ్‌ వస్తేనే స్వైన్‌ఫ్లూగా గుర్తిస్తాం. అలా నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. మనుబోలుకు వెళ్లి వచ్చాను. అక్కడ స్వైన్‌ఫ్లూ కేసు నమోదైనట్టు మా దృష్టికి రాలేదు. అయినా విచారణ జరిపిస్తాం.
– డా.వరసుందరం, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement