అధ్వాన భోజనం | Midday Meal Scheme Delayed in East Godavari | Sakshi
Sakshi News home page

అధ్వాన భోజనం

Published Sat, Dec 15 2018 8:37 AM | Last Updated on Sat, Dec 15 2018 8:37 AM

Midday Meal Scheme Delayed in East Godavari - Sakshi

సఖినేటిపల్లి మండలం మోరిలో సాంబారు పల్చగా ఉందని చూపుతున్న విద్యార్థినులు

‘మధ్యాహ్న భోజన పథకం పేరుతో పెడుతున్న ఆహారాన్ని జంతువులు కూడా తినవు. ఒకవేళ తిన్నా అవి బతికి బట్టకట్టలేవు. కాంట్రాక్టర్లకు లాభాపేక్ష తప్ప విద్యార్థుల ఆరోగ్యం ఏమాత్రం పట్టడం లేదు. ప్రతిస్థాయిలోనూ అవినీతి తాండవిస్తోంది. కుళ్లిన, పగిలిపోయిన కోడిగుడ్లను సరఫరా చేస్తూ పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే కాక పిల్లల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుంది.– ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణిస్తూ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలివి...

సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలకు తగ్గట్టుగా మధ్యాహ్న భోజన పథకం కింద జిల్లాలోని విద్యార్థులకు పెడుతున్న ఆహారంలో లోపాలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ చేసిన పరిశీలనలో బట్టబయలయ్యాయి. విద్యార్థులకు పౌష్టి కాహారాన్ని అందించి పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా అమలు కావల్సిన ఈ పథకం విద్యార్థులకు మరింత హానికరంగా తయారవుతోంది. దీంతో పిల్లల తల్లిదండ్రులు భయపడి ఆ భోజనం వైపే పంపించకుండా ఇళ్లకు రప్పించుకోవడమో...లేదంటే క్యారేజీలు కట్టివ్వడమో చేయడంతో సుమారు 40 శాతం మంది విద్యార్థులు తగ్గిపోయారనేది ప్రాథమిక అంచనా. ముఖ్యంగా 9,10వ తరగతి విద్యార్థులు భోజనం చేయకుండా ఇళ్లకు వెళ్లిపోతున్నారు.

నాసిరకం– అరకొర వసతులు...
జిల్లాలో 4240 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలవుతోంది. ఈ పాఠశాలల్లో 3,83,427 మంది విద్యార్థులు చదువుతున్నారు. అధిక శాతం మంది విద్యార్థులు భోజనం పథకం కింద పెడుతున్న ఆహారాన్ని తినడం లేదని సాక్షాత్తు  కేంద్ర, రాష్ట్ర ఆహార కమిటీ సభ్యులు గుర్తించారు. ఢిల్లీ, అమరావతి నుంచి జిల్లాకు వచ్చిన ప్రత్యేక బృందాలు గత నెల 68 పాఠశాలల్లో పరిశీలించగా 20 శాతానికిపైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తీసుకోవడం లేదని గుర్తించాయి. పర్యవేక్షణ లేకపోవడం, శుభ్రత పాటించకపోవడం, నాసిరకం సామాగ్రి వినియోగంతో విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని కూడా గుర్తించినట్టు తెలిసింది. పోషకాహారం లోపించి విద్యార్థులు వ్యాధులు బారిన పడుతున్నారని. వయసు, ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండటం లేదని, ఇతర ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నట్టు గుర్తించినట్టు సమాచారం. గుడ్డు చిన్నది కావడం, భోజనంలో రాళ్లు రావడం, నాసిరకం పప్పు తదితర కారణాలతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. చాలా పాఠశాలల్లో తాగడానికి నీరు కూడా లేని పరిస్థితులు నెలకున్నాయి.

కమీషన్ల కక్కుర్తి కోసమే కోతలు...  
పథకం అమలులో సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు వంట కార్మికుల పొట్టకొట్టి..ప్రైవేటు కాంట్రాక్టు ఏజెన్సీలకు లాభం చేకూర్చేలా ఉన్నాయి. గతంలో వంటకు అవసరమైన కందిపప్పు, నూనె వంట ఏజెన్సీల నిర్వాహకులే సమకూర్చుకునేవారు. రెండు నెలలుగా ఈ రెండు సరుకులు కాంట్రాక్టు ఏజెన్సీల నుంచి సరఫరా అవుతున్నాయి. దీంతో ఇప్పటి వరకూ వంట నిర్వాహకులకు అందించే కుకింగ్‌ ఛార్జీల్లో భారీగా కోత పడుతుంది. మార్కెట్‌ ధరలకంటే ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు చెల్లిస్తున్న రేటు అధికంగా ఉండడమే కాకుండా ప్యాకెట్ల బరువులోనూ వ్యత్యాసం ఉందనే విమర్శలు మధ్యాహ్న భోజన కార్మికులే చెబుతున్నారు. కుకింగ్‌ ఛార్జీలు పెంచాలని ఆందోళన చేస్తుంటే, ఇస్తున్న అరకొర ఛార్జీల్లోనూ సరుకుల సరఫరా పేరుతో కోతలు విధించి మా పొట్ట కొడుతున్నారని, ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గుడ్లైతే చెప్పనక్కర్లేదు. చాలా చిన్న గుడ్డు పెడుతున్నారు. అవి కూడా మెనూ ప్రకారం పెట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.  

తూకం, ధరల్లోనూ వ్యత్యాసమే..
పామాయిల్‌కు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన మార్గదర్శకాల మేరకు ఐదు గ్రాముల నూనెకు ప్రభుత్వం రూ.0.58 పైసలు చెల్లిస్తుంది. ఆ మేరకు కిలో నూనె రూ.116 అవుతుంది. పాఠశాలలకు సరఫరా చేసిన విజయ పామాయిల్‌ ప్యాకెట్‌పై ఉన్న ధర రూ.90.60లు ఉంది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో పామోలివ్‌ ధర రూ.70 ఉంది. దీంతో ధరలో 40 శాతానికిపైగా కార్మికులు నష్టపోతున్నారు. ప్యాకెట్ల తూకం కూడా కచ్చితంగా కిలో ఉండడం లేదనే విమర్శలున్నాయి.

కందిపప్పులోనూ తేడానే...
కాంట్రాక్టర్‌ నుంచి సరఫరా చేస్తున్న కందిపప్పుకు కిలో రూ.69 ప్రభుత్వం చెల్లిస్తోంది. రేషన్‌ దుకాణాల్లో అదే కందిపప్పు రాయితీపై రూ.40కు లభిస్తుంది. బయట మార్కెట్‌లో రూ.60 నుంచి రూ.65 వరకు ఉంది. కందిపప్పును ఒక కిలో, పది కిలోల ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నారు. వీటి తూకంలోనూ స్వల్పంగా తేడాలుంటున్నట్లు మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

ఏజెన్సీ కార్యకర్తలకూ మొండిచేయి
జిల్లాలో మధ్యాహ్న భోజనం పథకంలో 7,563 మంది పనిచేస్తున్నారు. ఇస్కాన్, బుద్ధవరపు ఛారిటబుల్‌ ట్రస్ట్, అక్షయ పాత్ర, అల్లూరి సీతారామరాజు ఎడ్యుకేషన్‌ సొసైటీలు వండి పెడుతున్నాయి. వీరికి అక్టోబరు, నవంబరు నెలలకు మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాల్సి ఉంది. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న ఆయాలకు మూడు నెలలకు గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. దాదాపు రూ.1.50 కోట్ల వరకు ప్రభుత్వం వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

జిల్లాలో వెలుగు చూసిన అవకతవకలివీ...
రౌతులపూడి మండలంలో విద్యార్థులు భోజనం బాగుండడంలేదని గతంలో ధర్నా చేశారు. శంఖవరం మండలంలో ఇటీవల కుళ్ళిన కోడిగుడ్లు ఇచ్చారంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయి తాగునీరు లేదు. అలాగే కూర్చోవడానికి వసతులు లేవు.
గండేపల్లి మండలం తాళ్ళూరులో మధ్యా భోజనంలో గుడ్డు వేయడంలేదు. నిర్వాహకులకు గౌరవ వేతనం ఇచ్చే రూ.వెయ్యి ఆరు నెలల నుంచి బకాయిపడ్డారు. బిల్లులు రెండు నుంచి మూడు నెలలు ఇవ్వకపోవడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు.
పిఠాపురంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో సరైన సమయానికి భోజనం అందడంలేదు. నాణ్యత కూడా అరకొరగానే ఉంది. కుళ్లిన కోడిగుడ్లు ఇవ్వడంతో అవి విద్యార్థులు తినడానికి పనికి రాకుండా పోతున్నాయి.
పెద్దాపురంలో కుళ్లిన గుడ్లు ఇస్తున్నారని, ఒక్కోసారి చిన్నగుడ్లను సరఫరా చేస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.  హైస్కూల్‌లో ఏజెన్సీకి ఇవ్వడం వల్ల భోజనాన్ని పదిగంటలకే వాహనంలో సరఫరా చేస్తున్నారు. ఈ కారణంగా మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేసే విద్యార్థులకు చల్లారిపోయి ఇబ్బందిగా ఉంటుందంటున్నారు.
కాకినాడ సిటీలో అక్షయపాత్ర ఏజెన్సీ ద్వారా సరఫరా అవుతుంది. వీళ్లు ప్రభుత్వం ఇచ్చే మెనూను ఎక్కడా అమలు చేయడంలేదు. వారంలో ఆరు రోజులు భోజనం పెట్టే విధానంలో భాగంగా నాలుగు రోజులు సాంబారు వేస్తున్నారు. అన్నం కూడా లావు బియ్యంతో వండుతున్నారు. సాంబారు నీళ్లులా ఉంటోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల నుంచీ కోడిగుడ్లు వేయడంలేదని ఆరోపిస్తున్నారు. ఈ అన్నాన్ని చాలా మంది పిల్లలు తినకుండా పడవేసి ఆకలితో ఉంటున్నారు.
రంపచోడవరం సిరిగిందలపాడు ఎంపీపీ పాఠశాలలో వంటషెడ్‌ లేకపోవడంతో పక్కనే ఉన్న పాతభవనంలో  వండిపెడుతున్నారు.     ఏజెన్సీలో ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీలకు బకాయిలు సక్రమంగా చెల్లించడంలేదు. దీనివల్ల నిర్వాహకులకు భారం అవుతుందంటున్నారు.
రాజమహేంద్రవరం రూరల్‌ మండలం రాజవోలులో ఎస్సీపేట మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో వంటషెడ్డులేక ఖాళీగా ఉన్న తరగతిలో ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీలు వంటలు నిర్వహిస్తున్నాయి. వంటసామాన్లు అరిగిపోయాయని, కొత్త సామాన్లు ఇవ్వడంలేదని నిర్వాహకులు చెబున్నారు. గ్యాస్‌ ధర పెరిగిపోయిందని, గ్యాస్‌ ధరకు తగ్గ డబ్బురావడంలేదని నిర్వాహకులు చెబుతున్నారు.
సకాలంలో బిల్లులు చెల్లించక ఏజెన్సీ నిర్వాహకులు సతమతమవుతున్నారు. విద్యార్దులకు వండి వార్చేందుకు నిర్వాహకులు ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి రుణాలు పొంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పరిస్దితి నెలకుంది. ఆలమూరులో కూర కలుపుకుని నోటిలో ముద్ద పెట్టుకుంటే మంచినీరు తాగనిదే లోపలికి దిగని పరిస్థితుల్లో విద్యార్థులున్నారు.
 రాజమహేంద్రవరం నగరంలో గతంలో ఇంప్లిమెంట్‌ ఏజన్సీలను సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ వాడమనేవారు. ఇప్పుడు కొత్తగా పప్పు, నూనె సరఫరా చేసేవారు నాసిరకం పప్పును, పామాయిల్‌ను సరఫరా చేస్తున్నారు.

నాణ్యమైన ఆహారం సరఫరాకు చర్యలు
జిల్లాలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో ఏవిధమైన నాణ్యత లోపం లేకుండా సక్రమంగా వండి అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏజెన్సీలతోపాటు, నగరాల్లో ఫౌండేషన్‌ల ద్వారా సరఫరా చేసే ఆహారం పరిశుభ్రంగా ఉండేలా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వేతన బకాయిలన్నీ సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం సీఏఫ్‌ఎంఎస్‌ ప్రవేశపెట్టడంతో కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో కొంత వరకూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.– ఎస్‌.అబ్రహం, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement