
సాక్షి, నెల్లూరు : ‘ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలి. వీలైతే ఏకగ్రీవాలు అయ్యేలా చూసుకోవాలి. ఎవరు రెచ్చగొట్టినా జిల్లా నాయకులెవరూ రెచ్చిపోవద్దు. ఓటర్లందరినీ చైతన్యపరచండి’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం మంత్రి మేకపాటి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం, డబ్బుతో ఎవరైనా ఓటర్లను ప్రలోభపెడితే అలాంటి వారిని చట్టానికి పట్టించే దిశగా అడుగులు వేయాలన్నారు. వీలైనంత వరకు జిల్లా నాయకులు గ్రామ స్థాయిలో చర్చలు జరిపి వాళ్లంతట వాళ్లే నాయకుడ్ని ఎన్నుకునేలా ప్రోత్సహించాలని, అలా చేస్తే తొలిసారిగా ఆదర్శవంతమైన ఎన్నికలు జరుగుతాయని, గ్రామ స్వరాజ్యం సుస్థిరంగా నిలబడుతుందని అన్నారు. ( చిచ్చు పెట్టండి.. రచ్చ చేయండి )
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అడ్రస్ లేకుండా గల్లంతవుతామనే భయంతో టీడీపీ ఎంతో మంది చేత నామినేషన్ వేయించి అదే విజయంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టి నాలుగు ఓట్లు రాల్చుకోవాలని చూస్తోందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలను ప్రభావితం చేయాలన్న దుర్బుద్ధితో టీడీపీ ఉందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment