గుంటూరు : గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి... పసికందు మృతి చెందడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులైన నలుగురు వైద్యులను సస్పెండ్ చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు రూరల్ మండల పరిధిలోని దాసరిపాలెంకి చెందిన జగన్నాథం నాగబాబు ఆటోడ్రైవర్. అతని భార్య భవానికి పురుటి నొప్పులు రావడంతో మంగళవారం ఉదయం జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. వైద్యులు సాధారణ కాన్పు చేయగా ఉదయం 7.20 గంటలకు మగబిడ్డ పుట్టాడు.
అరగంట తర్వాత బిడ్డ చనిపోయాడంటూ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అంతేకాకుండా డెత్ సర్టిఫికేట్తో సహా వారి చేతిలో పెట్టారు. దీంతో వారు కన్నీరుమున్నీరు అవుతూ బిడ్డ మృతదేహాన్ని తీసుకుని... ఆటోలో ఇంటికి పయనమైయ్యారు. ఇంతలో పసికందులో కదలిక వచ్చింది. ఆ విషయాన్ని గుర్తించి... మళ్లీ ఆసుపత్రికి తీసుకుచ్చారు.
దీంతో నాలుక్కరుచుకున్న వైద్యులు హడావుడిగా శిశువును ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు.అయితే ఆ పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని పసికందు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.