సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బాలల భావి భారతం బడిబయట మగ్గుతోంది. బడిలో ఉండాల్సిన పిల్లలు హోటళ్లు, కార్ఖానాలు, చేలలో, కూలీలుగా మారుతున్నారు. పలక, బలపం పట్టాల్సిన చేతులు పలుగు, పార పడుతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా.. రూ.కోట్లు కుమ్మరించినా, విద్యాహక్కు చట్టం అమలులోకి తెచ్చినా డ్రాపౌట్స్ పెరుగుతున్నారు. బడిఈడు పిల్లలను బడిలోనే ఉంచాలనే విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం జిల్లా ఆర్వీఎం అధికారులు జూన్‌లో నిర్వహించిన సర్వేలో 3,536 మంది బడి బయట ఉన్నట్లు గుర్తించారు. వారిని బడిలో చేర్పించేందుకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించిన ఆర్వీఎం 1,327 మందిని బడిబాట పట్టించి నట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. అయినా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు చదువులకు దూరం కాగా, రూ.కోట్లు వెచ్చించినా ఫలితం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
విద్యాహక్కు చట్టం ఏం చెప్తుంది..
విద్యాహక్కు చట్టం ప్రకారం ఆరేళ్ల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు బడిలో ఉండాలనేది నిబంధన. ఇందుకోసం ఆర్వీఎం బాలకార్మిక నిర్మూలన వ్యవస్థ, కార్మిక శాఖలు సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నా అంతగా ప్రయోజనం లేదు. చాలా మంది పిల్లలు బడికి దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇంటింటికి సిబ్బందిని పంపించి మరీ సర్వే జరిపించాలని ఇటీవలే మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆర్వీఎం అధికారులను సూచించింది. ఈ మేరకు 52 మండలాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సర్వే జరిపారు. ప్రతి గ్రామంలోనూ సర్వే నిర్వహించి అత్యధికంగా కాగజ్‌నగర్ మండలంలో 506 మంది, అత్యల్పంగా కాసిపేట, భీమిని, దండేపల్లి మండలాల్లో ముగ్గురు చొప్పున పిల్లలు బడిబయట ఉన్నట్లు సర్వేలో తేలింది.
రూ.లక్షలు వెచ్చించినా ఫలితం శూన్యం..
ఈ ఏడాదిలో బడిబాట, విద్యా సంబరాల కోసం పాఠశాలలకు కేటాయించిన స్కూల్ గ్రాంట్స్ నుంచి నిధులు ఖర్చు చేయాలని ఆర్వీఎం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రాథమిక 3,084, ప్రాథమికోన్నత 444, ఉన్నత పాఠశాలలు 543 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలకు స్కూల్‌గ్రాంట్స్ నుంచి రూ.500 ఖర్చు చేయాలని, ప్రాథమికోన్నత పాఠశాలలు రూ.750 ఖర్చు చేయాలని పేర్కొన్నారు. విద్యా సంబరాల కోసం ఒక్కో ఎంఈవె నెల కోసం వాహనం పేరిట రూ.24 వేలు ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టుకున్నారు. కాగా ప్రచారం కోసం రూ.60 వేల కరపత్రాలు, పోస్టర్లు ప్రింటింగ్ చేసినట్లు ఆర్వీఎం రికార్డులు చెప్తున్నాయి. రూ.40 వేల అడ్మిషన్ ఫారాలను ప్రింటింగ్ చేయించారు. 4 వేల బ్యానర్లు తయారు చేయించారు. కరపత్రాలు, పోస్టర్ల కోసం రూ.7.34 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. 4 వేల బ్యానర్ల కోసం రూ.13 లక్షలు ఖర్చు చేసినట్లు ఆర్వీఎం అధికారులు తెలిపారు. మొత్తంగా రూ.50 లక్షలకేపైనే బడిబయట పిల్లల కోసం ఖర్చు చేసినట్లు చెప్తున్నా... విద్యార్థుల శాతం గణనీయంగా పడిపోయి బడిబయటే పిల్లల భవిష్యత్ బుగ్గవుతుండటం చర్చనీయాంశం అవుతోంది.
బడి బయట.. ‘బాల’ భారతం
Published Fri, Nov 29 2013 6:11 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement