గొంతు విప్పితే డీజే తలొంచాల్సిందే. యువతను ఉర్రూతలూగిస్తున్న గాత్రం. గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడిగా రాణిస్తున్న కోలంక ..యువకుడు రామ్ మిరియాల.
పిఠాపురం: ఆయన పాడితే అది పక్కా లక్ష్మీపటాస్ బాంబ్‌లా పేలుతుంది. గళం విప్పితే డీజేను మించి రీసౌండ్ వస్తుంది. పల్లె నుంచి పట్నం వరకూ అందరూ మెచ్చే పాట అతనిది. చౌరస్తాలో గట్టిగా కేక వేస్తే జనం గుమ్మిగూడాల్సిందే. ఒక్కసారి ఆయన పాట వింటే ఫిదా అవ్వాల్సిందే. ఆయనే వర్ధమాన సింగర్ రామ్ మిరియాల. చిట్టి నీ నవ్వంటే.. అని గొంతు విప్పితే అందరూ కోరస్ పాడారు. మాయా.. అంటూ పాడితే పాటల అభిమానులు ఆయన మాయలో పడిపోయారు. డీజే టిల్లు... అని రాగం అందుకుంటే తీన్‌మార్ స్టెప్‌లు వేశారు. బీమ్లా నాయక్ వంటి టైటిల్ సాంగ్‌తో కుర్రకారును ఒక ఊపు ఊపేశాడు. తెలుగు పాటకు వెస్ట్రన్ జోడించే తీరును చూసి మంత్రముగ్దులయ్యారు.
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కోలంకలో రైతు కుటుంబంలో పుట్టిన రామ్ ఇంటర్ వరకు పిఠాపురంలో చదివారు. బీకాం హైదరాబాద్‌లో చదివారు. సొంత ఊరిలో వేరే పేర్లతో పిలిచినా సినిమా రంగానికి రామ్ మిరియాలగానే పరిచయమయ్యారు. చదువు పూర్తయ్యాక ఒక కార్పొరేట్ కంపెనీలో ట్యాక్స్ కన్సల్లెంట్‌గా చేరారు. పాటే ప్రాణమైన రామ్ తర్వాత తన అభిరుచికి తగ్గట్టుగా రేడియో మిర్చిలో ప్రోమో ప్రొడ్యూసర్‌గా చేరారు. స్నేహితులతో కలిసి చౌరస్తా బ్యాండ్‌ను ప్రారంభించారు.
రెండు యాసల్లో సునాయాసంగా..
ఇది యువతను ఉర్రూతలూగించింది. యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్‌ను సంపాదించి పెట్టింది. అందరితో స్టెప్పులేయించింది. అనతి కాలంలోనే రామ్ మంచి సింగర్‌గా రాణించారు. ప్రస్తుతం పెద్ద పెద్ద బ్యానర్ సినిమాల్లో పాటలు పాడే అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఫ్లూట్ వాయించడంలో ఈయనకు మంచి ప్రావీణ్యముంది. ఎవరైనా తమది కాని యాసలో మాట్లాడాలన్నా.. పాట పాడాలన్నా కష్ట పడాలి. రామ్ మాత్రం ఆంధ్ర, తెలంగాణ మాండలికాల్లో సునాయాసంగా పాటలు పాడుతున్నారు.
హైదరాబాద్ వెళ్లి సుమారు 20 ఏళ్లు ఉండడంతో పాటు అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. ఎక్కువ కాలం ఉండటంతో రెండు యాసల్లోనూ పాటలు పాడడం కొంత సులభమైందంటారు రామ్. చిట్టి నీనవ్వంటే. సాంబశివా నీదు మహిమ, సిలకా ఎగిపోయావా అంటూ ఈ మూడు పాటలు పాడింది ఆయనే. కానీ మూడు పాటల్లో మూడు వేర్వేరు గొంతులు వినిపించినట్టుంటాయి. పాటకు తగ్గట్టుగా గొంతును ట్యూన్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ప్రతీ పాట
ఆణిముత్యామే..
‘చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా.. కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా’ అంటూ రామ్ కరోనా సమయంలో పాడిన పాట జనం గుండెలను హత్తుకుంది. హైదరాబాద్ నుంచి ఖమ్మం, మారేడుమిల్లి మీదుగా కోలంక వస్తూ మార్గంలో ఎదురయ్యే పరిస్థితులను ‘ఊరెళ్లి పాతా మామా.. ఊరెళ్లి పోతా.. ఎర్ర బస్సెక్కి మళ్లీ తిరిగెళ్లిపోతా’ అంటూ పాటగా మలిచారు. ‘చూపుకేమో శ్రీదేవి.. వగలుపోయే వయ్యారి.. భాషలన్నీ ఇడిసేసి.. నన్ను ఒగ్గేసిపోనాది’ అంటూ ఓ ప్రేమికుడి వ్యధను గొంతులో పలికించి కేరీర్‌లో తొలి పాటకు శ్రీకారం చుట్టారు. గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్ వంటి వారు రాసిన పాటలు పాడి మైమరిపింపజేశారు. పేరొందిన సింగర్లతో కలిసి పాడే అవకాశాలను దక్కించుకుంటున్నారు.
సంగీతమంటే చాలా ఇష్టం
చిన్నప్పటి నుంచి సంగీతంపై మమకారం. ఈ ఉత్సాహంతోనే ప్త్రెవేటు సాంగ్స్‌పాడాను. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ వంటి హీరోల సినిమాలకు పాటలు పాడాను. డీజే టిల్లు–2 సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాను. సినిమా పాటల అవకాశాలు పెరుగుతున్నాయి. ఎవరు ఏ రంగంలో ఏది సాధించాలన్నా ముందు పట్టుదల ఉండాల్సిందే. అందరి సహకారంతో ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో నిలదొక్కుకుంటున్నా . ‘ఊరెళ్లి పాతా మామ..పాట నాకు చాలా ఇష్టం. మనసు పెట్టి రాశాను. చాలా మంచి గుర్తింపు తెచ్చింది.
– రామ్ మిరియాల, సంగీత దర్శకుడు, సింగర్
Comments
Please login to add a commentAdd a comment