మెరుగైన వైద్యమే లక్ష్యం
అనంతపురం : ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లా ప్రజలకు బెంగళూరులోనూ వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ైవె ద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ, వైద్య సేవల గురించి తెలుసుకునేందుకు గురువారం ఆయన జిల్లాలో పర్యటించారు. ఉదయం బెంగళూరు నుంచి పెనుకొండకు చేరుకున్న మంత్రికి బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, బీజేవైఎం రాష్ర్ట నేత విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథితో కలిసి 44వ నంబరు జాతీయ రహదారి పక్కనున్న శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి పూల మాల వేశారు. తర్వాత రాష్ర్ట ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత , రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ రాజీవ్‌శర్మతో కలిసి పెనుకొండ సర్వజనాస్పత్రి, చెన్నేకొత్తపల్లి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అనంతపురం సర్వజనాస్పత్రులను తనిఖీ చేశారు.
అంతకు ముందు హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో సంజీవిని జనరిక్ మందుల దుకాణాన్ని, ఆధునికీకరించిన అత్యవసర సేవల విభాగాన్ని మంత్రి పల్లె, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి కామినేని మాట్లాడుతూ ‘రాష్ర్ట విభజనతో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖకు తీరని అన్యాయం జరిగింది.ముఖ్యమైన ఆస్పత్రులన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. తొలుత నాలుగు జిల్లాల్లో నిర్మిస్తాం’అని చెప్పారు. అనంతపురంలో రూ.150 కోట్లతో ఏర్పాటు చేయనున్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి కేంద్రం రూ.120 కోట్లు, రాష్ర్ట ప్రభుత్వం రూ.30 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు.
విభజన వల్ల హైదరాబాద్‌తో సంబంధాలు తగ్గనున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన రోగులకు బెంగళూరులో అత్యుత్తమ వైద్యం అందిస్తామని చెప్పారు. చెన్నేకొత్తపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) శిథిలావస్థలో ఉన్నందున అక్కడ నూతన భవనంతోపాటు సిబ్బంది క్వార్టర్‌స ఏర్పాటుకు రూ.7 కోట్లు మంజూరు చేస్తామన్నారు. పెనుకొండ ప్రభుత్వాస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్, సీమాంక్ భవనాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. హిందూపురం జిల్లా ఆస్పత్రి స్థాయిని వంద పడకల నుంచి 350 పడకలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, పెనుకొండ ఆర్డీఓ ఎగ్గిడి వెంకటేశ్ పాల్గొన్నారు.
ఐటీ, ఎడ్యుకేషన్ హబ్, పారిశ్రామిక కారిడర్‌గా ‘పురం’
‘అనంతపురం తర్వాత అత్యంత జనసాంద్రత కల్గిన ప్రాంతం హిందూపురం. బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడికి దగ్గరలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఐటీ, ఎడ్యుకేషన్ హబ్, పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామ’ని మంత్రి కామినేని తెలిపారు. రాష్ట్రంలో సెప్టెంబరు నుంచి విద్యుత్ కోతలకు తావుండదన్నారు. 24 గంటలు కరెంటు సరఫరా ఉంటుందన్నారు.