Youth activists
-
హోదా కోసం కదం తొక్కిన యువత
సాక్షి, కాకినాడ సిటీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ మంగళవారం పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు కాకినాడలో కదం తొక్కారు. ప్రత్యేక హోదా, విభజన సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. స్థానిక బాలాజీ చెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ నినాదాలు చేస్తూ వారు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా వారు కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేశారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌ను , వైజాగ్ చెన్నై కారిడార్లను వెంటనే మొదలు పెట్టాలని, కేంద్ర ప్రభుత్వ రంగంలోనే కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని, రామయ్యపట్నం పోర్టు కట్టాలని, పోలవరం ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని వారు నినాదాలు చేశారు. మోదీ దేశ ప్రధానిగా వ్యహరించాలే తప్ప గుజరాత్ ప్రధానిగా వ్యవహరించడం తగదని ఆందోళనకారులు అన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన పొరపాట్ల వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోయిందని పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గుచూపడం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు రాకుండా పోవడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయాలే కారణమంటూ పలువురు విమర్శించారు. జేఈఈ పరీక్షలు తెలుగు, తమిళంలో నిర్వహించకుండా గుజరాతీలో నిర్వహించడాన్ని మోదీ ఆయన అనుచరులు ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. గోదావరి నదీ జలాల మళ్లింపుపై వెంటనే అఖిల పక్షం వేయాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తు కోసం రాయితీతో కూడిన హోదా అవసరం హోదా, విభజన సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసం రాష్ట్రానికి రాయితీతో కూడిన హోదా అవసరమన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ నాయకుడు అద్వానీ మారలేదా? తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదా, రైల్వే జోన్ సాధ్యం కాదన్న వారు రైల్వే జోన్ మంజూరు చేయలేదా? అని ఆయన గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతుంటే కేంద్ర నాయకులు సాధ్యం కాదని చెప్పడం సరికాదన్నారు. ‘ప్రధాని మోదీ, అమిత్‌షాలు గొప్ప అంటూ గుజరాతీ పాటలు పాడుకుంటుంటే వారి ఇష్టం. కానీ ఏపీకి వ్యతిరేకంగా బీజేపీ నేతలు మాట్లాడడం భావ్యం కాద’న్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. అనేక పథకాలు అమలు చేయాలి. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలి, సహాయం చేయకపోగా ఈ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందులు పెట్టడానికి కేంద్రం ప్రయత్నించడం సరికాదని శ్రీనివాస్ అన్నారు. సీఎం జగన్‌ను వెంటనే మోదీని ఢీకొనమని తాము అనబోమన్నారు. కొంత సమయం ఇవ్వండి. అప్పుడు కూడా కేంద్రం ఏపీపై కక్ష సాధింపులు మానకపోతే, అందరూ కలసి పోరాడదాం అని చలసాని శ్రీనివాస్ అన్నారు. ఉమ్మడి పోరాటానికి తాము మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. సమావేశానికి రాష్ట్ర విద్యార్థి యువజన నేతలు పి. బులిరాజు, పెంకే రవితేజ, సిద్ధార్థ సందీప్ చిట్టిబాబు, ఆసీఫ్ జాన్, భరత్ పాల్గొన్నారు. -
‘అంగన్వాడీ’ల అవస్థలు
మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: కనీస వేతనాలందక అంగన్వాడీ కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు. వెట్టిచాకిరి చేస్తున్నా పాలకులు స్పందించడం లేదు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణే గాక ప్రభుత్వం ఇతర పనులను సైతం వీరితోనే చేయిస్తోంది. పనిగంటలు, బాధ్యతలు పెరిగినా ఆ మేరకు జీతాలు పెరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత చాకిరి చేస్తున్నా అంగన్వాడీ కార్యకర్తకు కేవలం రూ.3,700, ఆయాకు రూ.1,950 చొప్పున నామమాత్రపు జీతాలను చెల్లిస్తుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రీస్కూల్ నడిపిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. అందోళనబాట పట్టిన కార్యకర్తలు.. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనబాట పట్టారు. కనీస వేతనం రూ.10,000 చెల్లించాలని, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రతి కేంద్రానికి సొంతభవనాన్ని సమకూర్చాలని, సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని, పెరిగిన ధరలకనుగుణంగా మెనూ చార్జీలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మూతపడిన కేంద్రాలు.. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు గత రెండు రోజులుగా ఆందోళనబాట పట్టడంతో ఆయా కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. -
పోలీస్ మార్క్ ట్రీట్మెంట్
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఖమ్మం అర్బన్ పోలీసులు రెచ్చిపోయారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీస్‌మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇది చాలదన్నట్లు హత్య కేసులో నిందితుల మాదిరిగా నడిరోడ్డుపై గొలుసులతో భారీ బందోబస్తు మధ్య ప్రదాన రహదారిపై ప్రదర్శనగా కోర్టుకు తీసుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి. గతనెలలో ఖానాపురం హవేలీ పరిధిలో శ్రీనగర్‌కాలనీలో ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తున్న యువకులను స్థానికులు మందలించారు. దీంతో యువకులు, స్థానికుల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. అనంతరం ఇద్దరు యువకులు వారి స్నేహితులతో కలిసి వచ్చి స్థానికులపై దాడి చేయడంతో స్థానికులు సైతం వారిపై దాడి చేశారు. అనంతరం స్థానికులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులుగా ఉన్న మరో ఇద్దరు యువకులు నేరుగా కోర్టులో లొంగిపోయారు. పోలీసులు వీరిని విచారణ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీస్‌మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా రెచ్చిపోయి గురువారం ఆ యువకులను గొలుసులతో బంధించి సినీఫక్కీలో రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. పోలీసుల తీరును చూసిన స్థానికులు అవాక్కయ్యారు. తీవ్రమైన కేసుల్లో మాత్రమే ఇలా వ్యవహరించే పోలీసులు చిన్నపాటి ఘర్షణ కేసులో నిందితులైన ఇద్దరు యువకుల పట్ల ఇలా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ విచారణ కోసం... ఖమ్మం అర్బన్ : శ్రీనగర్ కాలనీలో గత నెల 20వ తేదీన జరిగిన ఘర్షణలో బహిరంగ విచారణ కోసం జైల్లో ఉన్న ప్రవీణ్, ఆరీఫ్‌లను కస్టడీలోకి తీసుకున్నామని ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు. వారిని గురువారం శ్రీనగర్ కాలనీలోని నారాయణరావు ఇంటి పరిసరాలకు తీసుకెళ్లి విచారణ చేశామని అన్నారు. అనంతరం వారిని తిరిగి కోర్టుకు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో కొందరు పోలీసుల ముందు వచ్చినప్పటికీ వివరాలు చెప్పడానికి నిరాకరించినట్లు తెలిసింది. -
బడి బయట.. ‘బాల’ భారతం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బాలల భావి భారతం బడిబయట మగ్గుతోంది. బడిలో ఉండాల్సిన పిల్లలు హోటళ్లు, కార్ఖానాలు, చేలలో, కూలీలుగా మారుతున్నారు. పలక, బలపం పట్టాల్సిన చేతులు పలుగు, పార పడుతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా.. రూ.కోట్లు కుమ్మరించినా, విద్యాహక్కు చట్టం అమలులోకి తెచ్చినా డ్రాపౌట్స్ పెరుగుతున్నారు. బడిఈడు పిల్లలను బడిలోనే ఉంచాలనే విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం జిల్లా ఆర్వీఎం అధికారులు జూన్‌లో నిర్వహించిన సర్వేలో 3,536 మంది బడి బయట ఉన్నట్లు గుర్తించారు. వారిని బడిలో చేర్పించేందుకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించిన ఆర్వీఎం 1,327 మందిని బడిబాట పట్టించి నట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. అయినా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు చదువులకు దూరం కాగా, రూ.కోట్లు వెచ్చించినా ఫలితం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. విద్యాహక్కు చట్టం ఏం చెప్తుంది.. విద్యాహక్కు చట్టం ప్రకారం ఆరేళ్ల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు బడిలో ఉండాలనేది నిబంధన. ఇందుకోసం ఆర్వీఎం బాలకార్మిక నిర్మూలన వ్యవస్థ, కార్మిక శాఖలు సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నా అంతగా ప్రయోజనం లేదు. చాలా మంది పిల్లలు బడికి దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇంటింటికి సిబ్బందిని పంపించి మరీ సర్వే జరిపించాలని ఇటీవలే మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆర్వీఎం అధికారులను సూచించింది. ఈ మేరకు 52 మండలాల్లో అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సర్వే జరిపారు. ప్రతి గ్రామంలోనూ సర్వే నిర్వహించి అత్యధికంగా కాగజ్‌నగర్ మండలంలో 506 మంది, అత్యల్పంగా కాసిపేట, భీమిని, దండేపల్లి మండలాల్లో ముగ్గురు చొప్పున పిల్లలు బడిబయట ఉన్నట్లు సర్వేలో తేలింది. రూ.లక్షలు వెచ్చించినా ఫలితం శూన్యం.. ఈ ఏడాదిలో బడిబాట, విద్యా సంబరాల కోసం పాఠశాలలకు కేటాయించిన స్కూల్ గ్రాంట్స్ నుంచి నిధులు ఖర్చు చేయాలని ఆర్వీఎం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రాథమిక 3,084, ప్రాథమికోన్నత 444, ఉన్నత పాఠశాలలు 543 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలకు స్కూల్‌గ్రాంట్స్ నుంచి రూ.500 ఖర్చు చేయాలని, ప్రాథమికోన్నత పాఠశాలలు రూ.750 ఖర్చు చేయాలని పేర్కొన్నారు. విద్యా సంబరాల కోసం ఒక్కో ఎంఈవె నెల కోసం వాహనం పేరిట రూ.24 వేలు ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టుకున్నారు. కాగా ప్రచారం కోసం రూ.60 వేల కరపత్రాలు, పోస్టర్లు ప్రింటింగ్ చేసినట్లు ఆర్వీఎం రికార్డులు చెప్తున్నాయి. రూ.40 వేల అడ్మిషన్ ఫారాలను ప్రింటింగ్ చేయించారు. 4 వేల బ్యానర్లు తయారు చేయించారు. కరపత్రాలు, పోస్టర్ల కోసం రూ.7.34 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. 4 వేల బ్యానర్ల కోసం రూ.13 లక్షలు ఖర్చు చేసినట్లు ఆర్వీఎం అధికారులు తెలిపారు. మొత్తంగా రూ.50 లక్షలకేపైనే బడిబయట పిల్లల కోసం ఖర్చు చేసినట్లు చెప్తున్నా... విద్యార్థుల శాతం గణనీయంగా పడిపోయి బడిబయటే పిల్లల భవిష్యత్ బుగ్గవుతుండటం చర్చనీయాంశం అవుతోంది.