పేరిపి(చీపురుపల్లి రూరల్), న్యూస్‌లైన్: మండలంలోని పేరిపి గ్రామాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. వారం రోజులుగా జ్వరపీడితులు మంచాలపై మూలుగుతున్నా రు. గ్రామంలో సుమారు 600 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలకు చెందిన 50 మంది వరకూ జ్వరాలతో బాధపడుతున్నారు. ఒకేఇంట్లో కొత్తవలస లక్ష్మునాయుడు, చిన్నమ్మలు, అయ్యప్ప, లక్ష్మి, గ్రామానికి చెందిన యలకల తవుడు, కోట్ల ఈశ్వరమ్మ, మోపాడ మహేష్, మోపాడ అప్పమ్మ, మోపాడ సన్యాసమ్మ, యలకల దాలినాయుడు తదితరులు జ్వరంతో బాధ పడుతున్నారు. అదేవిధంగా గ్రామానికి చెందిన మోపాడ ఉపేంద్ర అనే విద్యార్థికి డయేరియా సోకిందని, ప్రస్తుతం చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. జ్వరపీడితులను ఆస్పత్రులకు తరలించామని, రక్తపరీక్షల్లో మలేరియా ఉన్నట్లు తేలిందని చెప్పారు. మరోవైపు ఆర్థిక స్తోమత చాలక చాలామంది ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారు. కర్లాం పీహెచ్‌సీకి చెందిన ఏఎన్‌ఎం మంగళవారం గ్రామంలోకి వచ్చి మందులు ఇచ్చి వెళ్లారే తప్ప, కనీసం పరీక్షలు జరపలేదని పలువురు జ్వరపీడితులు వాపోయారు. ఇదే విషయమై సీహెచ్‌ఎన్‌సీ, ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ నీలకంఠేశ్వరరావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా.. బుధవారం గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి, రోగులను పరీక్షిస్తామని చెప్పారు.