midday meal scheme
-
వేసవి సెలవుల్లోనూ ‘మధ్యాహ్న భోజనం’
న్యూఢిల్లీ: వేసవి సెలవుల్లో కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ మంగళవారం స్పష్టం చేశారు. అందుకు రూ.2,600 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీబీఎస్ఈ 10, 12 తరగతుల విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యాహ్న భోజనంతో 11.34 లక్షల పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న 11.5 కోట్ల మంది చిన్నారులు ప్రయోజనం పొందుతారని తెలిపారు. -
ఇంటివద్దే ‘జగనన్న గోరుముద్ద’
అనంతపురం విద్య: కోవిడ్ –19 కలకలంతో మార్చి నెలాఖరు వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నేరుగా ఇళ్లవద్దే ‘జగనన్న గోరుముద్ద’ కింద మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. బియ్యం, చిక్కీ, కోడిగుడ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వలంటీర్ల ద్వారా 31వ తేదీ వరకూ విద్యార్థులకు ఇళ్ల వద్దకే పంపిణీ చేయనున్నారు. -
విద్యార్థులకు అస్వస్థత
చింతూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 45 మంది విద్యార్థులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించడంతో వారంతా ప్రస్తుతం కోలుకుంటున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం కొంతమంది విద్యార్థులకు ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురవడంతో చికిత్స అందించారు. తూర్పుగోదావరి, చింతూరు: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 45 మంది విద్యార్థులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించడంతో వారంతా ప్రస్తుతం కోలుకుంటున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 360 మంది విద్యార్థులుండగా ఉదయం విద్యార్థులతో ఐరన్(ఫెర్రస్ సల్ఫేట్ అండ్ ఫోలిక్ యాసిడ్) మాత్రలు మింగించారు. అనంతరం కిచిడీ, గుడ్డు, టమాటా పచ్చడితో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్నారు. కాగా మూడు గంటల సమయంలో కొంతమంది విద్యార్థులకు ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురవడంతో వారిని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అక్కడ అందుబాటులో ఉన్న వైద్యులు వారికి చికిత్స ప్రారంభించారు. త్వరితగతిన చర్యలు చేపట్టిన పీవో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. వెంటనే డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పద్మజతో పాటు సమీప పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉన్న వైద్యులను అక్కడికి రప్పించి విద్యార్థులకు త్వరితగతిన వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ వైద్యులతో పాటు స్థానిక ప్రైవేటు వైద్యులు కూడా విద్యార్థులకు వైద్యం అందించేందుకు సాయపడ్డారు. ఈ సందర్భంగా పీవో వెంకటరమణ ప్రతి వార్డుకు వెళ్లి విద్యార్థులకు ధైర్యం చెబుతూ ఆందోళన చెందవద్దంటూ భరోసా కల్పించారు. దీంతో సాయంత్రానికి విద్యార్థులంతా క్రమంగా కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా తమ పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో ఆసుపత్రికి చేరుకుని వారి యోగక్షేమాలు చూసుకున్నారు. ఒక్కసారిగా చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో భయానికి లోనైన విద్యార్థులు ఆసుపత్రిలో బోరున విలపించారు. భోజనం వికటించడమే కారణమా? మద్యాహ్న భోజనం తిన్న అనంతరం విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో భోజనం వికటించిన కారణంగానే ఇది జరిగి ఉంటుందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. పెసరపప్పుతో కూడిన కిచిడీతో పాటు గుడ్డు, టమాటా చట్నీ ఇవ్వడంతో అది తిన్న విద్యార్థులకు సరిగా అరగక అస్వస్థకు గురై ఉంటారని వైద్యులు తెలిపారు. కాగా కిచిడీ సరిగా ఉడక లేదని ఈ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా బాగానే ఉడికింది. ఏం ఫర్వాలేదని చెప్పడంతో తామంతా తిన్నామని అస్వస్థతకు గురైన విద్యార్థులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని, గురువారం రాత్రి వారిని ఆసుపత్రిలోనే పర్యవేక్షణలో ఉంచి శుక్రవారం వైద్యుల సూచనల మేరకు ఇళ్లకు పంపిస్తామని పీవో వెంకటరమణ తెలిపారు. విద్యార్థులు తిన్న ఆహారాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తున్నామని, వచ్చిన నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరో 12 మంది విద్యార్థులకు.. చింతూరు: మండలంలోని నరసింహాపురం బాలుర ఆశ్రమ పాఠశాలలోని మరో 13 మంది విద్యార్థులు గురువారం రాత్రి ఆస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేశాక వారికి వాంతలు మొదలయ్యాయి. ఏఎన్ఎం మాత్రలు మింగించడంతో వారిలో 10 మంది కొంత వరకు కోలుకున్నారు. విషయం తెలుసుకున్న చింతూరు ఐటీడీఏ పీవో వెంటనే ఆ హాస్టల్‌కు వెళ్లి ఆ 12 మంది విద్యార్థులను వాహనంలో చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స చేస్తున్నారు. -
చెప్పిందే మెనూ.. పెట్టిందే తిను..!
సాక్షి, యాదాద్రి : ఏం పెట్టినా తినాల్సిందే.. ఏదైనా జరిగినా బయటకు పొక్కొదు.. ఎవరైనా ఎదురు మాట్లాడితే బెదిరింపులు.. టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తామంటూ వేధింపులు.. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల దుస్థితి దారుణంగా ఉంది. జిల్లాలోని కస్తూర్బా, మోడల్ స్కూల్, సాంఘిక సంక్షేమ, గరుకుల పాఠశాలల వసతి గృహాలు రోజురోజుకు అధ్వానంగా మారుతున్నాయి. ఆధ్వానమైన భోజనం, శుభ్రత లేని నీటితోనే వంటలు, నాణ్యతలేని కూరగాయలు, నీళ్ల చారు, మరుగుడొడ్లు పూర్తిస్థాయిలో లేకపోవడం తదితర కారణాలతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లాలో పలు పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా భువనగిరి పట్టణ శివారులో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడే తప్ప అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడరు. పర్యవేక్షణ లేకపోవడంతో షరా మామూలవుతోంది. ఆయా పాఠశాలల అధికారుల నుంచి పెద్ద ఎత్తున ముడుతున్న ముడుపులే పర్యవేక్షణ అధికారుల ఉదాసీనతకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. భూదాన్‌పోచంపల్లి, ఆలేరు, బొమ్మలరామారం, మోటకొండూరు, తుర్కపల్లి,భువనగిరి మండలాల్లోని మోడల్, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో సంఘటనలు వెలుగుచూశాయి. మరికొన్ని చోట్ల వెలుగుచూడని సంఘటలు ఉన్నాయి. జిల్లాలో పాఠశాలలు.. జిల్లాలో కేజీబీవీ, మోడల్, ఆర్ఈఐఎస్, టీఆర్డబ్ల్యూఆర్ఎస్, టీఆర్టీడబ్ల్యూఆర్ఎస్ టీడబ్ల్యూ, మైనార్టీ రెసిడెన్షియల్,ఎంజేపీ రెసిడెన్షియల్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు మొత్తం 35 పని చేస్తున్నాయి. ఆయా పాఠశాలల్లో 14,214 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 5,114 మంది బాలురు, 9,100 మంది బాలికలు చదువుకుంటున్నారు. చదువుకోసం వచ్చిన విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. కానీ, ఎక్కడా మెనూ అమలు కావడం లేదు. విద్యార్థులు ఇబ్బందులను బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఏదైనా జరిగినప్పుడే.. రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో సంఘటనలు జరిగినపుడే అధికారులు చర్యలు చేపడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు మొక్కుబడి తనిఖీలు ఫలితాలను ఇవ్వడంలేదు. ఆయా సంస్థల్లో బాధ్యతలను నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఉపా«ధ్యాయులు, వంట మనుషుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిటి శాపంగా మారుతోంది. మంచినీటి కొరత, మరుగుదొడ్లు, మూత్ర శాలలలేక అవస్థలు తీరడం లేదు. మెనూ అమలెక్కడ? విద్యార్థులకు అందాల్సిన మెనూ మెజార్టీ వసతి గృహాల్లో అమలు కావడం లేదు. లక్కపురుగుల బియ్యం, పుచ్చుపట్టిన కూరగాయలు, చాలీచాలనీ నూనె, నీళ్ల పాలు, నీళ్ల చారు, ఉడికీఉడకని అన్నం, రెండు మూడు రోజులకోసారి కోడిగుడ్డు, పండ్లు, అరకొరగా చికెన్ కర్రీ, దేవుని ప్రసాదంలా స్నాక్స్ ఇలా చెప్పుకుంటే పోతే అన్నీ ఇబ్బందులే. పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఇలా.. వసతి గృహాలకు సరఫరా అవుతున్న సన్న బియ్యం సివిల్ సప్లై గోదాంలోనే గోల్మాల్ జరుగుతుంది. గోదాం ఇంచార్జ్, బియ్యం రవాణా చేసే కాంట్రాక్టర్‌తో ఆయా సంస్థల ఇంచార్జ్‌లు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం అక్రమాలు జరగుతున్నాయి. విద్యార్థుల హాజరు, సంఖ్యలో ఉన్న తేడాతోపాటు వారికి ఇచ్చే భోజనం తక్కువగా ఉంటుంది. నాసిరకం భోజనం ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ నాణ్యమైన కర్రీలు విద్యార్థులకు అందడం లేదు. దీంతో ప్రతి రోజూ కిలోల కొద్ది భోజనం విద్యార్థులు తినకుండా పారవేస్తున్నారు. పారవేసిన అన్నాన్ని సైతం బయటి వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. వారానికి ఒక్కసారి కూరగాయలు తెచ్చి వండి పెడుతున్నారు.తక్కువ ధరకు దొరికే నాసిరకం గ్రేడ్ త్రీ రకం కూరగాయలు తెచ్చి వండిపెట్టడం వల్ల అవి రుచికరంగా లేక విద్యార్థులు తినడం లేదు. బలవంతంగా తిని కొన్నిసార్లు విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. సరిపడా పాలు సరఫరా అవుతున్నా విద్యార్థులకు మాత్రం సరిగా అందడంలేదు. మూడు రోజుల కోసారి కోడిగుడ్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంచినూనె, కారం, పాలు, మసాల దినుసులు,పొపు దినుసులు నాసిరకంతోపాటు కోత విధిస్తున్నారు. జిల్లాలో వెలుగుచూసిన ఘటనలు కొన్ని ఫిబ్రవరి 13న భువనగిరి కేజీబీవీలో 50 మంది విద్యార్థులు, ఒక టీచర్ అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కేవలం 10మందినే ఆస్పత్రిలో చేర్చారు. మిగతా విద్యార్థులకు పాఠశాలలోనే చికిత్స అందించారు. 2018 మార్చి 31న మోటకొండూరు పాఠశాలలో కలుషిత ఆహారం తిని 100 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. 2019 ఆగస్టు20న చీకటి మామిడి మహాత్మాజ్యోతీరావ్పూలే వసతి గృహంలో 15 మంది, 2020 మార్చి 20న తుర్కపల్లి మండలం రాంపూర్‌తండా మోడల్ స్కూల్లో 20మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇంకా పలు చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా వెలుగు చూడనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. నాణ్యమైన భోజనం అందిస్తున్నాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇస్తున్నాం. భువనగిరి కేజీబీవిలో నాసిరకం భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయంలో ప్రాథమిక విచారణ జరిపి హెడ్కుక్ను సస్పెండ్ చేశాం. ఇన్చార్జ్ అధికారికి మెమో ఇచ్చాం. పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నాం. గతంలో జరిగిన సంఘటనలపై విచారణ జరిపించి చర్యలు తీసుకున్నాం. వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం.–అండాల్, జీసీడీఓ -
ప్రేమతో గోరు ముద్ద
మహారాణిపేట (విశాఖ దక్షిణం): రుచికరమైన, పసందైన పౌష్టికాహారం ఇప్పుడు పిల్లలకు అందుతోంది. మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులతో ఇప్పుడు భోజనాలు చేయడానికి విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఉత్సాహంగా తింటున్నారు. విజిటబుల్ బిర్యాని, పొంగలి, కచంబరం, దద్దోజనం, నాణ్యమైన భోజనం, రుచికరమైన కూరగాయలు, పచ్చళ్లు, కోడిగుడ్డి, వేరుసెనగ పప్పు చిక్కీ వంటివి పెట్టడంతో నగరంలోని జీవీఎంసీ స్కూళ్లతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సంతృప్తికరంగా భుజిస్తున్నారు. చాలాచోట్ల తల్లులు పాఠశాలలకు వచ్చి మరీ తమ పిల్లలకు ప్రేమతో భోజనాలు తినిపిస్తుండడం కనిపించింది. ఇంటి దగ్గర కంటే మిన్నగా ఇక్కడ భోజనాలు లభిస్తున్నాయని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారంతా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి «ధన్యావాదాలు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో భోజనాలు తినడానికి పిల్లలు ఇబ్బంది పడేవారు. ఇది గమనించి ఎదిగే పిల్లలకు మంచి ఆహారం అందివ్వాలనే ఉద్దేశంతో ఆర్థికంగా అదనపు భారమైనా ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులు తెచ్చారు. రోజుకో రకం భోజనం పిల్లలకు పెట్టాలని, దానికి ఎంత భారమైనా భరిస్తామని ముఖ్యమంత్రి ఆదేశాల జారీ చేశారు. ఈ పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించడంతో రుచికరమైన భోజనాలు సమకూర్చుతున్నారు. గతంలో నాసిరకం భోజనం గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనమంటే విద్యార్థులు హడలెత్తిపోయేవారు. తినలేక చాలామంది ఇంటి నుంచి క్యారేజీ తెచ్చుకునేవారు. పాఠశాల సమీపంలో ఉండేవారు ఇంటికి వెళ్లి భోజనం చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. -
అన్న చేతి ముద్ద
ఒంగోలు: చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కన్నా మధ్యాహ్న భోజనం (జగనన్న గోరుముద్ద) తినేవారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. దీనివల్ల పౌష్టికలోపం చిన్నారుల్లో కనబడుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలు భోజనం పట్ల ఇష్టాన్ని కనబరిచేలా మెనూలో మార్పులు తీసుకువచ్చారు. అంతే కాకుండా చిక్కీ (వేరుశనగ ఉండ లేదా చెక్క)ను భోజనంతో పాటు పిల్లలకు ఇస్తే వారిలో పౌష్టికాహార లోపాన్ని నివారించగలమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. దీంతో బడ్జెట్ భారం అయినా భరించేందుకు సిద్ధం చేశారు. అందులో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో నూతన మెనూతో మధ్యాహ్నభోజనం వడ్డించారు. శుచి, శుభ్రతతోపాటు రుచికరమైన భోజనం ‘‘రా...రమ్మని’’ పిలుస్తుందంటూ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిక్కీకి అదనంగా నిధులు సంక్రాంతి సెలవులకు ముందు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోజుకు రూ. 4.48 చెల్లించేవారు. కానీ తాజాగా వంటచేసేవారికి రూ. 43 పైసలు అదనంగా పెంచారు. అంతే కాకుండా వారానికి మూడు రోజులు చిక్కీ వండి వడ్డించేందుకుగాను రూ. 1.69 పైసలు అదనంగా కేటాయించారు. వారానికి మూడు రోజులు మాత్రమే చిక్కీ ఇస్తున్నందువల్ల ఒక చిక్కీ కోసం కేటాయిస్తున్న రు3.38 కేటాయించాలి. దీంతో విద్యార్థి కోసం కేటాయించే మొత్తం రూ. 6.60కు చేరుకుంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థికి సంక్రాంతి సెలవులకు పూర్వం రూ. 6.71 చెల్లించేవారు. ఇప్పుడు చిక్కీ వండి వడ్డించేందుకుగాను 40 పైసలు, చిక్కీకోసం రోజుకు రూ. 1.69 చొప్పున రెండో రోజులకు ఒక చిక్కీకి గాను రూ. 3.38 చెల్లించనున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు. పెరిగిన భారం ఇలా జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 1,21,550 మంది విద్యార్థులు నమోదయ్యారు. అయితే వారిలో 97798 మంది పాఠశాలకు హాజరుకాగా వారిలో 81489 మంది మధ్యాహ్నభోజనం తీసుకున్నారు. అదే విధంగా ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి 68324 మంది విద్యార్థులు నమోదు కాగా వారిలో 37477 మంది హాజరయ్యారు. వారిలో 31717 మంది తిన్నారు. 9,10 తరగతులకు సంబంధించి 40,008 మంది ఉండగా వారిలో 24,493 మంది మంగళవారం పాఠశాలలకు హాజరయ్యారు. వారిలో 19580 మంది భోజనం చేశారు. మొత్తంగా 2,29882 మందికిగాను 1,59,768 మంది పాఠశాలలకు హాజరుకాగా వారిలో 1,32,786 మంది భోజనం చేశారు. సంక్రాంతి సెలవులకు ముందు హాజరైన విద్యార్థుల్లో భోజనం చేసేవారి శాతం 88 శాతంగా ఉండేది. కానీ మంగళవారం పాఠశాలలు పునఃప్రారంభమైన రోజు 91.47 శాతం మంది భోజనం తీసుకున్నారు. మెనూ ఎలా ఉంటుందో అనుకుంటూ ఇంటినుంచి భోజనం తెచ్చుకుంటున్న విద్యార్థులు సైతం రేపటినుంచి తాము సైతం అంటూ పేర్కొంటున్నారు. దీని ప్రకారం ప్రతిరోజూ ఒక్కో ప్రాథమిక పాఠశాలోని విద్యార్థికి రూ. 2.12, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు రూ. 2.09 చొప్పున పెంచారు. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకోసం 47.3 శాతం నిధులు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకోసం 31.14 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కేటాయిస్తుంది. మధ్యాహ్న భోజన మెనూ పరిశీలన తాజా మెనూతో ప్రారంభమైన జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం)ను పరిశీలనలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి వి.యస్ సుబ్బారావు మంగళవారం ఆలకూరపాడు పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. పిల్లలతోపాటు తాను సైతం భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక పలు మండలాల్లో మండల విద్యాశాఖ అధికారులు, ఆయా పాఠశాలల యాజమాన్య కమిటీలు కూడా భోజనాన్ని తనిఖీచేసి శుచితోపాటు రుచి కూడా పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. మా ఇంటిలో కూడా ఇంత చక్కటి అన్నం దొరకదేమో మా ఇంటిలో కూడా మా పిల్లలకు ఇంత చక్కటి మెనూతో అన్నం పెట్టలేమేమో. విద్యతో పాటు, నాణ్యమైన భోజనాన్ని ప్రతి రోజూ అందిస్తూ తీపి కూడా మా పిల్లలకు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు.కె. రాజేశ్వరి, విద్యార్థి తల్లి,మున్నంవారిపాలెం -
సర్కారు బడుల్లో కొత్త మె'న్యూ'
ఆహా..ఏమి రుచీ.. తినరా మైమరచి.. అంటున్నారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. గతంలో మాదిరిగా పప్పు, నీళ్లచారుతో సరిపెట్టకుండా రాష్ట్ర సర్కారు సరికొత్త మెనూ రూపొందించింది. దీన్ని మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసింది. పోషకాలతో కూడిన ఆహార పదార్థాలకే ప్రాధాన్యమిచ్చింది. సరికొత్త వంటకాలు వడ్డించడంతో పిల్లలు ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సైతం హర్షం వ్యక్తంచేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉండాలంటే నాణ్యమైన, రుచి, శుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం నూతన మెనూ ప్రవేశపెట్టింది. సంక్రాంతి సెలవుల అనంతరం మంగళవారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో నూతన మెనూ అన్ని బడుల్లో అమలుచేశారు. దీనిపై అన్ని వర్గాల్లోహర్షం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు పులిహోర, టమాట పప్పు, ఉడికించిన గుడ్డును పెట్టారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు మొదటి రోజు పెట్టిన పులిహోరా, టమాట పప్పు, ఉడికించిన కోడిగుడ్డు మధ్యాహ్న భోజనం తిననివిద్యార్థుల సంఖ్య తగ్గింపు జిల్లాలో నూతన మెనూ అమలు కావడంతో మధ్యాహ్న భోజనం తినని విద్యార్థుల సంఖ్య తగ్గిందని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. గతంలో విద్యార్థులకు ఇష్టమైన భోజనం లేకపోవడంతో సరిగ్గా భోజనాన్ని తినేవారు కాదు. జిల్లాలో సంక్రాంతి సెలవుల ముందు 9వ తేదీన నివేదికల ప్రకారం జిల్లాలోని 4,830 పాఠశాలల్లో 2,13,558 మంది విద్యార్థులు హాజ రయ్యారు. వారిలో 2,04,408 మంది మధ్యాహ్న భోజనాన్ని తిన్నారు. మిగిలిన 9,150 మంది తినలేదు. కాగా మంగళవారం జిల్లాలో మధ్యాహ్న భోజనం తినని విద్యార్థుల సంఖ్య 6,172కు చేరింది. నూ తన మెనూ బాగుండడంతో మధ్యాహ్న భోజనం తినని విద్యార్థుల సంఖ్య రాబో యే రోజులలో క్రమేణా తగ్గుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 4,830 పాఠశాలల్లో అమలు జిల్లాలోని 4,830 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆ పాఠశాలల్లో చదువుతున్న 3,23,406 మంది విద్యార్థులు ఆ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. నూతన మెనూకు అదనపు బడ్జెట్ ఖర్చవుతున్నప్పటికీ లెక్కచెయ్యకుండా నాణ్యమైన భోజనాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. -
పసందుగా ‘మధ్యాహ్నభోజనం’
తిండి కలిగితె కండ కలదోయ్.. కండ కలవాడేను మనిషోయ్.. అనిప్రముఖ కవి గురజాడ అప్పారావు ఏనాడో చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులు. ఈనాటి వారి ఆరోగ్యమేరేపటి దేశానికి బలం. దీనిని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాలల్లో బాలల ఆరోగ్యం, చదువు, వసతులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే మన బడి నాడు–నేడు, కంటి వెలుగు, ఆరోగ్య పరీక్షల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన ఆయన ఇప్పుడు బాలలకు బలవర్థకమైన ఆహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకంలో కొత్త మెనూ అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ వినూత్న పథకం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. దీంతోవిద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం ఇక పసందుగా మారనుంది. విద్యార్థులకు రుచికరంగా పోషకాలతో కూడిన ఆహారం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మెనూలో పెను మార్పులు చేసింది. పౌష్టికాహారానికి పెద్దపీట వేసింది. బాలల ఆరోగ్యమే ధ్యేయంగా ముందడుగు వేసింది. అలాగే వంట ఏజెన్సీ ఆయాల గౌరవ వేతనం కూడా రూ.3 వేలకు పెంచింది. మార్చిన మధ్యాహ్న భోజన మెనూ మంగళవారం నుంచి అమలు కానుంది. ఇటీవల మధ్యాహ్న భోజన పథకంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని, అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన నాణ్యత ఉండాలని, ఎక్కడ తిన్నా రుచి ఒకేలా ఉండాల్సిందే అని, పులివెందులలో తిన్నా, అమరావతిలో తిన్నా రుచి మారకూడదని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో నాలుగు అంచెల్లో తనిఖీలు ఉండాలని సూచించారు. పిల్లలతో కలిసి పేరెంట్స్ కమిటీ కూడాభోజనం చేసి నాణ్యత పరిశీలించాలని పేర్కొన్నారు. గ్రామ సచివాలయం ద్వారా తనిఖీ నిర్వహించాలని సూచించారు. పొదుపు సంఘాలతో తనిఖీచేయించాలని, సెర్ప్ లేదా మరో సంస్థ ద్వారా కూడా తనిఖీలు చేయించాలని, తనిఖీల పర్యవేక్షణ మొత్తం ఆర్డీఓ చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేక యాప్ ఇందు కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నారు. అలాగే గుడ్లు సరఫరాకు డివిజన్ స్థాయిలో టెండర్లు పిలవనున్నారు. చిక్కి (వేరుశెనగ ఉండలు) సరఫరాకు స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయనున్నారు. మారిన మెనూ ప్రకారం.. వంట ఏజెన్సీలకు చెల్లించే మొత్తం కూడా సర్కారు పెంచనుంది. -
విద్యార్థికి విందు భోజనం
అనంతపురం: ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నుంచి కొత్త మెనూ అమలుకానుంది. జిల్లాలో 3,755 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. 3,37,677 మంది 1–10 తరగతుల విద్యార్థులు మధ్యాహ్న భోజనం స్కూళ్లలో తింటున్నారు. కొత్త మెనూకు సంబంధించిన ఫ్లెక్సీని సోమవారం సాయంత్రం కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ కొత్త మెనూ అమలుపై మధ్యాహ్న భోజన కార్మికులకు శిక్షణ ఇచ్చామన్నారు. అందరూ కొత్త మెనూ తప్పకుండా పాటించాలన్నారు. భోజనం నాణ్యతలో రాజీపడొద్దని సూచించారు. -
ఏక్తాశక్తి కాంట్రాక్టు రద్దు చేయాలి
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/దేవరపల్లి: జిల్లాలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా భోజనాన్ని సరఫరా చేస్తున్న ఏక్తాశక్తి ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.నరహరి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.శేషబ్రహ్మం, ఎన్.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏక్తాశక్తి ఏజెన్సీని సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఏ మాత్రం రుచించక విద్యార్థులు భోజనాలు మానేస్తున్నారన్నారు. బుధవారం దేవరపల్లి మండలంలోని గౌరీపట్నం ప్రాథమిక పాఠశాలకు సరఫరా చేసిన పప్పులో బల్లి రావడంతో విద్యార్థులు భోజనం మానేసి ఆకలితో అలమటించారన్నారు. ఈ ఏజెన్సీ సరఫరా చేస్తున్న భోజనంలో పురుగులు, బొద్దింకలు ఉంటున్నాయని ఆరోపించారు. ఉపాధ్యాయుల నిరసన ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంలో బల్లి ఉండడాన్ని నిరశిస్తూ దేవరపల్లిలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన చేసి తహసీల్దార్ రామకృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. ఏక్తా శక్తి ఫౌండేషన్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఉపాధ్యాయులు మండిపడ్డారు. విషపూరితమైన భోజనం చేసిన విద్యార్థులకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ఉపాధ్యాయులు అధికారులను ప్రశ్నించారు. భోజనంలో పురగులు, మేకులు, రాళ్లు ఉంటున్నాయని, కుళ్లిపోయిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారని గతంలో జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయగా, అధికారిని విచారణకు పంపించారని, విచారణ నివేదిక ఏమైయిందో తెలియలేదన్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్పందించారు. ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి ఏక్తాశక్తి సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆందోళనలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఉస్సే శంకరుడు, మండల అధ్యక్షుడు ఓరుగంటి శివనాగప్రసాదరాజు, ప్రధాన కార్యదర్శి కె.ఉమాకాంత్, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు పి.గంగరాజు, యూటీఎఫ్ మండల మహిళా అధ్యక్షురాలు ఎంఎస్ మహాలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు కె.గంగరాజు, సీహెచ్ సత్యవాణి, ఉపాధ్యాయులు కె.భూషణం, మర్ర అబ్బులు, బి.నాగేంద్ర పాల్గొన్నారు. -
కుళ్లిన కోడిగుడ్లే వడ్డించారు
నర్సీపట్నం: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహించిన పాఠశాల సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. నర్సీపట్నం బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 29న విద్యార్థినులకు కుళ్లిన కోడిగుడ్లు పెట్టారని అందిన ఫిర్యాదు మేరకు బుధవారం ఆయన పాఠశాలను సందర్శించారు. ముందుగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు, ఉపాధ్యాయుల్ని ప్రశ్నించారు. విద్యార్థినులను సైతం విచారించారు. విద్యార్థులకు వడ్డించేందుకు తయారు చేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు నాణ్యమైన ఆహారపదార్థాలను విద్యార్థులకు వడ్డించడం లేదనే విషయం రుజువైందని చెప్పారు. ఉడికించేందుకు నీటిలో వేసిన గుడ్లలో పాడైనవి పైకి తేలాయని.. వాటిని తాను స్వయంగా తీయించానని డీఈవో చెప్పారు. హెచ్ఎం, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం కారణంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఇష్టానుసారంగా ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారన్నారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తానని చెప్పారు. వారి నుంచి సరైన సమాధానం రాకుంటే వంట నిర్వాహకులను తప్పించడంతో పాటు హెచ్ఎం, ఆ రోజు మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాల్సిన ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిల్వల్లో తేడాలున్నాయ్... నిత్యావసర సరుకులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లో వెత్యాసం ఉందని డీఈవో గుర్తించారు. 1346 కిలోలకు గాను 250 కిలోల బియ్యం మాత్రమే స్టోర్ రూమ్‌లో ఉన్నాయన్నారు. దీనిపై కూడా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించే గుడ్డును విద్యార్థులకు వలిచి ఇవ్వాలని సూచించారు. నాణ్యమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని డీఈఓ హెచ్చరించారు. వైఎస్సార్సీపీ పట్టణ పార్టీ «అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ, సిరసపల్లి నాని, యాదగిరి శేషు, లోకవరపు శ్రీను, చోటీ, రాజేశ్వరి, పాకలపాటి అరవిందుకుమార్లు పాఠశాలలో జరుగుతున్న విషయాలను డీఈవో దృష్టికి తీసుకువెళ్లారు. -
మధ్యాహ్న భోజనానికి భారతీ ఆక్సా లైఫ్ చేయూత
హైదరాబాద్: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమానికి చేయూతనిచ్చేందుకు భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ ముందుకు వచ్చింది. సంస్థ 13వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అక్షయపాత్ర ఫౌండేషన్‌తో చేతులు కలిపింది. ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా అందించాలని తన ఉద్యోగులకు పిలుపునిచ్చింది. కడుపునిండా ఆహారం ఉంటే విద్యార్థులు మరింత మంచిగా చదువుకోగలరని తాము నమ్ముతున్నట్టు భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో వికాస్‌సేత్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 15,000 పాఠశాల్లలో ప్రతీ రోజూ 17.6 లక్షల మంది చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్ అందిస్తోంది. భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో 2025 నాటికి 50 లక్షల మంది చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలన్న తమ లక్ష్యం దిశగా మరికొన్ని అడుగులు వేసేందుకు వీలవుతుందని అక్షయ పాత్ర ఫౌండేషన్ సీఈవో శ్రీధర్ వెంకట్ పేర్కొన్నారు. -
గుడ్డు లేదు.. పండు లేదు!
సాక్షి, పెద్దేముల్: మధ్యాహ్న భోజన పథకంలో శ్రావణ మాసం అంటూ పలు ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్డు విద్యార్థులకు ఇవ్వడం లేదు. ఇదేమని అడగితే గుడ్డు బదులు పండు ఇస్తున్నామంటున్నారు. తీరా ఏది ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరికొంత మంది మధ్యాహ్న భోజన బిల్లులు రానిది గుడ్డు ఎలా పెట్టాలని ఆయాలు చెబుతున్నట్లు తెలస్తుంది. ప్రతి సోమ, బుధ, శుక్రవారం తప్పకుండా విద్యార్థులకు గుడ్డు ఇవ్వాలి. పలు పాఠశాలల్లో వారంలో రెండు సార్లు కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలల్లో హెచ్ఎంలు ఒక్క గుడ్డుకు రూ.4 బిల్లు చేస్తుంటారు. దానికి తోడు పాఠశాలల్లో మెనూ కూడా సరిగా పాటించడం లేదు. వారంలో రెండు సార్లు కిచిడీ చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్య లు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరు తున్నారు. ఈ విషయమై ఎంఈఓ శ్రీనివాస్‌ను వివరణ కోరగ శ్రావణ మాసంలో గుడ్డు బదులు తప్పకుండా పండు ఇవ్వాలన్నారు, పండ్లు ఇవ్వక పొతే బిల్లు చేసే ప్రసక్తి లేదన్నారు. ఈ విషయాన్ని పాఠశాలల హెచ్ఎంలకు తెలియచేస్తామన్నారు. -
మధ్యాహ్న భోజన పథకం అమలేది..!
సాక్షి, ఖమ్మం: జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి మూడేళ్లయినా ముందుకెళ్లడం లేదు. కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా భోజనం జాడలు కనిపిం చడం లేదు. అసలు ప్రభుత్వం భోజన పథకం అమలు చేస్తుందా.. లేదా అనే సందిగ్ధంలో విద్యార్థులున్నారు. దీనిపై విధాన నిర్ణయం ప్రభుత్వం ప్రకటించకపోగా.. విద్యార్థి సంఘాలు మాత్రం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. జిల్లాలో 19 జూనియర్ కళాశాలలు ఉండగా.. వీటిలో మొదటి సంవత్సరం 3,267 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ద్వితీయ సంవత్సరంలో 3,128 మంది ఉన్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలకు దీటుగా బోధన చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలో కళాశాలల్లో విద్యార్థుల చేరిక కూడా బాగానే ఉంది. అయితే ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకు ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో మధ్యాహ్న భోజనం లేక అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బాక్స్‌లు తెచ్చుకుంటున్నా.. చాలా మంది విద్యార్థులు ఉదయమే కళాశాలకు వస్తుండడంతో భోజనం తెచ్చుకోవడం వారికి వీలు కావడం లేదు. అయితే ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ప్రకటిస్తూ వస్తోందని, తమకు అమలు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. కళాశాలల్లో చేరిన విద్యార్థులు.. తమ పిల్లలను దూర ప్రాంతాలకు పంపించడం ఇష్టంలేని తల్లిదండ్రులు దగ్గర్లో ఉన్న జూనియర్ కళాశాలల్లో చేర్పిస్తున్నారు. ముఖ్యంగా బాలికలు ఎక్కువ మంది స్థానికంగా ఉండే జూనియర్ కళాశాలల్లో చేరుతున్నారు. అయితే ఉదయం వెళ్లిన వారు సాయంత్రమే మళ్లీ ఇంటికి రావడం కుదురుతోంది. అయితే కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు జరుగుతుందనే ప్రచారంతో చాలా మంది విద్యార్థులు కళాశాలల్లో చేరారు. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం గురించి ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయకపోవడంతో విద్యార్థులు సాయంత్రం వరకు ఆకలితో అలమటించాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయమే భోజనం సిద్ధం కాదు.. దీంతో కొందరు విద్యార్థులు కళాశాలకు వచ్చే సమయంలో ఇంటి వద్దే భోజనం చేసి బయలుదేరుతారు. ఇక సాయంత్రం వరకు వారికి తినేందుకు ఏమీ అందుబాటులో ఉండడం లేదు. మధ్యాహ్నం సమయంలో కేవలం మంచినీటితోనే కడుపు నింపుకోవాల్సి వస్తోంది. ఆకలితోనే పాఠాలు వినాల్సి వస్తోంది. కొందరు విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వస్తుండడంతో వారు ఆకలితో, ఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిందే.. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు ఇంటి వద్ద నుంచే భోజనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయమే భోజనం సిద్ధం కాని పరిస్థితి ఉండడవంతో విద్యార్థులు హడావుడి చేయాల్సి వస్తోంది. తల్లిదండ్రులు కళాశాల సమయానికంటే ముందే లేచి తమ పిల్లలకు భోజనం సిద్ధం చేయాల్సి వస్తోంది. దూర ప్రాంత విద్యార్థులు కళాశాలకు చేరుకోవాలంటే ముందుగానే బయలుదేరాలి. అలాగే సాయంత్రం ఇంటికి చేరే వరకు సమయం ఎక్కువ పడుతోంది. బస్సులో ప్రయాణించాల్సి రావడంతో వారు తప్పనిసరిగా భోజనం తీసుకెళ్లాల్సిందే. భోజనం లేకపోతే త్వరగా నీరసం వస్తుందని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళన.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మధ్యాహ్న భోజనం అమలు చేస్తారనే ఉద్దేశంతో విద్యార్థులు జూనియర్ కళాశాలల్లో చేరారు. అయితే పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఇటీవల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పలు కళాశాలల ఎదుట ఆందోళనలు కూడా చేశారు. ‘భోజన’ పథకాన్ని అమలు చేయాలి.. నాటి విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తామని మూడేళ్ల క్రితం ప్రకటించారు. ఇప్పటివరకు అమలు కాలేదు. ఈ విషయంపై ప్రస్తుత విద్యా శాఖ మంత్రి సైతం స్పందించడం లేదు. ప్రభుత్వం, అధికారులు సత్వరమే స్పందించి కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. – ఆజాద్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
మధ్యాహ్న భోజనాల్లో పురుగు పట్టిన గుడ్లు
సాక్షి, ఎ.మల్లవరం (తూర్పుగోదావరి) : మండలంలోని ఎ.మల్లవరం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం అందించిన మధ్యాహ్న భోజనాల్లో కుళ్లిన గుడ్లు వడ్డించారని పలువురు పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో మొత్తం 145 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాలు చేయగా వీరిలో కొంతమంది పిల్లలకు భోజనాల్లో వేసిన గుడ్లను ఇళ్లకు పట్టుకెళ్లారు. ఆ గుడ్లు వారి తల్లిదండ్రులు వలచి చూడగా అవి పురుగులు పట్టి కుళ్లిపోయి ఉన్నాయని వారు తెలిపారు. అదే విధంగా విద్యార్థులకు అందించిన గుడ్లలో సుమారు పదిహేను గుడ్లు వరకు కుళ్లిపోయినవి ఉండగా వాటిని తీసి పక్కన పెట్టామని పాఠశాల ఉపాధ్యాయులు వివరించారు. ఈ విషయాన్ని ఎంఈఓ ఎస్వీ నాయుడుకు తెలిపామన్నారు. కుళ్లిన గుడ్లు వడ్డించడంపై స్థానిక వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులను, మద్యాహ్న భోజన నిర్వాహకులను ప్రశ్నించగా మరోసారి ఇలాంటి తప్పు లేకుండా చూస్తామని తెలిపారు. -
ఇక ఈ–పాస్!
సాక్షి, వైరా(ఖమ్మం): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు ప్రభుత్వం సరఫరా చేసే సన్నబియ్యం పక్కదారి పట్టకుండా.. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో జనవరి 2015 నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం విదితమే. అప్పటి పరిస్థితులనుబట్టి విద్యార్థులకు దొడ్డు బియ్యం సరఫరా చేయడం వల్ల వారు సరిగా భోజనం చేయకపోవడం.. పాఠశాలల్లో వండిన వంటలు మిగిలిపోవడం వంటి వాటిని గుర్తించిన ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. పాఠశాలలతోపాటు ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థుల కోసం సన్నబియ్యం సరఫరా చేస్తుండడం.. ఆ బియ్యం పక్కదారి పట్టడంతోపాటు పలు అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ–పాస్ విధానాన్ని ప్రవేశపెట్టి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తోంది. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ రేషన్ బియ్యం సరఫరాకు సంబంధించి ఈ–పాస్ విధానాన్ని అమలు చేస్తోంది. అక్రమాలకు అడ్డుకట్ట.. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఒకటి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థికి 100 గ్రాములు, 5 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థికి 150 గ్రాముల చొప్పున బియ్యం వండి.. భోజనం వడ్డిస్తున్నారు. అలాగే వసతి గృహాల్లో ఉంటూ.. 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు 500 గ్రాములు, 6–10వ తరగతి వారికి 600 గ్రాముల భోజనాన్ని అందిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పాఠశాలకు విద్యార్థులు హాజరుకాకున్నా వచ్చినట్లుగా లెక్కలు చూపించి.. బియ్యం స్వాహా చేస్తున్నట్లు అక్కడక్కడా ఆరోపణలు వచ్చాయి. కొన్ని పాఠశాలల్లో కొందరు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినడం లేదు. ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న భోజనం తినడమో.. ఇంటికి వెళ్లి రావడమో చేస్తున్నారు. అయితే అలాంటి విద్యార్థులు కూడా పాఠశాలల్లోనే భోజనం చేస్తున్నట్లుగా తప్పుడు లెక్కలు చూపించి బియ్యం కాజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వసతి గృహాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. విద్యార్థులు ఇళ్లకు వెళ్లినా.. హాస్టల్లోనే ఉన్నట్లుగా లెక్కలు సృష్టించి సంబంధిత హాస్టల్ వెల్ఫేర్ అధికారులు సన్న బియ్యాన్ని మాయం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ–పాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుత విధానం.. ప్రస్తుతం ఆయా మండలాల్లో గల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అనుగుణంగా ఎంఈఓలు.. తహసీల్దార్లకు లెక్కలు అందిస్తున్నారు. వారు ఇండెంట్ పెడితే దానికి అనుగుణంగా సంబంధిత రేషన్ దుకాణానికి సన్నబియ్యం వస్తున్నాయి. అక్కడి నుంచి సంబంధిత పాఠశాలలకు బియ్యం తీసుకెళ్తున్నారు. వేలిముద్రలతో బియ్యం సరఫరా.. అయితే పాఠశాలలకు సరఫరా అయ్యే బియ్యంకు సంబంధించి రేషన్ దుకాణాల నుంచి కాకుండా నేరుగా సరఫరా చేయాలని భావిస్తున్నారు. పాఠశాలకు సంబంధించి బియ్యాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వ్యక్తి వేలిముద్ర తీసుకొని పంపిణీ చేయనున్నారు. అలాగే హాస్టళ్లకు సంబంధించి వేలిముద్రల ఆధారంగా బియ్యం ఇస్తారు. తద్వారా బియ్యం పక్కదారి పట్టదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధానంతో నేరుగా పాఠశాల, హాస్టళ్లకు ఎన్ని బియ్యం తీసుకెళ్తున్నారనేది వెంటనే తేలిపోతుంది. అక్కడ విద్యార్థులకు భోజనం వండి పెట్టగా.. ప్రతి నెలా మిగిలిన బియ్యం బయటకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉండదు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ–పాస్ విధానం అమలు చేయడం ద్వారా సన్నబియ్యంలో అక్రమాలకు అడ్డుకట్ట పడడంతోపాటు పిల్లలకు సక్రమంగా భోజనం అందే అవకాశం ఉంటుంది. త్వరలోనే 'ఈ' విధానం అమలు ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలో ఈ–పాస్ విధానం ద్వారా బియ్యాన్ని పాఠశాలలకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే అందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ఈ విధానం ద్వారా విద్యార్థులకు 100 శాతం న్యాయం జరుగుతుంది. ఎక్కడా అక్రమాలకు అవకాశమే ఉండదు. విద్యార్థుల ఆధార్ కార్డుల సేకరణ కూడా చేపడుతున్నాం. ఈ కార్యక్రమం పూర్తయితే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ–పాస్ విధానం ద్వారా సన్న బియ్యం సరఫరా అవుతుంది. – కె.వెంకటేశ్వర్లు, వైరా, ఎంఈఓ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల వివరాలిలా.. జెడ్పీఎస్ఎస్ ప్రాథమికోన్నత ప్రాథమిక పాఠశాలలు 211 192 810 వసతి గృహాల వివరాలిలా.. ఎస్సీ ఎస్టీ బీసీ ఆశ్రమాలు 50 19 33 11 -
‘మధ్యాహ్న భోజన’ కార్మికులకు తీపి కబురు
కర్నూలు సిటీ: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల్లోనే పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాలు పెంచుతూ ఆదేశాలిచ్చారు. అదే విధంగా పథకానికి ‘వైఎస్సార్ అక్షయ పాత్ర’గా పేరు పెట్టారు. టీడీపీ హయాంలో ప్రైవేటుకు అప్పగింత ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, పేద పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యత ఆయా గ్రామాలు, వార్డుల్లోని పొదుపు సంఘాలకు అప్పగించారు. విద్యార్థుల సంఖ్యను బట్టి వంట ఏజెన్సీల కార్మికులకు గౌరవ వేతనాలు ఇచ్చే వారు. అయితే ఆయన తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు కార్మికులకు పైసా కూడా గౌరవ వేతనాలు పెంచలేదు. పైగా 2014 తరువాత తెలుగు దేశం ప్రభుత్వం ఈ పథకం నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి, వంట ఏజెన్సీల కార్మికుల కడుపు కొట్టింది. ఆ సమయంలో కార్మికులు విజయవాడలో ఆందోళనలు చేస్తే పోలీసులతో కొట్టించింది. ఆ తరువాత గౌరవ వేతనం రూ.2 వేలు ఇస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. జిల్లాలో 7,020 మంది కార్మికులు.. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1927, ప్రాథమికోన్నత పాఠశాలలు 389, ఉన్నత పాఠశాలలు 554 ఉన్నాయి. ఈ స్కూళ్లలో 3,82,236 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం అమలయ్యే స్కూళ్లలో ఉన్నారు. అయితే వీరిలో సుమారు 2.48 లక్షల మంది విద్యార్థులు రోజు వారీగా మధ్యాహ్న భోజనం తింటున్నారు. వీరికి భోజనాలు చేసేందుకు జిల్లాలో 2,930 మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సుమారుగా 7,020 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరికి గతంలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా వెయ్యి రూపాయలు మాత్రమే వచ్చేది. ప్రస్తుతం గౌరవ వేతనం రూ. 3 వేలకు పెంచడంతో ప్రభుత్వంపై నెలకు రూ. 2.10 కోట్లు భారం పడుతుంది. హామీ నెరవేర్చిన వైఎస్ జగన్ .. ఎన్నికలకు ముందు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికల్లో గెలిచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే వెయ్యి నుంచి మూడు వేల రూపాయలకు గౌరవ వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనపై మధ్యాహ్నా భోజన పథకం కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ వేతనం పెంచడంసంతోషదాయకం ముజపర్ నగర్‌లోని ఎంపీయూపీ స్కూల్లో వంట ఏజెన్సీ కార్మికురాలుగా పని చేస్తున్నాను. చాలా రోజులుగా కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారు. కొత్త సీఎం జగన్మోహన్రెడ్డి రూ.3 వేలకు గౌరవ వేతనం పెంచడం సంతోషంగా ఉంది. ప్రైవేటు ఏజెన్సీని తొలగించి గతంలో మాదిరిగానే పొదుపు మహిళలకే అప్పగిస్తే బాగుంటుంది.– రుక్మిణమ్మ, ఎంపీయూపీ స్కూల్, ముజఫర్ నగర్, కల్లూరు మండలం -
వైఎస్సార్ అక్షయ పాత్ర!
విద్యార్థుల హాజరు పెంచటంతో పాటు వారు ఆరోగ్యకరంగా జీవించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం నిర్వీర్యమైన సమయంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజన నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సీఎం శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ‘వైఎస్సార్ అక్షయ పాత్ర’పేరిట విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని నిర్ణయించారు. పరిశుభ్ర వాతావరణం ఉండేలా చేయాలని అధికారులను ఆదేశించారు. సాక్షి, అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఎంతో ప్రాధాన్యత గల విద్యా శాఖపై సమీక్ష నిర్వహించటం ద్వారా వైఎస్ జగన్ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత తెలుస్తోంది. మధ్యాహ్న భోజన పథకం సరిగా అమలు చేస్తే విద్యార్థుల హాజరు శాతం పెంచటంతో పాటు స్కూల్లో చేరే పిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది. పౌష్టికాహారం తీసుకోవటం వల్ల శారీరకంగా ధృడంగా మార్చటంతో పాటు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వంలో నాణ్యమైన భోజనం అందించటంలో పూర్తిగా విఫలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గౌరవ వేతనం పెంపు.. మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీ నిర్వాహకుల గౌరవ వేతనాన్ని ఇప్పుడిస్తున్న వేయి రూపాయల నుంచి మూడు వేలకు పెంచాలని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో జిల్లాలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలలో పని చేస్తున్న 5,654 సహాయకులు లబ్ధి పొందనున్నారు. జిల్లాలో 3,157 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. అందులో జిల్లావ్యాప్తంగా 2,53,798 మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. మ«ధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.56.54 లక్షలు చెల్లిస్తుండగా, తాజా నిర్ణయంతో నెలకు రూ.1.69 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అక్షయ పాత్ర సరఫరా చేసే భోజనాన్ని విద్యార్థులకు వడ్డించేందుకు వారి సేవలను వినియోగించుకోనున్నారు. భోజన కార్మికులకు గత ఆరు నెలలుగా వేతనాలు, బిల్లులు ఇవ్వకపోవటంతో తీవ్ర కష్టాల్లో ఉన్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న పాఠశాలలు 3,157 జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య 2,61,411 మంది జిల్లాలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థుల సంఖ్య 2,53,798 మంది జిల్లాలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు 3,157 జిల్లాలో ఏజెన్సీలలో పని చేస్తున్న వంట సహాయకులు 5,654 మంది నెలకు సహాయకులకు చెల్లిస్తున్న గౌవరవ వేతనం రూ.56.54 లక్షలు పెరిగిన మొత్తంతో సహాయకులకు నెలకు చెల్లించే సొమ్ము రూ.1.69 కోట్లు -
సర్కారు బడికి ఇక మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు ఇక మంచి రోజులు రానున్నాయి. 44 వేల స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకో వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం సరఫరా చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం విద్యా వ్యవస్థ చక్కగా పని చేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని సీఎం జగన్ ఉద్ఘాటించారు. విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్రెడ్డి తొలిసారిగా శుక్రవారం పాఠశాల విద్యాశాఖ, మధ్యాహ్న భోజన పథకం–అక్షయ పాత్ర, పాఠశాలల మౌలికాభివృద్ధిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యార్థులకు అందుతున్న ఆహరం నాణ్యత గురించి ముందుగా చర్చించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది ప్రాథమిక సమావేశమని, ఇంకా పూర్తిస్థాయి ప్రణాళికలతో మళ్లీ భేటీ కావాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. ఇక ఈ పథకాన్ని ‘వైఎస్సార్ అక్షయ పాత్ర’గా పిలుస్తామని ప్రకటించారు. సమగ్ర నివేదిక రూపొందించండి విద్యార్థులకు నాణ్యమైన తాజా ఆహారం అందించాలని, సకాలంలో పాఠశాలలకు చేరేలా వంటశాలల ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ సూచించారు. మధ్యాహ్న భోజనం తయారీకి ఆధునిక వంటశాలలు ఉండాలని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు తయారు చేయాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, శుభ్రమైన తాగునీరు, విద్యార్థులు కూర్చోవడానికి ఫర్నీచర్, తరగతి గదుల్లో ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డులు, క్రీడా మైదానాలు, ప్రహరీ గోడలతో పాటుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని జగన్ ఆదేశించారు. పాఠశాల భవనాలకు రంగులు వేయించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై ఫొటోలు తీయించి, ఒక నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. తాను చెప్పిన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఒక సమగ్రమైన నివేదికను రూపొందించి, తదుపరి సమీక్షా సమావేశానికి తీసుకురావాలని అధికారులను కోరారు. గౌరవ వేతనం ఇక రూ.3,000 మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు ఇస్తున్న రూ.1,000 గౌరవ వేతనాన్ని రూ.3,000కు పెంచనున్నట్టు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. వారి విధుల నుంచి వంట చేసే పనిని క్రమంగా తొలగిస్తామన్నారు. వారిని ఇకపై కేవలం ఆహార పదార్థాల వడ్డనకే పరిమితం చేస్తామన్నారు. వాస్తవానికి జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు మధ్యాహ్న భోజనం తయారు చేసే కార్మికులు తమ కష్టాలను మొర పెట్టుకున్నారు. జగన్ అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చిస్తూ వచ్చారు. శుక్రవారం వారి గౌరవ వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అక్షయపాత్ర సంస్థ సరఫరా చేసే భోజనాన్ని విద్యార్థులకు వడ్డించేందుకు వారి సేవలను వినియోగించుకుందామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 30 లక్షల మందికిపైగా విద్యార్థులున్నారని, వీరంతా పాఠశాలలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, అందుకు తగ్గట్టుగా స్కూళ్లలో మౌలిక సౌకర్యాలను అభివృద్ది చేయాలని ఆదేశించారు. పాఠశాలలన్నింటిలో ఆంగ్ల మాధ్యమం 44 వేల సర్కారు బడులన్నింటిలోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడానికి అవసరమైన సదుపాయాలు, ఇతర అంశాలపై తదుపరి సమీక్ష నాటికి ఒక నివేదికను సిద్ధం చేసి తీసుకురావాలని జగన్ ఆదేశించారు. అయితే, ఈ బడులన్నింటిలోనూ తెలుగు కూడా కచ్చితంగా బోధించాలని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దితే విద్యార్థులు ఇటువైపే మొగ్గు చూపుతారని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డి, పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి, అక్షయ పాత్ర నిర్వాహకులు సత్య గౌడ చంద్రదాస్, వంశీధర దాస, నిష్కింజన దాస పాల్గొన్నారు. -
మధ్యాహ్నా భోజన పథకం అమలును సమీక్షించిన సీఎం వైఎస్ జగన్
-
సమగ్ర (ఆకలి)శిక్షా అభియాన్ !
చిత్తూరు, పీలేరు : సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న కాం ట్రాక్ట్ ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. రెం డు నెలలుగా జీతాలు అందకపోవడంతో అతికష్టం పై బతుకు బండిని లాక్కొస్తున్నారు. జీతాలు ఎప్పు డు ఖాతాల్లో జమవుతాయోనని నిరీక్షిస్తున్నారు. జిల్లా సమగ్ర శిక్షా అభియాన్‌లో 807 మందికిపైగా పనిచేస్తున్నారు. వారిలో 350 మంది సీఆర్పీలు, 66 మంది ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, 66 మంది డేటా ఎంట్రీలు, 325 మంది పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లు, 120 మంది ఐఈఆర్టీ ఉపాధ్యాయులు, 66 మంది మెసెంజర్లు, 10 నుంచి 12 మంది డివిజనల్ మానిటరింగ్ బృందం, మరి కొంత మంది జిల్లా సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. సీఆర్పీలకు నెలకు రూ. 17,600, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లకు రూ. 19100, డేటా ఎంట్రీలకు రూ. 17,600, పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లకు రూ. 14,200, ఐఈఆర్టీ ఉపాధ్యాయులకు రూ. 20250, ఆయాకు రూ. 4,500 జీతంగా చెల్లిస్తారు. ప్రతి నెలా 15వ తేదీపైన 30వ తేదీలోపు జీతాలు ఇవ్వడం సాధారణంగా మారింది. రెండు నెలలుగా వీరికి జీతాలు అందలేదు. మార్చి, ఏప్రిల్‌కు సంబంధించిన జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖలో వీరి పాత్ర కీలకం జిల్లా విద్యాశాఖలో సమగ్ర శిక్షాఅభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పాత్ర కీలకమైంది. సీఆర్పీలు ప్రతి రోజూ ఒక పాఠశాలను సందర్శించి ఆన్లైన్ ద్వారా జిల్లా అధికారులకు సమాచారం పంపాలి. ప్రభుత్వం ఏర్పాటుచేసే ప్రతి కార్యక్రమంలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి. విద్యాసంబంధమైన కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర పోషించాలి. బడిబయట పిల్లలను బడిలో చేర్పించడం, వారి నమోదు తర్వాత నిలకడ కోసం కీలకంగా వ్యవహరించాలి. రెగ్యులర్ పాఠశాలల్లో వివిధ రకాల పరీక్షలు నిర్వహించడం, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, స్కూల్ కాంప్లెక్స్ నిర్వహణ, పరీక్షపత్రాల పంపిణీ, ఆధార్ సీడింగ్, ఎన్రోల్మెంట్ డ్రైవ్, జియో ట్యాగింగ్ సర్వే, పుస్తకాల పంపిణీ తదితర కార్యక్రమాల్లో కీలక పోత్ర పోషిస్తారు. డేటా ఎంట్రీలు రోజూ జిల్లా విద్యాశాఖకు సంబంధించిన గణాంకాలను పూర్తి చేయడం, ఉపాధ్యాయుల జీతభత్యాలు, సెలవుల నమోదు, మధ్యాహ్న భోజనం తదితర కార్యక్రమాలపై గణాంకాలు ఆన్లైన్ ద్వారా జిల్లా విద్యాశాఖకు పంపాలి. ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు...విద్యార్థుల నమోదు, పాఠశాలల పనితీరు, వివరాలు సేకరించాలి. ఆయా పాఠశాలల పరిధిలోని విద్యార్థుల సమగ్ర నివేదిక రూపొందించడం, వివిధ ప్రాంతాల నుంచి రోజువారీ విద్యార్థుల ట్రాన్స్పోర్ట్ తదితర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా జిల్లా అధికారులకు పంపాల్సి ఉంటుంది. ఇంత చేస్తున్నా సకాలంలో జీతాలు అందలేదని పలుమార్లు సంబంధిత జిల్లా అధి కారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. టీఏ కూడా పెండింగ్ సీఆర్పీలకు 2018 జూలై నుంచి (దాదాపు 10 నెలలుగా) నెలనెలా రావాల్సిన టీఏ రూ. 600 ఇప్పటివరకూ మంజూరుకాలేదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో టీఏ బిల్లులు చెల్లించినా చిత్తూరులో ఇవ్వలేదు. గతంలో నిర్వహించిన స్లాష్ పరీక్షలు, కోడింగ్‌కు చెల్లించాల్సిన నగదు ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం గమనార్హం. -
భోజనం కరువు
అవగాహన లేమి.. అధికారుల అత్యుత్సాహం.. పాలకుల నిర్లక్ష్యం వెరసి మధ్యాహ్న భోజన పథకం అభాసుపాలైంది. కరువు మండలాల్లో ప్రారంభమైన రెండో రోజే పాఠశాలలన్నీ వెలవెలబోయాయి. ఎండదెబ్బకు పిల్లల హాజరు శాతం తక్కువగా కనిపించింది. దీనికితోడు 37 మండలాల్లో 80 శాతం పాఠశాలలకు బియ్యం సరఫరా చేయలేదు. ఏం చేయాలో దిక్కుతోచక భోజన కార్మికులు చేతులెత్తేశారు. ఉపాధ్యాయులు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో విద్యార్థులు పస్తులతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో 2016–17లో కరువు మండలాలన్నింటిలో వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అప్పుడు చాలామంది విద్యార్థులు హాజరుకాలేదు. ప్రస్తుతం వేసవి సెలవుల్లో జిల్లాలోని 37 మండలాల్లో ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులుఆదేశించారు. ఈ నెల 25 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. సెలవులు ప్రకటించిన తర్వాత మధ్యాహ్న భోజనం అమలు చేయాలని నిర్ణయించారు. ఫలితంగా ఈ పథకానికి ఆదరణ లేకుండా పోయింది. ఏ పాఠశాలలో చూసినా పదుల సంఖ్యలోనే కనిపిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో అయితే ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. 15 శాతం దాటని హాజరు జిల్లాలోని 37 మండలాల్లో ఉన్న పాఠశాలల్లో 15 శాతం కూడా హాజరుకావడం లేదని సమాచారం. గంగాధరనెల్లూరు మండలంలో శుక్రవారం 107 స్కూళ్లకు 67 స్కూళ్లలో మధ్యాహ్న భోజనాన్ని పెట్టారు. ఆయా పాఠశాలల్లో 175 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో ఉన్న 18 మోడల్ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా హాజరు కాలేదు. గురుకుల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోనూ అదే పరిస్థితి. మధ్యాహ్న భోజనం అమలవుతున్న మండలాల్లో పాఠశాలల వారీగా చూస్తే ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు ఒకటి, రెండు సంఖ్యల్లో వస్తున్నారు. ప్రాథమికోన్నత, హైస్కూళ్లలో అసలు విద్యార్థులే రావడం లేదని విద్యాశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ పథకంపై గ్రామాల్లోని ఎస్ఎంసీలు, అంగన్వాడీ కార్యకర్తలు, సంబంధిత ఎంఈఓలు అవగాహన కల్పిస్తే గానీ హాజరుశాతం పెరిగే సూచనలు కనిపించడం లేదు. గత ఏడాది బియ్యం సరఫరా గత విద్యా సంవత్సరంలో వేసవి సెలవుల్లో మధాహ్న భోజనాన్ని పెట్టకుండా విద్యార్థులకు బియ్యాన్ని సరఫరా చేశారు. ఈ ఏడాది అలా చేయలేదు. మధ్యాహ్న భోజనాన్ని కచ్చితంగా పెట్టాలని నిర్ణయించారు. ఒకవైపు శ్రమ, మరో వైపు నిధుల దుబారా తప్పితే ఒరిగేదేమీ లేదని విద్యావేత్తలు అంటున్నారు. గత ఏడాదిలాగే బియ్యం, కోడిగుడ్లను సరఫరా చేసి ఉంటే, ఇళ్లలో చేసుకుని తినేవారని చెబుతున్నారు. పాఠశాలలకు సరఫరాకాని బియ్యం జిల్లాలోని 37 మండలాల్లో 80 శాతం పాఠశాలలకు ఇప్పటికీ బియ్యం సరఫరా చేయలేదు. ఆయా పాఠశాలల్లో భోజన పథకం అమలు కావడం లేదు. జిల్లా సివిల్ సప్లయిస్ కార్యాలయం నుంచి కరువు మండలాలుగా నిర్ణయించిన పాఠశాలలకు బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. 2016–17లో వేసవిలో పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యానికి విద్యాశాఖ నుంచి ఇప్పటికీ నిధులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందువల్లే ఈ సారి చాలా పాఠశాలలకు బియ్యం సరఫరా చేయకుండా అలసత్వం చూపిస్తున్నట్లు సమాచారం. బియ్యం, పప్పు పిల్లలకు ఇచ్చేస్తే మేలు కరువు మండలాల్లో ఉన్న ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు బియ్యం, పప్పు, కోడిగుడ్డు ఇచ్చేస్తే మేలు. 2016 వేసవి సెలవుల్లో అలా చేశారు. ఈసారేమో మధ్యాహ్న భోజనం పెట్టే పద్ధతిని అమలు చేస్తున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులు హాజరుకావడం లేదు. ఇలా చేస్తే ఎవరికి లాభం. ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు పునరాలోచించి మరో నిర్ణయం తీసుకుంటే మేలు కలుగుతుంది.– గిరిప్రసాద్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దూరం నుంచి విద్యార్థులు రాలేకపోతున్నారు మండలాల్లో విద్యార్థులు హైస్కూల్‌కు రావాలంటే సమీపంలోని 5 కి.మీల నుంచి రావాల్సి ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల రాలేకపోతున్నారు. ఎండల తీవ్రత వల్ల వేసవి సెలవులు ఇచ్చారు. ఇప్పుడేమో పాఠశాలలకు వచ్చి భోజనం చేసి వెళ్లమంటే ఎలా. విద్యార్థులు స్కూళ్లకు సైకిళ్లు తొక్కుకొని, నడిచి రావాల్సి ఉంటుంది. వారిని ఎండలో ఇబ్బంది పెట్టడం సరికాదు. పర్యవేక్షణ చేసే టీచర్లకు గౌరవవేతనం రూ.2 వేలు ఇస్తామన్నారు. అలా కాకుండా నిబంధనల ప్రకారం వేసవి సెలవుల్లో పనిచేసే టీచర్లకు ఈఏలు ఇవ్వాలి. – జీవీ రమణ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
తొలిరోజే అట్టర్‌ఫ్లాప్!
కర్నూలు సిటీ/ కోవెలకుంట్ల/జూపాడుబంగ్లా: ప్రభుత్వ పాఠశాలల్లో వేసవికాలం మధ్యాహ్న భోజన పథకం అమలు మొదటిరోజే అభాసుపాలైంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కరువు మండలాల్లో వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలోని 33 మండలాల పరిధిలో అన్ని పాఠశాలల్లో బుధవారం నుంచి పథకం అమలు చేయాల్సి ఉంది. అయితే తొలిరోజే అట్టర్‌ఫ్లాప్ కావడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఆయా మండలాల్లో కొన్నిచోట్ల పాఠశాలలు తెరుచుకోక పోగా, మరికొన్ని చోట్ల మధ్యాహ్న భోజనం చేసేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరచలేదు. అరకొరగా అమలు .. జిల్లాలోని కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, ఆదోని, ఆలూరు, ఆస్పరి, బేతంచెర్ల, సి.బెళగల్, చిప్పగిరి, దేవనకొండ, డోన్, గూడూరు, హాలహర్వి, çహొళగుంద, జూపాడుబంగ్లా, కల్లూరు, కోడుమూరు, కౌతాళం, కృష్ణగిరి, కర్నూలు, మద్దికెర, మంత్రాలయం, మిడుతూరు, నందవరం, నంద్యాల, ఓర్వకల్లు, పత్తికొండ, ప్యాపిలి, వెల్దుర్తి, ఎమ్మిగనూరు, పాణ్యం మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వేసవిసెలవుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పాఠశాలల హెచ్ఎంలు స్కూళ్లకు వెళ్లి ఉదయం 11 గంటలకు విద్యార్థులకు భోజనం పెట్టించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. అయితే బుధవారం తొలిరోజు ఆయా మండలాల్లో చాలా పాఠశాలల తలుపులు తెరుచుకోలేదు. కొన్ని చోట్ల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కాకపోవడంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అరకొరగా అమలు చేశారు. కొద్ది మందికే భోజనం నందికొట్కూరు నియోజకవర్గంలో జూపాడుబంగ్లా, మిడుతూరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. జూపాడుబంగ్లా మండలంలో 36 పాఠశాలలు ఉండగా 3,480 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాల్సి ఉండగా 500 మందికి మాత్రమే ఏర్పాటు చేశారు. మిడుతూరు మండలంలో 49 పాఠశాలలుండగా 3,570 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉండగా కేవలం 550 మందికి వడ్డించినట్లు అధికారులు చెబుతున్నారు. జూపాడుబంగ్లా మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం తినేందుకు ఒక్క విద్యార్థి కూడా రాకపోవటంతో పాఠశాల తలుపులు తెరచుకోలేదు. జూపాడుబంగ్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 366 మందికి గాను 30 మందికి భోజనం వండగా, అందులో 5 మందికి మాత్రమే వడ్డించారు. పారుమంచాల జిల్లా పరిషత్ పాఠశాలలో 180 మందికి గాను కేవలం 50 మందికి, స్పెషల్ స్కూల్లో 100 మంది విద్యార్థులకు గాను 60 మందికి, మండ్లెం స్పెషల్ స్కూల్లో 68 మందికి గాను 32 మంది, జూపాడుబంగ్లా సిద్ధేశ్వరం పాఠశాలలో 29 మందికి గాను నలుగురికి భోజనం వడ్డించారు. మారుమూల గ్రామాలైన రామసముద్రం, కొత్తసిద్ధేశ్వరం పాఠశాలల్లో భోజనాలు అరకొరగా వడ్డించినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. మిడుతూరు మండలంలో కూడా అరకొరగా వడ్డించి ఉపాధ్యాయులు చేతులు దులుపుకున్నారు. బియ్యం, బ్యాళ్లు ఇళ్లకు ఇస్తే మేలు.. పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో ఆటాపాటల్లో ఇళ్ల వద్ద సరదాగా గడిపే విద్యార్థులు పాఠశాలలకు వచ్చి మధ్యాహ్న భోజనం తినేందుకు ఇష్టపడటం లేదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠశాలలు గ్రామాలకు దూరంగా ఉండటంతో స్థానిక, ఇతర గ్రామాల నుంచి విద్యార్థులు పాఠశాలలకు వచ్చి భోజనం చేయడం కష్టసాధ్యమని చెబుతున్నారు. దీంతో పాఠశాలల వద్ద వండి పెట్టకుండా విద్యార్థుల ఇళ్లకు బియ్యం, బ్యాళ్లు ఇస్తే బాగుంటుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. కోవెలకుంట్లలో.. కోవెలకుంట్ల పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయగా, ఉర్దూ ఉన్నత పాఠశాల, పేట స్కూల్ తెరవలేదు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులు ఎవరూ హాజరు కాకపోవడంతో పథకం అమలు కాలేదు. మెయిన్స్కూల్లో 40 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి బదులు ఉప్మాతో సరిపెట్టారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో మొదటిరోజే పథకం అభాసుపాలైంది. అధికారులు చర్యలు తీసుకుని పాఠశాలల్లో వేసవికాలంలో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 39,184 మంది మాత్రమే భోజనం చేశారు జిల్లాలోని 33 కరువు మండలాల పరిధిలోని మొత్తం 2053 స్కూళ్లలో 2,84,113 మంది విద్యార్థులకు వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉంది. అయితే మొదటి రోజు 39,184 మంది విద్యార్థులకు మాత్రమే భోజనం పెట్టినట్లు మధ్యాహ్న భోజన పథకం యాప్‌లో అప్లోడ్ చేశారు. పకథం అమలుపై విద్యాశాఖ జారీ చేసిన విధి వి«ధానాలను ఉపాధ్యాయులు వ్యతిరేకించడం వల్ల చాలా చోట్ల టీచర్లు హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో ఆయా స్కూళ్లకు చెందిన హెచ్ఎంలు మాత్రమే హాజరై భోజన సమయానికి వచ్చిన విద్యార్థులకు అన్నం పెట్టించి యాప్‌లో వివరాలు అప్లోడ్ చేశారు. దీని ప్రకారం జిల్లాలో మొదటి రోజు కేవలం 13 శాతం మంది విద్యార్థులు మాత్రమే స్కూళ్లకు వచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కోసిగి మండలంలో ఒక్క విద్యార్థికి కూడా భోజనం పెట్టకపోవడం గమనార్హం. ఈ మండలం లో 46 పాఠశాలలు ఉండగా, 11,284 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరుబయటే భోజనాలు.. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా మధ్యాహ్న భోజనం ఆరుబయట పెట్టకూడదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంద్యారాణి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ చాలా చోట్ల వంట ఏజెన్సీల నిర్వాహకులు ఆరు బయటే విద్యార్థులకు భోజనాలు పెట్టారు. వేసవి భోజనాలకు సరుకులేవీ? కరువు మండలాల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు అవసరమైన సరుకుల పంపిణీపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వకపోవడంతో మొదటి రోజు నిర్వాహకుల వద్ద మిగిలిన సరుకుల్లో నుంచే విద్యార్థులకు భోజనాలు పెట్టారు. వేస వి సెలవుల్లో సరుకులు పంపిణీ చేయకపోతే భోజనం ఎలా పెట్టాలని చాలా మంది వంట ఏజెన్సీల నిర్వాహకులు ఆయా స్కూళ్ల హెచ్ఎంలను నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. కరువు మండలాల్లోని స్కూళ్లన్నింటిలోనూ మధ్యాహ్న భోజనం పెట్టాలి జిల్లాలో 33 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ మండలాల పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం పెట్టాలని ఇప్పటికే హెచ్ఎంలకు ఆదేశాలు ఇచ్చాం. ఎంత మంది విద్యార్థులు భోజనం చేసిందీ యాప్‌లో అప్లోడ్ చేయాలి. – తాహెరా సుల్తానా, డీఈఓ -
పస్తులుండి.. పిల్లలకు బువ్వ!
మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు తాము పస్తులుండి పాఠశాలల్లో విద్యార్థులకు అన్నం పెడుతున్నారు. బిల్లులు సకాలంలో ఇచ్చినా ఇవ్వకపోయినా అప్పు చేసి మరీ భోజనం వడ్డిస్తున్నారు. ప్రభుత్వం 3 నెలలుగా భోజనానికి సంబంధించిన బిల్లులు నిలిపేసింది. భోజనం వడ్డించే ఆయాలు, హెల్పర్లకు 6 నెలలుగా గౌరవ వేతనాన్ని ఇవ్వలేదు. జిల్లాలో ఈ బిల్లులు, వేతనాలకు సంబంధించి సుమారు రూ.14.75 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. నెల్లూరు (టౌన్): మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోంది. వీరికి చెల్లించాల్సిన బిల్లులు, గౌరవ వేతనాలను నిలిపి వేసింది. ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులన్నింటిని పసుపు– కుంకుమ, రైతు రుణమాఫీకి మళ్లించినట్లు చెబుతున్నారు. పైగా వేసవి సెలవుల్లో జిల్లాలోని 26 కరువు మండలాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. పెండింగ్ బిల్లులు ఇవ్వకుంటే భోజనం వడ్డించడం మా వల్ల కాదని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో మొత్తం 3,404 ప్రభుత్వ పాఠశాలల్లో 2,16,320 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. ఇస్కాన్ సంస్థ ద్వారా నెల్లూరు అర్బన్ పరిధిలోని 111 పాఠశాలలు, అక్షయపాత్ర ద్వారా గూడూరు, మనుబోలు, వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లోని 291 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,002 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 3,002 ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందజేస్తున్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజనానికిసంబంధించి రూ.2.85 కోట్లు ఖర్చు అవుతుంది. భోజనం వడ్డిస్తున్న ఆయాలు, హెల్పర్లకు ఒక్కొక్కొరికి నెలకు రూ.1000 గౌరవ వేతనం అందజేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు గౌరవ వేతనాన్ని రూ.3 వేలకు పెంచి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇస్తామని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది ఆయాలు, మరో 3 వేల మంది హెల్పర్లు పనిచేస్తున్నారు. ఇందుకు సంబంధించి రూ.1000 లెక్కన గౌరవ వేతనం రూ.62.19 లక్షలు రావాల్సి ఉంటుంది. పెంచిన గౌరవ వేతనం నెలకు రూ. 1.86 కోట్లు ఇవ్వాల్సి ఉంది. రూ. 14.63 కోట్లకు పైగా పెండింగ్ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు 3 నెలలుగా నిలిచిపోయాయి. నెలకు రూ.2.85 లక్షల లెక్కన మూడు నెలలకు కలిపి రూ.8.55 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయాలు, హెల్పర్లు గౌరవ వేతనం గతేడాది అక్టోబర్ నుంచి ఇవ్వడం లేదని చెబుతున్నారు. గౌరవ వేతనం రూ.1000 లెక్కన నెలకు రూ.62.19 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పెంచిన రూ.3 వేల ప్రకారం నెలకు రూ. 1.86 కోట్లు రావాల్సి ఉంది. గౌరవ వేతనం రూ.1000 లెక్కన అక్టోబర్ నుంచి జనవరి వరకు 4 నెలలకు కలిపి రూ.2.48 కోట్లు, రూ.3 వేల లెక్కన ఫిబ్రవరి, మార్చి రెండు నెలలకు కలిపి రూ.3.72 కోట్లు కలిపి మొత్తం రూ. 6.20 కోట్లు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి బిల్లులు రూ. 8.55 కోట్లు, గౌరవ వేతనానికి సంబంధించి రూ.6.20 కోట్లు కలిపి 14.75 కోట్లు రావాల్సి ఉంది. గతేడాది అక్టోబర్ వరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ నుంచే బిల్లులు ఇస్తున్నారు. ఆ తర్వాత ఆ బాధ్యతను జిల్లాలకు అప్పగించారు. అయితే ఎక్కువ మొత్తంలో బిల్లులు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి రావాల్సి ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం 4 నెలల నుంచి బిల్లులు రావాలి చెబుతున్నారు. 26 మండలాల్లో భోజన పథకం అమలు బిల్లులు ఇవ్వకపోయినా మూడు నెలలుగా అప్పులు చేసి మరీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించామని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. వేసవి సెలవుల్లో జిల్లాలోని 26 కరువు మండలాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కరువు మండలాల్లో మధ్యాహ్న భోజనం పెట్టలేమని ఏజెన్సీ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. కనీసం అక్కడ పనిచేసే ఆయాలు, హెల్పర్లకు కూడా గత 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే బతికేదెట్టా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలకో నాలుగు నెలలకో ఒకసారి పూర్తిస్థాయిలో ఇవ్వకుండా సగం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులతో పాటు గౌరవ వేతనాన్ని పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రమ, కష్టాన్ని దోచుకుంటున్నారు మధ్యాహ్న భోజన పథకానికి సకాలంలో బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఏజెన్సీలు అప్పులు చేసి ఎక్కడ నుంచి తెచ్చి పెడతారు. ఏజెన్సీ నిర్వాహకులు, ఆయా, హెల్పర్లు శ్రమ, కష్టాన్ని దోచుకుంటున్నారు. బిల్లులు పెండింగ్‌లో లేకుండా సకాలంలో చెల్లించాలి. ప్రస్తుతం సగం బిల్లులైనా విడుదల చేయాలి.– రెహనాబేగం, మధ్యాహ్న భోజన కార్మికుల అసోసియేషన్జిల్లా గౌరవాధ్యక్షురాలు -
భోజనం పెట్టేదెలా.!
మధ్యాహ్న భోజనం అందించే ఏజెన్సీల నిర్వాహకుల ఆకలి కేకలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. పాఠశాలల విద్యార్థులకు వీరు అప్పు చేసి పప్పు అన్నం పెడుతున్నారు. నాలుగైదు నెలల నుంచి బిల్లులు అందలేదు. బుధవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో తమ బిల్లుల పరిస్థితి ఏమిటని ఏజెన్సీల నిర్వాహకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు టౌన్ : జిల్లాలో 2,585కుపైగా ప్రాథమిక పాఠశాలల్లో 92 వేల మందికిపైగా విద్యార్థులు, 280కిపైగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో 18వేల మంది, 391 ఉన్నత పాఠశాలల్లో 92,769 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరంతా ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్న వారే. ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు నాలుగైదు నెలలుగా భోజనం బిల్లులు చెల్లించడం లేదు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా నెలకు రూ.10వేల నుంచి రూ.50వేలకు పైగా బిల్లులు అవుతున్నాయి. రూ.కోట్లలో బకాయిలు.. ప్రభుత్వం భోజనం బిల్లులు ఇవ్వకపోవడంతో ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రూ.కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. బిల్లులు ఎప్పుడు వస్తాయోనని ఏజెన్సీ నిర్వాహకులు ఎదురు చూస్తున్నారు. అప్పు చేసి రూ.లక్షకుపైగా తెచ్చామని మరి కొందరు ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. ఒక్కో వంట ఏజెన్సీకి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఏజెన్సీ నిర్వహిస్తే కుటుంబ పోషణకు పదో పరకో వస్తుందని అనుకున్న ఏజెన్సీల నిర్వాహకులు చివరకు అప్పుల పాలవుతున్నారు. రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు.. ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ నెల 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఐదు నెలలుగా ఎదురు చూసి బిల్లులు వస్తాయని అనుకున్న ఏజెన్సీలకు జూన్ 12వ తేదీ దాటితే కానీ బిల్లులు రావని అనుకుంటున్నారు. ఈ విధంగా మరో రెండు నెలలు బిల్లుల కోసం ఆగాల్సిన పరిస్థితి ఏజెన్సీ నిర్వాహకులకు ఏర్పడబోతోంది. ఈ విధంగా అయితే ఏజెన్సీలను నిర్వహించబోమని, రూ.లక్షలు అప్పు చేసి రోడ్లపాలు కాబోమని మరి కొందరు చెబుతున్నారు. విద్యార్థులకు భోజనం పెడుతూ వారి ఆకలిని తీరుస్తున్న ఏజెన్సీలను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం ఈ విధంగా తమకు బిల్లులు చెల్లించడం లేదని కొందరు ఏజెన్సీల వారు వాపోతున్నారు. రూ.లక్షకు పైగా అప్పు చేశాను పట్టణంలోని 2వ వార్డు మున్సిపల్ హైస్కూల్లో వంట ఏజెన్సీని నిర్వహిస్తున్నాను. ప్రభుత్వం ఏజెన్సీలకు ఇవ్వాల్సిన బిల్లులు నాలుగు నెలల నుంచి చెల్లించడం లేదు. దీంతో నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు భోజనం ఖర్చు అవుతుంది. ఇప్పటికే నేను రూ.లక్షకు పైగా వడ్డీకి తీసుకొచ్చి ఏజెన్సీని నిర్వహిస్తున్నా. బుధవారం నుంచి వేసవి సెలవులు ఉన్నాయి. ఇప్పటికీ బిల్లులు రాకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి. –ఎ.జయలక్ష్మి, 2వ వార్డు మున్సిపల్ హైస్కూల్ వంట ఏజెన్సీ నిర్వాహకురాలు, ప్రొద్దుటూరు.