‘వంట’ కష్టాలు! | Midday Meal Scheme Delayed in PSR Nellore | Sakshi
Sakshi News home page

‘వంట’ కష్టాలు!

Published Sat, Dec 15 2018 1:14 PM | Last Updated on Sat, Dec 15 2018 1:14 PM

Midday Meal Scheme Delayed in PSR Nellore - Sakshi

విద్యార్థులకు గుడ్లు అందజేస్తున్న దృశ్యం

నెల్లూరు : చాలీచాలని నిధులు.. నాసిరకం బియ్యం.. మురిగిపోయిన కోడిగుడ్లు.. ఉడకని కందిపప్పు.. పామాయిల్‌తో వంటకాలు.. వండలేక నిర్వాహకుల అవస్థలు. ఇదీ పాఠశాలల్లో మధ్యాహ్న పథకం పరిస్థితి. ఆ భోజనం తినలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. కందిపప్పు, నూనె, కోడిగుడ్లు మేమే సరఫరా చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకులకు ఇచ్చే బిల్లులో భారీ కోత విధించింది. గ్యాస్‌ సిలిండర్లు కొనుగోలు చేయలేక కట్టెల పొయ్యిలపైనే ఆరు బయట వంటలు చేస్తున్నారు. ఓ  వైపు మెనూ చార్జీలు అరకొరగా ఇస్తుండటం.. మరో వైపు కూరగాయల ధరలు పెరుగుతుండటం నిర్వాహకుల పాలిట శాపంగా మారింది. విద్యార్థులకు పౌష్టికాహారం అందడంలేదు. అరకొర వేతనాలతో భోజన కార్మికులు తిప్పలు పడుతున్నారు. రెండు నెలలుగా గౌరవ వేతనం, బిల్లులు సుమారు రూ. 4 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో వీరి బాధలు వర్ణణాతీతం.

చెల్లిస్తున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అంతకు ముందు నెలకు రూ.2.80 కోట్లు ఖర్చు అవుతుందంటున్నారు. అయితే మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం ఇస్తున్న మెనూ చార్జీలు అరకొరగా ఉండటంతో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. కిరాణా సరుకులు ధరలు, గ్యాస్‌ భారం తదితర అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడంతో విద్యార్థులకు నాసిరకం కాహారం పెట్టాల్సి వస్తోంది. పాఠశాలలకు నాసిరకం రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేస్తుండడంతో పురుగులతో పాటు చిమిడి, ముద్ద కట్టిన అన్నమే దిక్కువుతుంది. కొంతమంది విద్యార్థులు  ఈ అన్నం తినలేక ఇంటి వద్ద నుంచి క్యారేజీలు తెచ్చుకుని తింటున్న సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం రూపొందించిన మెనూ ఎక్కడా అమలు కావడంలేదు.

పామాయిల్, కందిపప్పు, గుడ్లు సరఫరా
గత నెల 1వ తేదీ నుంచి అన్ని పాఠశాలలకు కందిపప్పు, పామాయిల్, గుడ్లును రాష్ట్ర ప్రభుత్వం ఓ సంస్థకు కాంట్రాక్ట్‌ అప్పగించింది. అప్పటి దాక మధ్యాహ్న భోజన కార్మికులే వీటిని తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే రిఫైండ్‌ ఆయిల్‌ బదులు పామాయిల్‌ను సరఫరా చేస్తున్నారు. దీని వల్ల విద్యార్థులకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మధ్యాహ్న భోజన కార్మికులు చెబుతున్నారు. కందిపప్పు సరిగా ఉడకడ లేదని వాపోతున్నారు. కోడిగుడ్లు సైతం చిన్నవి, నిల్వ ఉంచినవి సరఫరా చేస్తుండడంతో వాసన వస్తున్నట్లు భోజన కార్మికులు పేర్కొంటున్నారు.

తగ్గించిన మెనూ చార్జీలు
భోజనానికి సంబంధించి పామాయిల్, కందిపప్పు, కోడిగుడ్లును కాంట్రాక్ట్‌ సంస్థకు అప్పగించడంతో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే మెనూ చార్జీల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా కోత విధించింది. గతంలో ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రూ.4.13, యూపీ, ఉన్నత పాఠశాలల్లో రూ.6.18 చెల్లిస్తున్నారు. అయితే గత నెల 1వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రూ. 2.17 , యూపీ, హైస్కూల్స్‌లో రూ.3.17 చెల్లిస్తున్నారు. ఈ ధరలు ఏ మాత్రం సరిపోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. కూరగాయలతో పాటు చింతపండు, దినుసులు వినియోగానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందంటున్నారు. గ్యాస్‌ సిలిండర్‌ రూ.1000 పెట్టి కొనుగోలు చేయాల్సి రావడంతో ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోక కట్టెలతో వంట చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

రెండు నెలలుగా బిల్లులు పెండింగ్‌
రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు రెండు నెలలుగా బిల్లులను నిలిపివేసింది. జిల్లా వ్యాప్తంగా కార్మికుల గౌరవ వేతనంతో కలిపి రూ.4.11 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పొదలకూరు మండలంలోని ఓ గ్రామంలోని పాఠశాలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఓ ఏజెన్సీకి గత ఏడాది డిసెంబరు నాటికి సంబంధించి రూ.50 వేల బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈ రీతిలో జిల్లాలో అక్కడక్కడ ఏడాదిగా పైగా బిల్లులు పెండింగ్‌ ఉన్నట్లు మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో బిల్లులు చెల్లిస్తేనే మధ్యాహ్న భోజనం అందించగలమని, నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉంచితే అప్పులు చేసి భోజనాన్ని విద్యార్థులకు పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు.

ఇళ్లకే గుడ్లు
నెల్లూరు,ముత్తుకూరు: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనంలో వడ్డించాల్సిన కోడి గుడ్లను ఉడకబెట్టే దిక్కులేక విద్యార్థుల ఇళ్లకు పంపాల్సిన దుస్థితి కొనసాగుతోంది. ముత్తుకూరు మండలంలో మొత్తం 56 ప్రాథమిక, 8 యూపీ, 6 హైస్కూళ్లు ఉన్నాయి. ఇందులో బాలురు 2,225 మంది, బాలికలు 2,416 మంది చదువుకొంటున్నారు. వెంకటాచలం మండలంలోని అక్షయపాత్ర ఫౌండేషన్‌ ద్వారా మధ్యాహ్న భోజనం సరఫరా జరుగుతోంది. అయితే 30 నుంచి 35 శాతం మంది విద్యార్థులకు ఈ భోజనం రుచించడం లేదు. ఫలితంగా ఇళ్లకు వెళ్లి కొందరు భోజనం చేస్తుండగా, కొందరు బాక్సుల్లో తెచ్చుకొంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వం వారానికి ఐదు గుడ్లు సరఫరా చేస్తోంది. అయితే గుడ్లు ఉడకబెట్టి వడ్డించినందుకు ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. ఫలితంగా 50 శాతం పాఠశాలల్లో ఇళ్లకు వెళ్లే విద్యార్థుల చేతికి గుడ్లు ఇచ్చి పంపిస్తున్నారు. ముత్తుకూరు హైస్కూల్‌లో కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement