కావలి పట్టణ ప్రజలకు తాగునీటిని పుష్కలంగా అందించేందుకు ఉద్దేశించిన ‘అమృత్’ పథకం ఆలస్యం.. శాపంగా మారింది. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి కావాల్సిన పథకానికి నిధులు మంజూరు చేయకపోవడంతో పనులకు తీవ్ర జాప్యం ఏర్పడింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి కారణంగా పనులు చేపట్టలేకపోయామని, మరి కొంత సమయం కావాలని కాంట్రాక్ట్ సంస్థ ప్రతిపాదన మేరకు మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిధులు మంజూరు చేసింది. ఈలోగా సంస్థ వేరే చోట కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకోవడంతో.. గడువు తీసుకున్నా.. తిరిగి పనులు ప్రారంభించడంలో సంస్థ మూడేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని మున్సిపల్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
కావలి: ప్రతి ఇంటికి తాగునీటిని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మున్సిపాలిటీ భాగస్వామ్యంతో ప్రారంభించిన ‘అమృత్ పథకం’ ప్రజలకు విషంగా మారితే.. మున్సిపాలిటీకి పెనుభారంగా మారింది. గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. నాలుగేళ్లుగా నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. పట్టణ ప్రజలకు తాగునీరు పూర్తిస్థాయిలో సరఫరా చేయడానికి అవసరమైన నిర్మాణాలు, మురికినీటిని శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈ పథకం ప్రణాళిక. రూ.86.92 కోట్ల పథకం అంచనాలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.32 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.16.92 కోట్లు, కావలి మున్సిపాలిటీ రూ.38 కోట్ల వాటాగా ఉంది.
2018 ఏప్రిల్‌లో ఈ పథకం పనులు ప్రారంభమయ్యాయి. 2019 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాల్సి పట్టణ ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు అందించాల్సి ఉంది. అయితే కేంద్రం తన వాటా నిధులు మంజూరు చేసినా.. ఆ నాటి ప్రభుత్వం, మున్సిపాలిటీ తమ వాటాలను చెల్లించకుండా పదవీ కాలాన్ని పూర్తి చేసింది. దీంతో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్ల పనులు నత్తనడకన సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని చూపించి నిధులు మంజూరు చేసి, గడువు ఇవ్వాలని కాంట్రాక్ట్ సంస్థ కోరింది. ఈ మేరకు 2020 ఆగస్టు వరకు గడువు పొడిగించింది. అయితే ఈ గడువు తీరి మరో రెండేళ్లు గడిచినా పనుల పురోగతి లేకుండాపోయింది.
మున్సిపాలిటీపై వడ్డీ భారం
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించడమే కాకుండా, కావలి మున్సిపాలిటీ వాటా రూ. 38 కోట్లు కూడా జమ అయ్యేలా చర్యలు తీసుకుంది. అయితే మున్సిపాలిటీ వాటాలో రూ. 23 కోట్లు ‘పంజాబ్ నేషనల్ బ్యాంక్’ నుంచి రుణంగా తీసుకొని అమృత్ పథకానికి జమ చేసింది. బ్యాంక్ రుణం కు వడ్డీ కింద మున్సిపాలిటీ ప్రతి నెలా రూ. 15 లక్షలు చెల్లిస్తూనే ఉంది. ఇది మున్సిపాలిటీకి ఆర్థిక గుదిబండగా మారింది. అదే పనులు సకాలంలో పూర్తి చేసి ఉంటే.. కుళాయిలకు డిపాజిట్లు, నీటి పనులు వసూలు చేసే అవకాశం ఉండేది. పనులే జరగకపోవడంతో ఏ విధంగా నిధులు సమకూరే అవకాశం లేక బ్యాంక్‌కు అప్పు చెల్లించలేక.. వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతోంది.
ఏమైందంటే..
ఈ పథకానికి సంబంధించి నిర్మాణ పనులు 2018లో ప్రారంభం కాగానే మున్సిపల్ అధికారులు, పాలకులు హడావుడి మొదలు పెట్టింది. అమృత్ పథకం అమల్లో భాగంగా వీధుల్లో ఉన్న మున్సిపాలిటీకి చెందిన కుళాయిలన్నింటినీ తొలగించేశారు. దీంతో స్థానికులు, ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతాల్లో ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొన్నారు. మున్సిపాలిటీకి నిర్దిష్టమైన డిపాజిట్ చెల్లించి, ప్రతి ఒక్క ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ తీసుకోవాల్సిందే అని మున్సిపాలిటీ అధికారులు తేల్చి చెప్పారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు కూడా తాగునీటి వసతి మెరుగు పడాలంటే కుళాయి కనెక్షన్ తీసుకోవాల్సిందేనని మున్సిపాలిటీ అధికారుల మాటలనే సమర్థించారు. దీంతో స్థానికులు నిస్సహాయులై మౌనంగా ఉండిపోయారు. మున్సిపాలిటీ తన వాటా కింద చెల్లించాల్సిన రూ.38 కోట్లు కూడా జమ చేయకుండా చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.16.92 కోట్లు కూడా ఈ పథకానికి చెల్లించలేదు. దీంతో పనుల్లో జాప్యమైంది.
నత్తనడకన పనులు
అమృత్ పథకంలో రూ.57.92 కోట్లు తాగునీరు సరఫరాకు సంబంధించి పనులు, రూ.29 కోట్లు మురికి నీటి శుద్ధి కేంద్రం పనులు చేయాలి. తాగునీటి పనుల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద రోజుకు 14 లక్షల మిలియన్ లీటర్లు నీటిని శుద్ధి చేసే ప్లాంట్ 77.85 కిలో మీటర్లు పైప్‌లైన్లు, మద్దూరుపాడు, బుడమగుంట, ఐడీఎస్‌ఎంటీ ప్లాట్స్‌లో ఒక్కో ఓవర్ హెడ్ ట్యాంక్, ముసునూరులో రెండు ఓవర్ హెడ్ ట్యాంక్‌లు నిర్మాణం పూర్తయ్యాయి. తాగునీటి సరఫరాకు సంబంధించి 70 శాతం, మురికి నీటిని శుద్ధి చేసే కేంద్ర పనులు 75 శాతం పూర్తయ్యాయి. నిర్మాణ సంస్థకు ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తూ పనులు వేగవంతమయ్యేలా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
మూడు నెలల్లో పూర్తయ్యేలా చేస్తాం
నేను కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. ఈ పథకం పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి, రానున్న మూడు నెలల్లో అమృత్ పథకం నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పట్టణ ప్రజలకు తాగునీటిని సత్వరమే అందించాలనే లక్ష్యంతో ఉన్నాం.
– విజయలక్ష్మి, డీఈ,
పబ్లిక్‌హెల్త్ డిపార్ట్‌మెంట్, కావలి
ఇది కూడా చదవండి: పోర్టులను రాష్ట్రాలే అభివృద్ధి చేసుకోవచ్చు
Comments
Please login to add a commentAdd a comment