హోదా కోసం కదం తొక్కిన యువత | Students And Youth Strike In Front Of Collectorate For Special Status In Kakinada | Sakshi
Sakshi News home page

హోదా కోసం కదం తొక్కిన యువత

Published Wed, Jul 17 2019 10:26 AM | Last Updated on Wed, Jul 17 2019 10:27 AM

Students And Youth Strike In Front Of Collectorate For Special Status In Kakinada - Sakshi

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థులు, యువత

సాక్షి, కాకినాడ సిటీ:  రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ మంగళవారం పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు కాకినాడలో కదం తొక్కారు. ప్రత్యేక హోదా, విభజన సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. స్థానిక బాలాజీ చెరువు సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకూ నినాదాలు చేస్తూ వారు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా వారు కలెక్టరేట్‌ వద్ద భారీ ఎత్తున ధర్నా చేశారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌ను , వైజాగ్‌ చెన్నై కారిడార్‌లను వెంటనే మొదలు పెట్టాలని, కేంద్ర ప్రభుత్వ రంగంలోనే కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని, రామయ్యపట్నం పోర్టు కట్టాలని, పోలవరం ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని వారు నినాదాలు చేశారు. మోదీ దేశ ప్రధానిగా వ్యహరించాలే తప్ప గుజరాత్‌ ప్రధానిగా వ్యవహరించడం తగదని ఆందోళనకారులు అన్నారు.  

చంద్రబాబు నాయుడు చేసిన పొరపాట్ల వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోయిందని  పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గుచూపడం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు రాకుండా పోవడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయాలే కారణమంటూ పలువురు విమర్శించారు. జేఈఈ పరీక్షలు తెలుగు, తమిళంలో నిర్వహించకుండా గుజరాతీలో నిర్వహించడాన్ని మోదీ  ఆయన అనుచరులు ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. గోదావరి నదీ జలాల మళ్లింపుపై వెంటనే అఖిల పక్షం వేయాలని డిమాండ్‌ చేశారు.

యువత భవిష్యత్తు కోసం రాయితీతో కూడిన హోదా అవసరం
హోదా, విభజన సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసం రాష్ట్రానికి రాయితీతో కూడిన హోదా అవసరమన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ నాయకుడు అద్వానీ మారలేదా? తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదా, రైల్వే జోన్‌ సాధ్యం కాదన్న వారు రైల్వే జోన్‌ మంజూరు చేయలేదా? అని ఆయన గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతుంటే కేంద్ర నాయకులు సాధ్యం కాదని చెప్పడం సరికాదన్నారు.  ‘ప్రధాని మోదీ, అమిత్‌షాలు గొప్ప అంటూ గుజరాతీ పాటలు పాడుకుంటుంటే వారి ఇష్టం.  కానీ ఏపీకి వ్యతిరేకంగా బీజేపీ నేతలు మాట్లాడడం భావ్యం కాద’న్నారు.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. అనేక పథకాలు అమలు చేయాలి. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలి, సహాయం చేయకపోగా ఈ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందులు పెట్టడానికి కేంద్రం ప్రయత్నించడం సరికాదని శ్రీనివాస్‌ అన్నారు. సీఎం జగన్‌ను వెంటనే మోదీని ఢీకొనమని తాము అనబోమన్నారు.  కొంత సమయం ఇవ్వండి. అప్పుడు కూడా కేంద్రం ఏపీపై కక్ష సాధింపులు మానకపోతే, అందరూ కలసి పోరాడదాం అని చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ఉమ్మడి పోరాటానికి తాము మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. సమావేశానికి రాష్ట్ర విద్యార్థి యువజన నేతలు పి. బులిరాజు, పెంకే రవితేజ, సిద్ధార్థ సందీప్‌ చిట్టిబాబు, ఆసీఫ్‌ జాన్, భరత్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement