సాక్షి, ఆదిలాబాద్ : ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా విద్యాశాఖ తీరు మారడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం విద్యాశాఖలో కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాల్సి ఉండగా సీఎం పేషి నుంచి నేరుగా బదిలీ ఉత్తర్వులు పొంది తమకు నచ్చిన చోట పోస్టింగ్ పొందుతున్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతీయేట కొంతమంది ఉపాధ్యాయులు అక్రమంగా బదిలీలు పొందుతున్నారు. అయితే అంతర్‌జిల్లా బదిలీల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 17మంది ఉపాధ్యాయులకు మంగళవారం బదిలీలు జరిగాయి.
అందులో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకరికి బదిలీ చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న ఓ టీచర్ ఆదిలాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఆ గురువుకు విద్యాశాఖ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మంగళవారం పోస్టింగ్ ఇచ్చారు. కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం నిరీక్షిస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించకుండా చేసిన బదిలీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డిని వివరణ కోరగా నిర్మల్ నుంచి ఆదిలాబాద్‌కు ఓ ఉపాధ్యాయురాలి బదిలీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆమె ఉత్తర్వులు తీసుకురావడంతో ఈ మేరకు బదిలీ చేసినట్లు వివరించారు.
అక్రమ బదిలీలను రద్దు చేయాలి
గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం నుంచి అంతర్‌జిల్లా బదిలీ పొందిన ఉపాధ్యాయుల బదిలీలను రద్దు చేయాలని టీఎస్‌టీటీఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జాదవ్ చంద్రకాంత్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 17 మంది ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడిచి ఎవరికి తెలియకుండా బదిలీలు పొందారన్నారు. బదిలీల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. వెంటనే బదిలీ ప్రక్రియ, పదోన్నతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్రమ బదిలీలను రద్దు చేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment