సదస్సులో మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్/ సుందరయ్య విజ్ఞానకేంద్రం: ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మొదటి ఏఎన్‌ఎం ఖాళీ పోస్టుల భర్తీకి నెలారెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రెండో ఏఎన్‌ఎం మహాసభల్లో మంత్రి మాట్లాడారు. అన్ని ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, రాబోయే రోజుల్లో కీమో, రెడియో థెరపీ కూడా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ప్రాథమిక వైద్యం అందించడంలో ఏఎన్‌ఎంలది కీలక పాత్ర అని కొనియాడారు. బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నట్లు చాలా మందికి తెలియదని, అలాంటివారిని గుర్తించి ముందుగా చికిత్స అందిస్తే దీర్ఘకాలిక రోగాలు రావని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు మంచి వైద్యసేవలు అందుతున్నాయని, ఫలితంగా గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లో ఓపీ తగ్గిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 500 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏఎన్‌ఎం సెంటర్లను పల్లె దవాఖానాలుగా ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో 2 వేల పల్లె దవాఖానాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు
2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరగగా, ఇప్పుడు అవి 67 శాతానికి పెరిగాయని మంత్రి హరీశ్ తెలిపారు. వైద్యసేవల్లో దేశంలోనే తెలంగాణ మూడోస్థానం దక్కించుకుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు చివరి స్థానంలో ఉందని, డబుల్ ఇంజిన్ ట్రబుల్ ఇంజినే తప్ప దాని వల్ల పేదలకు ఎలాంటి లాభం లేదని ఎద్దేవా చేశారు. రెండు, మూడు రోజుల్లో 58 టిఫా ప్రారంభం అవుతుందని తెలిపారు. జనవరి వరకు అన్ని జిల్లాల్లో టి–డయాగ్నొస్టిక్ కేంద్రాల ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఏఎన్‌ఎం పరిధిలో వందశాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేటట్టు చూడాలన్నారు. మొదటి ఏఎన్‌ఎం పోస్టుల ఖాళీల భర్తీలో కరోనా తర్వాత వెయిటేజీ ఇస్తున్నామని, ఏడాదికి 2 మార్కుల చొప్పున కలుపుతున్నామని చెప్పారు. టీవీవీపీలో 228 ఉద్యోగాలు ఇస్తే, 200 పోస్టులు ఏఎన్‌ఎంలకే వచ్చాయన్నారు. పూర్తిస్థాయిలో వయో పరిమితి సడలింపు ఇచ్చామని హరీశ్ తెలిపారు.
ఇదీ చదవండి: ఎల్‌ఆర్‌ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ
Comments
Please login to add a commentAdd a comment