చినజగ్గంపేటలో ఖాళీ కంచాలతో విద్యార్థుల నిరసన
గొల్లప్రోలు (పిఠాపురం): ప్రత్యేక హోదా కోసం చేపట్టిన బంద్ విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం ఫలితంగా విద్యార్థులతో ఆకలి కేకలు వేయించింది. మండలంలోని 42 మండల పరిషత్ పాఠశాలలు, 7 జిల్లా పరిషత్ పాఠశాలల్లో శుక్రవారం మధ్యాహ్న భోజనం సరఫరా నిలిచిపోయింది. భోజనం సరఫరా చేసే అల్లూరి సీతారామరాజు ట్రస్ట్ బంద్ పేరుతో భోజనాన్ని సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. మండలంలో బంద్ ప్రభావం లేకపోవడంతో యథావిధిగా పాఠశాలలు పనిచేశాయి. విద్యార్థులు సైతం పాఠశాలలకు వచ్చారు. తీరా పాఠశాలకు వచ్చిన తరువాత మధ్యాహ్న భోజనం సరఫరా లేదని చెప్పడంతో విద్యార్థులు పస్తులతో ఉండాల్సి వచ్చింది. మండలంలోని 1 నుంచి 5వ తరగతి వరకు 2082 మంది, 6 నుంచి 8వ తరగతి వరకు 2145 మంది, హైస్కూల్ విద్యార్థులు 1656 మంది ఉన్నారు. వీరిలో 5 వేల మంది వరకు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. భోజనం సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. తాటిపర్తి, వన్నెపూడి, దుర్గాడ జెడ్పీ పాఠశాలలకు సమీపంలోని కొడవలి, చెందుర్తి, చినజగ్గంపేట, ఎ.విజయనగరం గ్రామాలకు చెందిన విద్యార్థులు సైకిళ్లు, ఆటోలపై వస్తున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేద్దామనే ఉద్దేశంతో ఇంటి వద్ద నుంచి భోజనం తీసుకురాలేదు. తీరా భోజనం సరఫరా లేదని చెప్పడంతో ఉసూరుమంటూ ఆకలితో సాయంత్రం వరకు పాఠశాలలో కాలం వెళ్లదీశారు.
ముందస్తు సమాచారం లేదు
వాస్తవానికి బంద్, ఇతర సందర్భాల్లో ముందు రోజు పాఠశాలలకు భోజనం సరఫరా సమగ్ర సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు భోజనం సరఫరా చేసే ట్రస్ట్ నుంచి గానీ, విద్యాశాఖాధికారుల నుంచి కానీ భోజనం సరఫరా నిలిపివేస్తున్నట్లు సమాచారం రాకపోవడం విశేషం. దీంతో విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోలేదు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరఫరా చేయకపోవడంపై విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే భోజనం సరఫరా అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
పాఠశాలకు మధ్యాహ్న భోజనం సరఫరా నిలిపివేస్తున్నామనే సమాచారం ట్రస్ట్ నుంచి ఆలస్యంగా వచ్చింది. దీంతో పాఠశాలలకు కూడా సమాచారం ఆలస్యంగా అందింది. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. ట్రస్ట్ వారు డీఈఓ దగ్గర అనుమతి తీసుకున్నారు. – సలాది సుధాకర్, ఎంఈఓ, గొల్లప్రోలు
Comments
Please login to add a commentAdd a comment