సమగ్ర శిక్షలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు అవస్థలు
ఇటీవల రూ.400 కోట్లు నిధులు ఇస్తున్నట్టు ప్రకటన
జీవో ఇచ్చి, నిధులు విడుదల చేయని వైనం
108, 104 సిబ్బంది 6,500 మందికి రెండు నెలలుగా అందని వేతనాలు
ఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులకూ జూలై నుంచి వేతనాల్లేవ్
ఇంటి అద్దె, కుటుంబ అవసరాలకు డబ్బుల్లేక తీవ్ర అగచాట్లు
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు రెండు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న సమగ్ర శిక్ష, 108, 104.. ఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు జీతాలు అందక సతమతమవుతున్నారు. విద్యా శాఖలో కీలకమైన రాష్ట్ర సమగ్ర శిక్షలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది.
రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వీరికి కూడా ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేలా సమగ్ర శిక్ష ఎస్పీడీ చర్యలు తీసుకుని, సంబంధిత ఫైలును ప్రభుత్వానికి పంపించారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా.. సర్కారు నుంచి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం. సమగ్ర శిక్ష ద్వారా నిర్వహిస్తున్న విద్యా సంబంధ కార్యకలాపాల కోసం ఓటాన్ అకౌంట్ నుంచి రూ.413 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం గత నెలలో జీవో విడుదల చేసింది.
కానీ ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆగస్టు, సెపె్టంబర్ నెలలకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. సీఆర్‌ఎంటీలు, కేజీబీవీ టీచర్లతో పాటు పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు, ఎంఈవో కార్యాలయాల్లో పని చేస్తున్న ఎంఐఎస్ ఇన్‌స్ట్రక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, అకౌంటెంట్లు, పీఈటీలు, ఉపాధ్యాయ శిక్షణ సిబ్బంది, మధ్యాహ్న భోజనం వంట వారు, నైట్ వాచ్‌మన్లు, వాచ్ ఉమెన్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచర్లు, పీజీటీలు, క్లస్టర్ రిసోర్సు మొబైల్ టీచర్లు తదితర 25 వేల మంది జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి నెలవారి వేతనాలు రూ.6,500 నుంచి రూ.25 వేల వరకు ఉన్నాయి.
లబోదిబోమంటున్న 108, 104 సిబ్బంది
ఆగస్టు, సెపె్టంబర్ నెలల వేతనాలు అందక 108, 104 సిబ్బంది కూడా నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్‌లు 768.. 104 మొబైల్ మెడికల్ యూనిట్‌లు 936 ఉన్నాయి. అంబులెన్స్‌కు పైలట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీíÙయన్(ఈఎంటీ), ఎంఎంయూలో డ్రైవర్‌తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈవో) పని చేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 104, 108లలో 6,500 మంది డ్రైవర్‌లు, ఈఎంటీ, డీఈవోలు సేవలు అందిస్తున్నారు.
108 పైలట్, ఈఎంటీలకు నెలకు రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు, 104 ఎంఎంయూ డ్రైవర్, డీఈవోలకు రూ.15 వేల నుంచి రూ.27 వేల వరకు వేతనాలున్నాయి. వీరికి 104, 108 నిర్వహణ సంస్థ అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్విసెస్ వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల వేతనాలు ఇంకా వీరికి అందలేదు. తమకు ప్రభుత్వం నుంచి ఆరు నెలలకుసంబంధించి రూ.140 కోట్ల బిల్లులు రావాల్సి ఉందని నిర్వహణ సంస్థ చెబుతోంది.
అవి వస్తే గానీ పెండింగ్ వేతనాలను చెల్లించలేమంటున్నారని సిబ్బంది వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు అప్‌లోడ్ చేయలేదని చెబుతున్నారు. కాగా, ఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్‌లో పనిచేసే చిరుద్యోగులు జీతాల బకాయిల కోసం మరో విడత ఆదివారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. గత నెల 13న కూడా వీరు ఆందోళన చేపట్టారు.
ఓ వైపు జూలై నుంచి జీతాలు రావడం లేదని, మరోవైపు రాజకీయ ఒత్తిళ్లతో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని యూనియన్ అధ్యక్షుడు డి.మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రతినెలా జీతం వస్తేనే తమ కుటుంబాలు గడుస్తాయని, ఇంటి అద్దె, కుటుంబ అవసరాలకు డబ్బుల్లేక అగచాట్లు పడుతున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment