పస్తులుండి.. పిల్లలకు బువ్వ! | Three Months Wages Pending Midday Meal Staff | Sakshi
Sakshi News home page

పస్తులుండి.. పిల్లలకు బువ్వ!

Published Thu, Apr 25 2019 1:38 PM | Last Updated on Thu, Apr 25 2019 1:38 PM

Three Months Wages Pending Midday Meal Staff - Sakshi

విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం (ఫైల్‌)

మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు తాము పస్తులుండి పాఠశాలల్లో విద్యార్థులకు అన్నం పెడుతున్నారు. బిల్లులు సకాలంలో ఇచ్చినా ఇవ్వకపోయినా అప్పు చేసి మరీ భోజనం వడ్డిస్తున్నారు. ప్రభుత్వం 3 నెలలుగా భోజనానికి సంబంధించిన బిల్లులు నిలిపేసింది. భోజనం వడ్డించే ఆయాలు, హెల్పర్లకు 6 నెలలుగా గౌరవ వేతనాన్ని ఇవ్వలేదు. జిల్లాలో ఈ బిల్లులు, వేతనాలకు సంబంధించి సుమారు రూ.14.75 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

నెల్లూరు (టౌన్‌): మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోంది. వీరికి చెల్లించాల్సిన బిల్లులు, గౌరవ వేతనాలను  నిలిపి వేసింది. ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులన్నింటిని పసుపు– కుంకుమ, రైతు రుణమాఫీకి మళ్లించినట్లు చెబుతున్నారు. పైగా వేసవి సెలవుల్లో జిల్లాలోని 26 కరువు మండలాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. పెండింగ్‌ బిల్లులు ఇవ్వకుంటే భోజనం వడ్డించడం మా వల్ల కాదని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు.  జిల్లాలో మొత్తం 3,404 ప్రభుత్వ పాఠశాలల్లో 2,16,320 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. ఇస్కాన్‌ సంస్థ ద్వారా నెల్లూరు అర్బన్‌ పరిధిలోని 111 పాఠశాలలు, అక్షయపాత్ర ద్వారా గూడూరు, మనుబోలు, వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లోని 291 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,002 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 3,002 ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందజేస్తున్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజనానికిసంబంధించి రూ.2.85 కోట్లు ఖర్చు అవుతుంది. భోజనం వడ్డిస్తున్న ఆయాలు, హెల్పర్లకు ఒక్కొక్కొరికి నెలకు రూ.1000 గౌరవ వేతనం అందజేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు గౌరవ వేతనాన్ని రూ.3 వేలకు పెంచి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇస్తామని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది ఆయాలు, మరో 3 వేల మంది హెల్పర్లు పనిచేస్తున్నారు. ఇందుకు సంబంధించి రూ.1000 లెక్కన గౌరవ వేతనం రూ.62.19 లక్షలు రావాల్సి ఉంటుంది. పెంచిన గౌరవ వేతనం నెలకు రూ. 1.86 కోట్లు ఇవ్వాల్సి ఉంది.

రూ. 14.63 కోట్లకు పైగా పెండింగ్‌
మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు 3 నెలలుగా నిలిచిపోయాయి. నెలకు రూ.2.85 లక్షల లెక్కన మూడు నెలలకు కలిపి రూ.8.55 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయాలు, హెల్పర్లు గౌరవ వేతనం గతేడాది అక్టోబర్‌ నుంచి ఇవ్వడం లేదని చెబుతున్నారు. గౌరవ వేతనం రూ.1000 లెక్కన నెలకు రూ.62.19 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది.  ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పెంచిన రూ.3 వేల ప్రకారం నెలకు రూ. 1.86 కోట్లు రావాల్సి ఉంది. గౌరవ వేతనం రూ.1000 లెక్కన అక్టోబర్‌ నుంచి జనవరి వరకు 4 నెలలకు కలిపి రూ.2.48 కోట్లు, రూ.3 వేల లెక్కన ఫిబ్రవరి, మార్చి రెండు నెలలకు కలిపి రూ.3.72 కోట్లు కలిపి మొత్తం రూ. 6.20 కోట్లు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి బిల్లులు రూ. 8.55 కోట్లు, గౌరవ వేతనానికి సంబంధించి రూ.6.20 కోట్లు కలిపి 14.75 కోట్లు రావాల్సి ఉంది. గతేడాది అక్టోబర్‌ వరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ నుంచే బిల్లులు ఇస్తున్నారు. ఆ తర్వాత ఆ బాధ్యతను జిల్లాలకు అప్పగించారు. అయితే ఎక్కువ మొత్తంలో బిల్లులు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి రావాల్సి ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం 4 నెలల నుంచి బిల్లులు రావాలి చెబుతున్నారు.

26 మండలాల్లో భోజన పథకం అమలు
బిల్లులు ఇవ్వకపోయినా మూడు నెలలుగా అప్పులు చేసి మరీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించామని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. వేసవి సెలవుల్లో జిల్లాలోని 26 కరువు మండలాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కరువు మండలాల్లో మధ్యాహ్న భోజనం పెట్టలేమని ఏజెన్సీ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. కనీసం అక్కడ పనిచేసే ఆయాలు, హెల్పర్లకు కూడా గత 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే బతికేదెట్టా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలకో నాలుగు నెలలకో ఒకసారి పూర్తిస్థాయిలో ఇవ్వకుండా సగం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పెండింగ్‌ బిల్లులతో పాటు గౌరవ వేతనాన్ని పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

శ్రమ, కష్టాన్ని దోచుకుంటున్నారు
మధ్యాహ్న భోజన పథకానికి సకాలంలో బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఏజెన్సీలు అప్పులు చేసి ఎక్కడ నుంచి తెచ్చి పెడతారు. ఏజెన్సీ నిర్వాహకులు, ఆయా, హెల్పర్లు శ్రమ, కష్టాన్ని దోచుకుంటున్నారు. బిల్లులు పెండింగ్‌లో లేకుండా సకాలంలో చెల్లించాలి. ప్రస్తుతం సగం బిల్లులైనా విడుదల చేయాలి.– రెహనాబేగం, మధ్యాహ్న భోజన కార్మికుల అసోసియేషన్‌జిల్లా గౌరవాధ్యక్షురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement