రెండు వారాల్లో జర్నలిస్టులు, ఉద్యోగులకు హెల్త్ కార్డులు
తిరుమల: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రత ఉన్న మాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అంగీకరించారు. శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని వీఐపీ ప్రారంభ దర్శనంలో కామినేని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల విలేకర్లతో మాట్లాడుతూ... ఉభయ గోదావరి జిల్లాలు వరదలతో అతలాకుతలమైనాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో రెండు డెంగ్యూ జ్వరాలు కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.
భారీ వర్షాలు, వరదలతో ఎక్కడ అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో జనరిక్ మందుల షాపును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులుకు రెండు మూడు వారాల్లో హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఆరోగ్య శ్రీ పేరును ఎన్టీఆర్ ఆరోగ్య సేవలుగా మారుస్తున్నట్లు తెలిపారు.