భారతమాలకు రహదారులు | Three national highways in four rows | Sakshi
Sakshi News home page

భారతమాలకు రహదారులు

Published Thu, Mar 2 2023 4:13 AM | Last Updated on Thu, Mar 2 2023 3:02 PM

Three national highways in four rows - Sakshi

సాక్షిప్రతినిధి, కాకినాడ: భారతమాల ప్రాజెక్టు వేగం పుంజుకుంది. గడువులోగా దీనిని పూర్తి చేయాలనే సంకల్పంతో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి దోహదపడేలా రూపొందించిన ఈ ప్రాజెక్టుల కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రధానంగా కాకినాడ యాంకరేజ్‌ పోర్టు, తొండంగి సమీపాన గేట్‌వే ఆఫ్‌ పోర్టు కాకినాడను ఒకపక్క విశాఖపట్నం, మరోపక్క ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలను అనుసంధానించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు మూడు జాతీయ రహదారులను భారతమాల ప్రాజెక్టు కింద నాలుగు వరుసలుగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒకటి లేదా, రెండేళ్లలో పనులను పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ గట్టిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా భూ సేకరణ, టెండర్ల ఖరారు పనులు యుద్ధ ప్రాతిపదికన  జరుగుతున్నాయి. 

వడివడిగా.. 
కాకినాడ అచ్చంపేట జంక్షన్‌ నుంచి యాంకరేజ్‌ పోర్టు వరకు 13.20 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి రానుంది. ఏడాది వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో పనుల వేగం పెంచారు. ఇక్కడ భూసేకరణ అవసరం లేకుండానే ఉన్న రోడ్డునే నాలుగు లేన్లుగా ఆధునీకరిస్తున్నారు. టెండర్లు ఖరారు కావడంతో రూ.90 కోట్ల అంచనాతో పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుత రోడ్డును ఇరువైపులా వెడల్పు చేస్తూ నాలుగు వరుసలుగా చేపట్టడంలో అధికారులు నిమగ్నమయ్యారు. 

అవుటర్‌ రింగ్‌ రోడ్డు తరహాలో.. 
కాకినాడ వాకలపూడి లైట్‌హౌస్‌ నుంచి అన్నవరం మీదుగా కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారితో అనుసంధానించనున్నారు.  
 40.32 కిలోమీటర్లు నిడివి కలిగిన ఈ నాలుగు వరుసల జాతీయ రహదారిని తొలుత రూ.776.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. 
కాకినాడ పోర్టు, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి, కాకినాడ గేట్‌వే పోర్టు, ఉప్పాడ ఫిష్షింగ్‌ హార్బర్‌ మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్లనుంది.  
వాకలపూడి జంక్షన్‌లో ఒక ఫ్‌లై ఓవర్, అన్నవరం, కాకినాడ సెజ్, హార్బర్‌ల వద్ద అండర్‌పాస్‌లను నిర్మించాల్సి ఉంటుంది.  
హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు తరహాలో ఈ జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. 
ఇప్పుడు రహదారి అంచనా వ్యయం రూ.1400 కోట్లకు పెరిగింది.  
 ఎక్కువగా భూ సేకరణ చేయాల్సి వస్తోంది. ఇందుకు రూ.160 కోట్లకుగాను ఇప్పటికే రూ.56 కోట్లు విడుదల చేశారు.  
రెండేళ్లలోపు అందుబాటులోకి తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. 
తొండంగి, శంఖవరం, యు కొత్తపల్లి, కాకినాడ రూరల్‌ మండలాల్లోని 21 గ్రామాల మీదుగా ఈ జాతీయ రహదారి సాగుతుంది.   

చకచకా భూసేకరణ 
ఉమ్మడి తూర్పులో పారిశ్రామికాభ్యున్నతికి సామర్లకోట–అచ్చంపేట జాతీయ రహదారి బాటలు వేయనుంది. రూ.395.60 కోట్ల అంచనాతో 12.25 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి కోసం 33 ఎకరాల ప్రైవేటు భూమి, 21 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరమవుతోంది. ఇందుకు నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది.

ఈ హైవేలో సగం గ్రీన్‌ఫీల్డ్‌ (పొలాల మధ్య) ఉంటుంది. కాకినాడ–పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని రాక్‌ సిరామిక్స్‌ వద్ద ప్రారంభమై ఎఫ్‌సీఐ గోడౌన్స్, సుగర్‌ ఫ్యాక్టరీ, కెనాల్‌ రోడ్డు మీదుగా ఉండూరులో ఇది కలవనుంది. అచ్చంపేట జంక్షన్‌లో ఒక ఫ్లైఓవర్‌ నిర్మించాల్సి ఉంది. చురుగ్గా భూ సేకరణ చేపడుతున్నారు. 13 కిలోమీటర్ల మేర పనులు మొదలయ్యాయి.

33.92 హెక్టార్ల భూమి సేకరించి ఏడాదిలోపు ఈ హైవే పనులను పూర్తి చేయనున్నారు. ఈ రహదారి సామర్లకోట, కాకినాడ రూరల్‌ మండలాల్లో ఆరు గ్రామాల మీదుగా ప్రయాణిస్తుంది. నాలుగు వరుసల మూడు ప్రధాన జాతీయ రహదారులతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో తీరానికి అనుసంధానమవుతుంది. తద్వారా పారిశ్రామిక ప్రగతికి మార్గం సుగమమం అవుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement