మంచంపట్టిన ఏజెన్సీ | Viral Fevers In West Godavati Agency Area | Sakshi
Sakshi News home page

మంచంపట్టిన ఏజెన్సీ

Published Sat, Sep 1 2018 6:21 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

Viral Fevers In West Godavati Agency Area - Sakshi

మూడు రోజులుగా టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడుతున్న తుష్టి వెంకటలక్ష్మి, తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతూ వైద్యం పొందుతున్న బుట్టాయగూడెంకు చెందిన టి.ఉమామహేశ్వరి

పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో వ్యాధులు ముసురుకున్నాయి. గత 2 నెలలుగా అధిక వర్షాలు కురవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఎక్కడికక్కడ మురుగునీరు గుంటల్లో దర్శనమిస్తున్నాయి. దీంతో దోమలు పెరిగి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గ్రామాల్లో తాగునీరు వనరుల్లో క్లోరినేషన్‌ పనులు నామమాత్రంగానే ఉండడంతో ప్రజలు మలేరియా, టైఫాయిడ్, డయేరియా, కామర్లు వంటి వ్యాధులతో బాధపడుతూ మంచాన పడుతున్నారు. టైఫాయిడ్, మలేరియా, కామర్లు, డయేరియాతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా తలపోటు, దగ్గు, జలుబు బాధపడేవారి సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఏజెన్సీలోని 5 మండలాల్లోని 14 పీహెచ్‌సీలు జ్వరపీడితులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. అలాగే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా వ్యాధులబారిన పడ్డవారు క్యూ కడుతున్నారు. గ్రామాల్లో మురికినీరు కాల్వల్లో చెత్తాచెదారం నిండి దుర్గంధం వెదజల్లుతుంది. దోమల బెడద ఎక్కువగా ఉండడంతో రాత్రిపూట ప్రజలు కంటిమీద కునుకుకూడా తీయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి విడత గ్రామాల్లో స్ప్రేయింగ్‌ పనులు చేశామని చెబుతున్న అధికారులు రెండో విడతలో కొన్ని గ్రామాల్లోనే పనులు చేసి చేతులు దులుపుకున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

ఏడాదిలో 45 వేల మంది జ్వరపీడితులు
ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో 14 ప్రభుత్వాసుపత్రులు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది సుమారు 45 వేల మందికి పైగా జ్వరపీడితులు నమోదయ్యారు. అదేవిధంగా 181 మలేరియా, 270 కామెర్లు, 5 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది ప్రభుత్వ వైద్యాధికారులు వెల్లడిస్తున్నవి. అయితే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా అనేకమంది జ్వరపీడితులు నమోదయ్యారు. ఆ ప్రకారం బాధితులు రెండురెట్లు ఉంటారని అంటున్నారు. ఈ ప్రాంతంలో 262 మలేరియా సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. వాటిలో తొలివిడత స్ప్రేయింగ్‌ పనులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రెండో విడత ఇప్పటివరకూ 120 గ్రామాల్లో స్ప్రేయింగ్‌ పనులు చేస్తున్నామని చెప్పారు. మిగిలిన గ్రామాల్లో వర్షాల కారణంగా స్ప్రేయింగ్‌ పనులు ఆలస్యమైనట్టు వైద్య శాఖ సిబ్బంది తెలిపారు. అయితే గ్రామాల్లో మాత్రం పారిశుద్ధ్యలోపం వల్ల దోమలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వ్యాధులతో బాధపడేవారికి మెరుగైన వైద్యసేవలకు ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని ఏజెన్సీ ప్రాంతవాసులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement