అదితి మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి
విశాఖపట్నం: డ్రైనేజిలో పడి ప్రాణాలు కోల్పోయిన అదితి మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయింది. ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. డీఎన్ఏ పరీక్ష అవసరం లేదని పోలీసులు తేల్చిచెప్పారు. వాళ్లు కోరితే మాత్రం డీఎన్ఏ పరీక్ష చేస్తామని కేజీహెచ్ ఇంఛార్జ్ ఉదయ్ కుమార్ అంతకుముందు చెప్పారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ అదితి పోస్టుమార్టంపై సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం కేజీహెచ్ ఇంఛార్జ్తో మాట్లాడారు. పోస్టుమార్టం త్వరగా పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించాలని ఆదేశించారు.
డ్రైనేజిలో పడిపోయిన అదితి ఎలాగైనా సజీవంగా తిరిగిరావాలని అందరూ కోరుకున్నారు. ఆమె ఆచూకీ కోసం జీవీఎంసీ, పోలీసు, నేవీ సిబ్బంది ఎనిమిది రోజులపాటు అహరహం గాలించారు. కానీ, ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయిన ప్రాంతం నుంచి 40 కి.మీ. దూరంలో అదితి మృతదేహం కనిపించింది. అల్పపీడనం ప్రభావంతో ఈశాన్యగాలులు బలంగా వీయడం వల్ల పాప శరీరం భోగాపురం తీరం వరకూ నీటిలో కొట్టుకుపోయి ఉంటుందని నిపుణులు చెప్పారు.