పడకేసిన పలివెల | viral fevers spreading due to unsanitary | Sakshi
Sakshi News home page

పడకేసిన పలివెల

Published Mon, Dec 2 2013 3:07 AM | Last Updated on Fri, Mar 22 2019 7:19 PM

viral fevers spreading due to unsanitary

కొత్తపేట, న్యూస్‌లైన్ : అపరిశుభ్రత కారణంగా మండలంలోని పలివెలలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధాన గ్రామంతో పాటు శివారు ప్రాంతాల్లో సుమారు 50 మంది విషజ్వరాలతో మంచం పట్టారు. పలివెల, శేరేపాలెం, పెదపేట, చిన్నపేట, దేవాలయం వీధి, గుబ్బల వారిపాలెం, సత్యానందరావు కాలనీ తదితర ప్రాంతాల్లో మూడు వారాలుగా జ్వరంతో బాధపడుతున్న బాధితులు స్థానిక ప్రైవేట్ వైద్యుల వద్ద చికిత్స పొందారు. జ్వరం తగ్గకపోవడంతో కొత్తపేట, రావులపాలెం, రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించారు. నెల రోజుల క్రితం సుమారు 20 మంది విష  జ్వరాల బారిన పడగా, కొందరికి ప్లేట్‌లెట్ల కౌంట్ తగ్గడంతో, రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో  చికిత్స పొందిన విషయం తెలిసిందే.
 తగ్గిన ప్లేట్‌లెట్ల సంఖ్య
 తాజాగా మర్గాన గంగాధరరావు విష జ్వరం బారిన పడగా, అతడి ప్లేట్‌లెట్ల కౌంట్ 26 వేలకు పడిపోయింది. దీంతో అతడు రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాగే పిడపర్తి రవి, తులా శ్రీనివాస్, అతడి భార్య రామతులసి విష జ్వరంతో బాధపడుతున్నారు. వీరికి 30 వేల నుంచి 20 వేలకు మధ్య ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయింది. రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది, తిరిగొచ్చారు. అలాగే తులా రాంబాబుకు ప్లేట్‌లెట్ల సంఖ్య 15 వేలకు తగ్గడంతో శుక్రవారం రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు. ముసిని లక్ష్మి , భమిడిపాటి దుర్గా లక్ష్మీనారాయణ, సిద్దా నాగమణి, సిద్దా లక్ష్మణరావు , సిద్దా శ్రీను కూడా విషజ్వరాల బారినపడి, రాజమండ్రిలో చికిత్స పొంది, కోలుకుంటున్నారు. గొలకోటి కనకలక్ష్మి, మల్లవరపు పోలమ్మ 10 రోజులుగా జ్వరం బారినపడి, స్థానికంగా చికిత్స పొందుతున్నారు. అలాగే మల్లవరపు సత్యనారాయణ, వెంకటేష్, సత్యానందం సుమారు 10 రోజులుగా రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెండ్యాల భాస్కరరావు అనే వృద్ధుడు విష జ్వరంతో మంచానపడ్డాడు.
 దాదాపు ప్రతి ఇంటా..
 వివిధ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఇంటికి ఒకరిద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామాల్లో అపరిశుభ్రత వల్ల దోమలు విపరీతంగా పెరిగి విష జ్వరాలకు కారణమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి విష జ్వరాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు వ్యాధులతో అల్లాడుతుంటే పీహెచ్‌సీ అధికారులు ఆయా గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. దీనిపై అవిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎస్. ఛాయాప్రసన్నను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, గ్రామంలో కొందరు వైరల్ జ్వరాలతో బాధపడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వైద్య సిబ్బందితో రక్త నమూనాలు సేకరించి, మందులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కొంతమందికి చికిత్స చేయగా, మరికొందరు రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement