అగమ్య గోచరం భోజన పథకం | Food Agency Corruption In Midday Meals Scheme West Godavari | Sakshi
Sakshi News home page

అగమ్య గోచరం భోజన పథకం

Published Fri, Sep 7 2018 1:23 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

Food Agency Corruption In Midday Meals Scheme West Godavari - Sakshi

నిడదవోలులో హైస్కూల్‌లో వండిన భోజనాన్ని రిక్షాలో తీసుకెళుతున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలు, విద్యార్థినులకు భోజనం వడ్డిస్తున్న అధ్యాపకులు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల కోసం రాష్ట్రప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టినమధ్యాహ్న భోజన పథకం నిర్వహణను బాలారిష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. జిల్లాలోని 33 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని 7,361 మంది విద్యార్థులకు ప్రభుత్వం భోజనం అందించేందుకు నిర్ణయించింది.  ఆశయం మంచిదే అయినా ప«థకం నిర్వహణ తీరు అగమ్యగోచరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.

పశ్చిమగోదావరి, నిడదవోలు: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి 996 క్యాలరీలు, 27.85 గ్రాముల ప్రొటీన్లతో కూడిన ఆహారాన్ని మధ్యాహ్నం అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. కళాశాలల సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల మధ్నాహ్న భోజన పథకం వంట ఏజెన్సీల నిర్వాహకులు వండి పెట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇంటర్‌ విద్యార్థులకు కూడా అక్కడే వండి కళాశాలలకు అందించాలని సూచించింది. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పెడుతున్న మెనూ ప్రకారం రోజుకు రూ.6.18 చొప్ను మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఇస్తున్నారు. జూనియర్‌ కళాశాల విద్యార్థికి కూడా హైస్కూల్‌ విద్యార్ధికి కేటాయించిన 150 గ్రాముల బియ్యాన్ని మాత్రమే కేటాయించడంతో భోజనం సరిపోవడం లేదని ఆ విద్యార్థులు వాపోతున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు కూడా పిల్లలకు పావు కేజి బియ్యాన్ని అందించాలని కోరుతున్నారు.  ఇంటర్‌ విద్యార్థులకు ఎంత కూటాయించాలలో విధి విదానాలు ఇప్పటి వరకు అధికారులకు అందలేదు. మరో వైపు కళాశాలల ప్రిన్సిపాల్స్‌ రోజూ విద్యార్థుల హాజరు వివరాలను భోజనం వచ్చే స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడికి అందించాలి.  హెచ్‌ఎం భాద్యత వహించి రుచిగా, వేడిగా వంటకాలు ఉండేట్లు జాగ్రత్త వహించి కళాశాలలకు చేరవేయించాలి.

క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల్లో రోజుకు సుమారు 300 నుంచి 400 మందికి వంట చేస్తున్నారు. జూనియర్‌ కళాశాలలకు కూడా పాఠశాలల్లో వండించడం భారంగా ఉందని హెచ్‌ఎంలు వాపోతున్నారు.  సరైన గదులు, వంట పాత్రలు లేకపోవడం, గ్యాస్, వంట సరకులు కొనుగోలుకు పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని వంట ఏజెన్సీలు హెచ్‌ఎంలపై ఒత్తిడి తెస్తున్నాయి. సకాలంలో బిల్లులు అందక కిరాణా షాపుల్లో అప్పులు చేసి పథకాన్ని నిర్వహించడంవల్ల తమకు నష్టమే కానీ ఎటువంటి లాభదాయకం కాదని నిర్వాహకులు చెబుతున్నారు. ఉన్నత పాఠశాలల్లో రోజుకు 400 మందికి భోజన విరామ సమయానికి వండి పెట్టడం తలకు మించిన భారంగా మారిందని, కళాశాల విద్యార్థులతో కలుపుకుని రోజుకు 500 నుంచి 600 మందికి వండి పెట్టడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భోజనం తరలించడంలో జాప్యం
ఇంటర్‌ విద్యార్థులకు ఆగస్టు నుండి మధ్యాహ్న భోజన వసతి కల్పించారు. కనీసం వంట సామాన్లు, పెట్టుబడులు ఇవ్వక పోవడంతో నిర్వాహకులు వండటానికి ససేమిరా అంటున్నారు. ఇ ది ఎన్నికల హంగామా అని పలువురు విమర్శిస్తున్నారు. హైస్కూల్‌లో వండి కళాశాలకు చేర్చేం దుకు అవస్థలు పడుతున్నారు. కొన్ని కళాశాలలకు దగ్గరలోనే హైస్కూల్స్‌ ఉన్నా, మరి కొన్ని కళాశాలకు హైస్కూల్స్‌ రెండు కిలోమీటర్ల దూరం ఉండటంతో వండిన భోజనాలు కళాశాలలకు చేర్చడానికి మధ్యాహ్నం 2 గంటలు అవుతోంది. అప్పటి వరకు విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. భోజనాలు వడ్డించడానికి సిబ్బంది లేకపోవడంతో పలు కళాశాలల్లో అధ్యాపకులే వడ్డిస్తున్నారు.

కళాశాలలకు ఏజెన్సీలు నియమించాలి
జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్నాహ భోజన పథకం వంట చేయడానికి ఏజెన్సీలను నియమించాలి. అన్ని కళాశాలకు పూ ర్తిస్థాయి ప్రిన్సిపాల్స్‌ను నియమించాలి. బయో మెట్రిక్‌ అమలు బాధ్యత చూసే ప్రిన్సిపాల్స్‌ ఈ పథకం నిర్వహణ బాధ్యత చూస్తే అవకతవకలకు అవకాశం ఉండదు. ఖాలీగా ఉన్న ప్రిన్సిపాల్స్‌ పోస్టులు భర్తీచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మరో పక్క బయోమెట్రిక్‌ అమలు చేయకపోతే భోజన పథకంలో అవకతవకలు జరిగే అవకాశం ఉంది.

అరకొర జీతాలు ఏ మూలకు..
ప్రభుత్వం మధ్యాహ్నం భోజన పథకంలో పనిచేస్తున్న మహిళలకు నెలకు రూ.1000 మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారు. నాలుగేళ్ల నుంచి జీతాలు పెంచుతారనే ఆశతో ఉన్నాం. అంగన్‌వాడీ సిబ్బందికి జీతాలు పెంచారు. మండు వేసవిలో వేడిని తట్టుకుని వంట చేస్తున్నాం. కళ్లు మండిపోయి కంటి చూపు కూడ దెబ్బతింటోంది. నెలకు కనీసం రూ.3,000 అయినా ప్రభుత్వం ఇవ్వాలి .
– మానే అమలేశ్వరి,ఏజన్సీ నిర్వహకురాలు, నిడదవోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement