జోడుగా.. హుషారుగా.. కళ్లకు కాటుక.. ప్రత్యేక మసాజ్‌లు | Growing Interest In Bull Race Competitions | Sakshi
Sakshi News home page

జోడుగా.. హుషారుగా.. కళ్లకు కాటుక.. ప్రత్యేక మసాజ్‌లు

Published Sun, Apr 24 2022 10:32 AM | Last Updated on Wed, Jun 29 2022 4:38 PM

Growing Interest In Bull Race Competitions - Sakshi

పందెంలో పాల్గొనే ఎద్దు కంటికి కాటుక దిద్దుతున్న రైతు నూకరాజు

పిఠాపురం(కాకినాడ జిల్లా): వ్యవసాయంలో ప్రత్యేక పాత్ర పోషించిన ఎడ్లు.. నేడు పరుగు పందేల్లోనూ సత్తా చాటుతున్నాయి. గతంలో పండగ రోజులు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నిర్వహించే ఎడ్ల పరుగు పందేలు నేడు మామూలు సందర్భాల్లోనూ కొనసాగుతున్నాయి. కేవలం పందెంలో గెలుపే లక్ష్యంగా రూ.లక్షలు వెచ్చించి మరీ ఈ ఎడ్లను రైతులు పెంచడం విశేషం. పందెంలో గెలిస్తే వచ్చేది చిన్న మొత్తమే అయినప్పటికీ దాని ద్వారా వచ్చే సంతృప్తి వెల కట్టలేనిదని వారు చెబుతున్నారు. జిల్లాలో ప్రతి నెలా ఏదో ఒకచోట ఈ ఎడ్ల పరుగు పందేలు జరుగుతుండగా, రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచీ రైతులు తమ ఎడ్లను తీసుకు వస్తున్నారు. జిల్లాలో లైను పందేలు ఆడుతుండగా, ఇతర జిల్లాల్లో రౌండు పందేలు ఆడుతుంటారు.
చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు 

ప్రత్యేక శిక్షణ
పరుగు పందేల్లో పాల్గొనే ఎడ్లకు గిత్త ప్రాయం నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఏడాది వయసులో ఉండగానే చిన్న సైజు బళ్లకు కట్టి పరుగులో శిక్షణ ఇస్తుంటారు. మామూలు ఎద్దుల్లా కాకుండా నిత్యం బండి కట్టి పరుగులు పెట్టిస్తూ సమయానుకూలంగా దూరాలకు పరుగెత్తిస్తుంటారు. సాధారణంగా మైసూరు, దేశవాళీ ఎడ్లను పరుగు పందేలకు వినియోగిస్తారు. ఈ పందేల్లో పాల్గొనే ఎద్దు రేటు రూ.లక్షల్లో పలుకుతుంది. ఒక్కో ఎద్దు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ పలుకుతున్నాయి. ఒకే రకంగా ఒకే జాతికి చెందిన రెండు ఎడ్లను కొనడానికి ఎంత ఖర్చయినా రైతులు వెనుకాడడం లేదు.

మేత కూడ ప్రత్యేకమైనదే
పందేల్లో పాల్గొనే ఎడ్లకు ప్రత్యేక దాణా పెడుతుంటారు. ఉలవలు, రాగులు, జొన్నలు ప్రతి రోజూ ఉడకబెట్టి, నానబెట్టిన ఎండుగడ్డి ముక్కల్లో వేసి, దాణాగా మేపుతారు. మేతకు సంవత్సరానికి సుమారు రూ.3 లక్షల వరకూ వ్యయమవుతుందని రైతులు చెబుతున్నారు. పందేలున్నా లేకపోయినా వీటి ఆరోగ్యంపై శ్రద్ధ తప్పదని, మేతలో ఎప్పుడూ మార్పు లేకుండా ఖర్చుకు వెనుకాడకుండా మేపాల్సి ఉంటుందని అంటున్నారు.

సాధారణంగా బరువులు లాగే ఎడ్ల బళ్లు చాలా బరువుగా పటిష్టంగా పెద్దపెద్ద చక్రాలతో ఉంటాయి. ప్రస్తుతం ఆ చక్రాల స్థానంలో టైర్లు వచ్చాయి. గతంలో కేవలం ప్రత్యేకమైన చెక్కతో చేసిన చక్రాల బళ్లుండేవి. కానీ పరుగు పందేల్లో ఉపయోగించే బళ్లను మాత్రం ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. బరువు తక్కువగా ఉండేలా పటిష్టంగా చిన్న సైజులో అందంగా తయారు చేయిస్తారు. వాటికి వివిధ రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు.

పందేలకు వెళ్లడమూ ప్రయాసే
రాష్ట్రంలో ఎక్కడ ఎడ్ల పందేలు జరిగినా ఎంతో వ్యయప్రయాసలకోర్చి వెళుతుంటారు. ఇటీవల జిల్లాలో జరిగిన పలు ఎడ్ల పందేలకు ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖ, కడప, నెల్లూరు తదితర జిల్లాల నుంచి రైతులు తమ ఎద్దులను తీసుకువచ్చి పందేల్లో పాల్గొన్నారు. ఇతర జిల్లాల్లో జరిగే పందేలకు ప్రైవేటు వాహనాలపై ఎడ్లబళ్లను తీసుకువస్తారు. ఇందుకు నిర్వాహకులు ఎటువంటి ఖర్చులూ ఇవ్వకపోయినా సుమారు రూ.50 వేల వరకూ సొంత ఖర్చులు పెట్టుకుని మరీ పందేలకు వెళ్తుంటారు. పందేనికి రెండు రోజులు ముందుగానే ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడి ప్రదేశాలను ఎడ్లకు అలవాటు చేస్తుంటారు. పందెం జరిగే ప్రాంతంలో పందేనికి ముందు రోజు ఎడ్లను పరుగులు పెట్టించి శిక్షణ ఇస్తారు.

కళ్లకు కాటుక.. ప్రత్యేక మసాజ్‌లు
కంటిలో లోపం రాకుండా దుమ్ము, ధూళి పడినా కంటి చూపు దెబ్బతినకుండా లక్ష్యం వైపు దూసుకుపోయేలా పందెం ఎడ్ల కళ్లకు కాటుక పెడుతుంటారు. పరిగెట్టి అలిసిపోయిన ఎడ్లకు మనుషుల మాదిరిగానే జండూబామ్‌ వంటి వాటితో మసాజ్‌ చేస్తుంటారు. ప్రతి రోజూ పరుగులో శిక్షణ అనంతరం మసాజ్‌ చేయకపోతే కాళ్లు పట్టేసి పరుగుకు ఇబ్బందిగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. అందుకే పరుగు పెట్టిన ప్రతిసారీ తప్పనిసరిగా మసాజ్‌ చేయాల్సి ఉంటుందంటున్నారు. 

పందెం కొడితే విలువ పెంపు..
పందెంలో గెలిచిన ఎడ్లకు ఎనలేని గిరాకీ ఉంటుంది. ఎన్ని పందేలు కొడితే అంత విలువ పెరగడంతో పాటు పోటీపడి మరీ ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ పందేలు కొట్టిన ఎద్దులు ఒక్కొక్కటి సుమారు రూ.మూడు నాలుగు లక్షలకు అమ్ముడవుతాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చిన రైతులు పందేలు ఎక్కువగా గెలిచే ఎడ్లను కొనుగోలు చేస్తుంటారు.

గెలుపుతో వచ్చే ఆనందం వెలకట్టలేనిది
మా కుటుంబంలో పూర్వం నుంచీ ఎడ్లను పోషిస్తున్నాం. ముఖ్యంగా పరుగు పందేలంటే మాకు చాలా ఇష్టం. మా దగ్గర పాత ఎడ్లు ఉండగా, రెండేళ్ల క్రితం మరో జత ఎడ్లను రూ.4.50 లక్షలకు కొనుగోలు చేసి తీసుకువచ్చాం. ఇవి శిక్షణ పొందినవి కావడంతో ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొంటున్నాం. ఇప్పటి వరకు 15 పోటీల్లో పాల్గొనగా, ఆరుసార్లు రాష్ట్రస్థాయి విజేతలుగా నిలిచాయి. పందెం ఎడ్లలో సీనియర్స్, జూనియర్స్‌ విభాగాలు ఉంటాయి. మా ఎడ్లు సీనియర్స్‌ విభాగంలోకి వస్తాయి. ఇటీవల జిల్లాలో పలుచోట్ల జరిగిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సా«ధించాయి. ఏటా వీటి పోషణకు రూ.లక్షలు ఖర్చవుతున్నా, పోటీల్లో గెలుపు సాధించినప్పుడు వచ్చే ఆనందం వెలకట్టలేనిది.
– సత్యేంద్రకుమార్, రైతు, సామర్లకోట  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement